కళ్లద్దాలు ఉన్నాయని...? | 30.78 percent students failed in telugu subject in inter exams | Sakshi
Sakshi News home page

కళ్లద్దాలు ఉన్నాయని...?

Published Mon, Apr 27 2015 8:13 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

అమ్మ భాష మాట్లాడినందుకు శిక్షగా ఇకపై తెలుగులో మాట్లాడబోమంటూ చిన్నారుల మెడలో బోర్డులు కట్టిన టీచర్లు(ఫైల్)

అమ్మ భాష మాట్లాడినందుకు శిక్షగా ఇకపై తెలుగులో మాట్లాడబోమంటూ చిన్నారుల మెడలో బోర్డులు కట్టిన టీచర్లు(ఫైల్)

(సాక్షి వెబ్ ప్రత్యేకం)
తేనె లొలుకు తెలుగుకు అవమానం. తెలుగుజాతి తలదించుకోవాల్సిన సందర్భం. మాతృభాషాభిమానులకు మింగుడు పడని వాస్తవం. అన్యభాషపై మోజుతో అమ్మభాషను నిర్లక్ష్యం చేస్తున్న వైనం.. వెరసి విద్యాలయాల్లో మాతృభాష ఆదరణ కోల్పోతోంది. ఆంగ్ల వ్యామోహంలో పడి తల్లి భాషను నిర్లక్ష్యం చేస్తున్న నేటి తరం తెలుగులో నెగ్గుకురాలేక పోవడం నివ్వెరపరుస్తోంది.

ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు తెలుగు పరీక్షలో ఫెయిల్ అయ్యారన్న చేదునిజం అమ్మభాషాభిమానులను అవాక్కయ్యేలా చేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో 30.78 శాతం, రంగారెడ్డి జిల్లాలో 37.26 శాతం మంది విద్యార్థులు తెలుగులో తప్పారు. ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగులో ఫెయిల్ కావడం దిగ్భ్రాంత పరుస్తోంది. ఆంగ్లంలో పోల్చుకుంటే (11శాతం) అమ్మభాషలో ఫెయిలయిన వారి సంఖ్య అధికంగా ఉండడం ఆవేదన కలిగిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పరిస్థితి కాస్త అటుఇటుగా ఇలాగే ఉంది. తెలుగు సబ్జెక్టులో తప్పుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే తల్లి భాషను మనమెంత నిర్లక్ష్యం చేస్తున్నామో అర్థమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషకు ముప్పు ఏర్పడింది. అన్యభాషను నెత్తికెత్తుకుని అమ్మ భాషకు ద్రోహం చేస్తున్నాం. తమిళులు, కన్నడిగులు కన్నతల్లి కంటే ఎక్కువగా భాషను సాకుతుంటే మనం మాత్రం చంపేస్తున్నాం. తెలుగులో చదవడం, సంభాషించడం నమోషీగా భావిస్తున్నాం. తల్లి భాషలో మాట్లాడితే టీచరమ్మలతో తన్నులు తినే విచిత్ర పరిస్థితి ఒక్క తెలుగు నేలపైనే ఉంది.

కళ్లద్దాలు ఉన్నాయని కళ్లు పొడుచుకున్న చందంగా తయారైంది తెలుగువారి పరిస్థితి. అమ్మ భాషలో చదివితే ఆంగ్లం రాదన్న అపోహతో పిల్లలపై బలవంతంగా అన్యభాషను రద్దుతున్నారు. మాతృభాషలో అభ్యసిస్తే విషయ పరిజ్ఞానం పెరగడంతో మానసిక వికాసం వృద్ధిచెందుతుందన్న వాస్తవాలను పెడచెవిన పెడుతున్న మమ్మీ-డాడీలు ఇంగ్లీషు చదువులను 'కేజీ'ల కొద్ది మోయిస్తున్నారు. దీనికితోడు పాలకుల ఉదాసీన వైఖరి మాతృభాష పాలిట మరణశాసనంగా మారింది. పోటీ ప్రపంచంలో బహు భాషా పరిజ్ఞానం కావాల్సిందే. కానీ నేల విడిచి సాము చేసినట్టుగా అమ్మ భాషను వదిలేసి అన్యభాషలను అందలమెక్కించడం అవివేకం. భాష మాయమైతే జాతి జాడ మిగలదు జాగ్రత్త!

- పి. నాగశ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement