ఘనతంత్రం
Published Mon, Jan 27 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రాష్ర్ట వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గణతంత్ర వేడుకలు అంబరాన్ని తాకాయి. మెరీనా తీరంలో రాష్ట్ర ప్రథమ పౌరుడు కొణిజేటి రోశయ్య జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి జయలలిత పతకాలను అందజేశారు.
సాక్షి, చెన్నై:65వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వాడవాడలా ఆదివారం ఉదయం జాతీయ పతాకాలు నింగికెగిశాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కోర్టులు, విద్యాసంస్థల్లో జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాకాలు ఆవిష్కరించి పిల్లలకు మిఠాయిలు పంచి పెట్టారు. ఉత్తమ సేవలకు సత్కరించుకున్నారు. ఆయా విద్యాసంస్థల్లో జరి గిన వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతికోత్సవాలు అలరించాయి. చెన్నై మెరీనా తీరంలో రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో వేడుకలు కోలాహలంగా జరిగాయి. మహా త్ముడి విగ్రహం వద్ద జరిగిన వేడుకల్ని తిలకించేందుకు ఉదయాన్నే జన సందోహం తరలి వచ్చింది. మువ్వన్నెల పతాకాన్ని చేత బట్టి బారులు తీరిన జన సందోహంతో మెరీనా తీరంలో దేశభక్తి ఉప్పొంగింది. ఆ పరిసరాల్లో వివిధ రంగుల పుష్పాలతో చేసిన అలంకరణలు చూపరులను ఆకర్షించాయి.
రెపరెపలు: ఉదయం పోయేస్ గార్డెన్ నుంచి గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి జయలలితకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, డీజీపీ రామానుజం ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి లైట్ హౌస్ వరకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనసందోహానికి గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ జయలలిత అభివాదం చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను ఆహ్వానించిన జయలలిత త్రి దళాల అధిపతులను పరిచయం చేశారు. రాష్ట్ర డీజీపీ రామానుజం, శాంతి భద్రతల విభాగం ఏడీజీపీ రాజేంద్రన్, చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ రోశయ్యను జెండా స్థూపం వద్దకు ఆహ్వానించారు. జాతీయ పతాకాన్ని రోశయ్య ఎగుర వే యగా, భారత కోస్ట్‌గార్డ్ హెలికాఫ్టర్‌లో ఆకాశం నుంచి పూల వర్షం కురిపించింది. జాతీయ పతాకానికి రోశయ్య, జయలలితతో పాటుగా మెరీనా తీరంలో గుమికూడిన ప్రతి ఒక్కరూ గౌరవ వందనం సమర్పించారు.
ఆ తర్వాత త్రివర్ణ దళాల కవాతు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, మహిళా కమాండో బలగాలు విన్యాసాలు, అశ్వదళాల మార్చ్ ఫాస్ట్ అలరించాయి.సాంస్కృతిక వేడుక: తమిళనాడు చరిత్రను, సంప్రదాయాన్ని, గ్రామీణ కళల్ని చాటి చెప్పే రీతిలో విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఈ ఏడాది గుజరాత్, ఒడిశా, పంజాబ్ సంప్రదాయ నృత్య రూపకాలను ప్రదర్శించి అలరించారు. ప్రభుత్వ ప్రగతిని చాటే రీతిలో ఆయా విభాగాల శకటాల ప్రదర్శన ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేశాయి. గత ఏడాది కొత్తగా ప్రవేశ పెట్టిన అమ్మ క్యాంటీన్, తోట, పచ్చదనం కూరగాయల దుకాణాల పథకాల ప్రగతిని చాటుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతూ రాష్ర్ట పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్యలు, ప్రగతి రథ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పతకాల ప్రదానం: గణతంత్ర వేడుకల్లో సాహస వీరులకు పతకాలను ముఖ్యమంత్రి జయలలిత ప్రదానం చేశారు. ప్రమాదాలు సంభవించినప్పుడు వీరోచితంగా శ్రమించిన వారికి అన్నా పతకాల్ని అందజేశారు. వీరిలో వీ కరుప్పయ్య(దిండుగల్), దిగ్వీశ్వరన్(కోయంబత్తూరు), ఎస్ గోపినాథ్ శివకుమార్ (కన్యాకుమారి), అటవీ శాఖ అధికారులు రహ్మద్ షా, గుణేంద్రన్, బాల్య వివాహాల అడ్డుకట్టలో రాణిస్తున్న కె పెచ్చియమ్మాల్ ఉన్నారు. ఈ పతకం గ్రహీతలకు రూ.లక్ష అందజేశారు. ఇక మత సామరస్య అవార్డును, రూ.25వేలు నగదును కోయంబత్తూరుకు చెందిన ఏఆర్ బషీర్‌కు ఇచ్చారు. సారాను, నకిలీ మద్యాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు దేవరాజ్, సురేష్‌కుమార్(ఈరోడ్), మది(చెన్నై), పెరియస్వామి(సేలం)కు గాంధీ అడిగలార్ బిరుదు, రూ.20 వేలు చొప్పున అందజేశారు. గత ఏడాది తొలిసారిగా వరి సాగులో ఆధునికతను ప్రదర్శించిన వారికి వ్యవసాయ శాఖ ప్రత్యేక అవార్డు, రూ.ఐదు లక్షల నగదును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను ఈ అవార్డును ఈరోడ్‌కు చెందిన రైతు పరమేశ్వరన్ దక్కించుకున్నారు.
