telugu exam
-
ప్రపంచ వ్యాప్తంగా మనబడి తెలుగు పరీక్షలు
అమెరికా : సిలికానాంధ్ర మనబడి ద్వారా తెలుగు భాష సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ఈ నెల 12న పరీక్ష నిర్విహించారు. 2017-18 విద్యా సంవత్సారానికి గాను 1933 మంది విద్యార్థులు, ప్రపంచ వ్యాప్తంగా 58 కేంద్రాల్లో పరీక్షలు రాశారు. దీనిలో 1400 మంది జూనియర్, 533 మంది సీనియర్ సర్టిఫికెట్ కోసం పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అలేఖ్య పుంజల మాట్లాడుతూ.. ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా పిల్లలకు తెలుగు భాష నేర్పించటానికి కృషి చేస్తున్న తల్లిదండ్రులను అభినందనలు తెలిపారు. మనబడి అధ్యక్షుడు రాజు చమర్తి మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా 35 వేల మందికి పైగా బాలబాలికలు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారని తెలిపారు. 250 కేంద్రాల ద్వారా తెలుగు నేర్పిస్తున్న మనబడి విద్యావిధానానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, అమెరికలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ అర్హత కూడా ఉందన్నారు. అంతే కాకుండా వెస్టెన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజ్స్ గుర్తింపు పొందిన ఏకైక తెలుగు నేర్పే విద్యావిధానం మనబడి మాత్రమేనని తెలిపారు. అయితే ఈ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలేఖ్య, పరీక్షల నియంత్రణాధికారి రెడ్డి శ్యామల, మండలి వెంకట కృష్ణారావు, అంతర్జాతీయ తెలుగు కేంద్ర సంచాలకులు శ్రీమతి గీతావాణి, ఆచార్య రమేశ్ భట్టు, ఆచార్య యెండ్లూరి సుధాకర్ రావు లు హైదరాబాద్ నుంచి వచ్చారు. 2018-19 సంవత్సరానికి గాను అడ్మిషన్స్ ప్రారంభమైనట్టు మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల తెలిపారు. మనబడి వెబ్సైట్ ద్వారా ఆగస్టు 31లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వాహణలో మనబడి సభ్యులు శాంతి కూచిబొట్ల, డాంజి తోటపల్లి, శరత్ వేట, శ్రీదేవి గంటి, భాస్కర్ రాయవరంతో పాటు మనబడి సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పాల్తొన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వారందరిని భాషాసైనికులుగా అభివర్ణిస్తూ మనబడి ఉపాధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. -
కళ్లద్దాలు ఉన్నాయని...?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) తేనె లొలుకు తెలుగుకు అవమానం. తెలుగుజాతి తలదించుకోవాల్సిన సందర్భం. మాతృభాషాభిమానులకు మింగుడు పడని వాస్తవం. అన్యభాషపై మోజుతో అమ్మభాషను నిర్లక్ష్యం చేస్తున్న వైనం.. వెరసి విద్యాలయాల్లో మాతృభాష ఆదరణ కోల్పోతోంది. ఆంగ్ల వ్యామోహంలో పడి తల్లి భాషను నిర్లక్ష్యం చేస్తున్న నేటి తరం తెలుగులో నెగ్గుకురాలేక పోవడం నివ్వెరపరుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు తెలుగు పరీక్షలో ఫెయిల్ అయ్యారన్న చేదునిజం అమ్మభాషాభిమానులను అవాక్కయ్యేలా చేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో 30.78 శాతం, రంగారెడ్డి జిల్లాలో 37.26 శాతం మంది విద్యార్థులు తెలుగులో తప్పారు. ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగులో ఫెయిల్ కావడం దిగ్భ్రాంత పరుస్తోంది. ఆంగ్లంలో పోల్చుకుంటే (11శాతం) అమ్మభాషలో ఫెయిలయిన వారి సంఖ్య అధికంగా ఉండడం ఆవేదన కలిగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పరిస్థితి కాస్త అటుఇటుగా ఇలాగే ఉంది. తెలుగు సబ్జెక్టులో తప్పుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే తల్లి భాషను మనమెంత నిర్లక్ష్యం చేస్తున్నామో అర్థమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషకు ముప్పు ఏర్పడింది. అన్యభాషను నెత్తికెత్తుకుని అమ్మ భాషకు ద్రోహం చేస్తున్నాం. తమిళులు, కన్నడిగులు కన్నతల్లి కంటే ఎక్కువగా భాషను సాకుతుంటే మనం మాత్రం చంపేస్తున్నాం. తెలుగులో చదవడం, సంభాషించడం నమోషీగా భావిస్తున్నాం. తల్లి భాషలో మాట్లాడితే టీచరమ్మలతో తన్నులు తినే విచిత్ర పరిస్థితి ఒక్క తెలుగు నేలపైనే ఉంది. కళ్లద్దాలు ఉన్నాయని కళ్లు పొడుచుకున్న చందంగా తయారైంది తెలుగువారి పరిస్థితి. అమ్మ భాషలో చదివితే ఆంగ్లం రాదన్న అపోహతో పిల్లలపై బలవంతంగా అన్యభాషను రద్దుతున్నారు. మాతృభాషలో అభ్యసిస్తే విషయ పరిజ్ఞానం పెరగడంతో మానసిక వికాసం వృద్ధిచెందుతుందన్న వాస్తవాలను పెడచెవిన పెడుతున్న మమ్మీ-డాడీలు ఇంగ్లీషు చదువులను 'కేజీ'ల కొద్ది మోయిస్తున్నారు. దీనికితోడు పాలకుల ఉదాసీన వైఖరి మాతృభాష పాలిట మరణశాసనంగా మారింది. పోటీ ప్రపంచంలో బహు భాషా పరిజ్ఞానం కావాల్సిందే. కానీ నేల విడిచి సాము చేసినట్టుగా అమ్మ భాషను వదిలేసి అన్యభాషలను అందలమెక్కించడం అవివేకం. భాష మాయమైతే జాతి జాడ మిగలదు జాగ్రత్త! - పి. నాగశ్రీనివాసరావు