బహుమతులు: రాజ్ భవన్‌లో తేనీటి విందు జరిగింది. రాష్ట్ర గవర్నర్ రోశయ్య, సీఎం జయలలిత,మంత్రులు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఉత్తమ శకటాలను, సాంస్కృతిక వేడుకలతో ప్రతిభను చాటిన పాఠశాలలు, స్కూళ్లను ప్రకటించారు. రాష్ట్ర పోలీసు శాఖ శకటం తొలి బహుమతిని, సమాచార శాఖ శకటం రెండో బహుమతిని, ఉద్యానవన శాఖ మూడో బహుమతిని సాధించారుు. సాంస్కృతిక ప్రదర్శనలకు గాను పాఠశాల స్థాయిలో తొలి బహుమతి శాంతోమ్‌లోని సెయింట్ రఫెల్స్ బాలికల మహోన్నత పాఠశాల, రెండో బహుమతిని అశోక్ నగర్ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాల, మూడోబహుమతిని జీఆర్‌టీ మహాలక్ష్మి విద్యాలయ మెట్రిక్యులేషన్ స్కూల్ దక్కించుకున్నారుు. కళాశాల స్థాయిలో క్విన్ మెరీస్ కళాశాల తొలి బహుమతి, గురుజీ శాంతి విజయ జైన్ మహిళా కళాశాల రెండో బహుమతిని, ఎతిరాజ్ కళాశాల మూడో బహుమతిని కైవశం చేసుకున్నాయి.
బన్రూటికి బిరుదు ప్రదానం : రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ప్రతి ఏటా తిరువళ్లువర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళ మేధావులు, సమాజ హితాన్ని కాంక్షిస్తూ సేవలు అందిస్తున్న వారికి బిరుదుల్ని ప్రకటిస్తున్నారు. ఈ ఏడాదికి గాను దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి అన్నా బిరుదుకు బన్రూటి రామచంద్రన్ ఎంపికయ్యారు. తిరువళ్లువర్ బిరుదును యూసీ(తైవాన్), ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ బిరుదును అన్నాడీఎంకే నాయకురాలు సులోచనా సంపత్, అంబేద్కర్ బిరుదును ప్రొఫెసర్ ఎం ప్రకాష్, విద్యా ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ బిరుదును అయ్యారు వాండయార్, భారతీయార్ బిరుదును ప్రొఫెసర్ కె జ్ఞాన సంబంధన్, భారతీ దాసన్ బిరుదును రాధాచల్లప్పన్, తిరువికా బిరుదును అశోక్ మిత్రన్, ముత్తమిళ్ కావలర్ విశ్వనాథన్ బిరుదును ప్రొఫెసర్ జయ దేవన్‌కు ప్రకటించారు. తిరువళ్లువర్ దినోత్సవం రోజున యూసీకి తిరువళ్లువర్ బిరుదు ప్రదానం చేయడం జరిగింది. మిగిలిన వారికి ఉదయం సచివాలయంలో జరిగిన వేడుకలో సీఎం జయలలిత చేతుల మీదుగా బిరుదులతో పాటుగా సర్టిఫికెట్లు, తలా రూ. లక్ష నగదు, ఒక సవరం బంగారు పతకం అందజేశారు.
Advertisement
Advertisement