Telugu subject
-
Telangana: సీబీఎస్ఈ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పదోతరగతి వరకు తెలుగు సబ్జెక్టు తప్పని సరిగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. తెలుగు సబ్జెక్టు బోధించని స్కూళ్లకు రూ.లక్ష వరకూ జరిమానా విధించే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ప్రత్యేకించి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర బోర్డు పాఠశాలల్లో అమలు చేసేందుకు సంబంధించి రూపొందించడం గమనార్హం. కేజీబీవీ సమస్యలు పరిష్కరించాలి: పీఆర్టీయూ సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ టీఎస్.. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. సంఘం నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు బుధవారం ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డితో కలిసి మంత్రిని కలిశారు. కేజీబీవీల్లో కేర్టేకర్ల నియామకం, ఆర్థిక, ఆపరేషన్ల గైడ్‌లైన్స్ మార్పు, ఉద్యోగులకు హెల్త్ కార్డులు వంటి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎడ్‌సెట్–2022 గడువు 22 వరకు పొడిగింపు ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): టీఎస్ ఎడ్‌సెట్–2022 గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు కన్వీనర్ రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15తో ఎడ్‌సెట్–2022 గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు వారం పాటు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశమిచ్చారు. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌కు 24 వేలమంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. (క్లిక్: నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!) -
తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని యాజమాన్యాలకు చెందిన విద్యా సంస్థల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసిన ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో (2021–22) 4, 9 తరగతుల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, సీబీఎస్ఈ, ఐసీఎస్సీ, ఇంటర్నేషనల్ బోర్డుల పరిధిలోని అన్ని మీడియం స్కూళ్లలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని అందులో స్పష్టం చేసింది. 2018–19లో ప్రాథమిక స్థాయిలో ఒకటో తరగతిలో, సెకండరీ స్థాయిలో 6వ తరగతిలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది. 2019–20 విద్యా సంవత్సరంలో 2, 7 తరగతుల్లో, 2020–21 విద్యాసంవత్సరంలో 3, 8 తరగతుల్లో అమలు చేసినట్లు వివరించింది. ఇక 2021–22లో 4, 9 తరగతులు, 2022–23 విద్యా సంవత్సరంలో 5, 10 తరగతుల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. త్రిభాషా సూత్రం ప్రకారం అన్ని యాజమాన్యా ల్లోని స్కూళ్లలో 8వ తరగతి వరకు మూడు భాషలను అమలు చేస్తున్నామని, 9వ తరగతి నుంచి 2 భాషలనే అమలు చేస్తున్నామని పేర్కొంది. ఆయా తరగతులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. దీనిని అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ఉత్తర్వులో తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో దీనిని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. -
డైట్ కౌన్సెలింగ్‌లో కేవీ విద్యార్థులకు అన్యాయం
సాక్షి, విశాఖపట్నం: డైట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఎన్నడూ లేని విధంగా డైట్ కౌన్సెలింగ్‌లో పదో తరగతి లేదా ఇంటర్మీడియట్లలో తెలుగు సబ్జెక్ట్ ఉన్న వాళ్లే అర్హులని కొత్త నిబంధనలు విధించారు. దీంతో దీనిపైనే ఆశలు పెట్టుకున్న కేవీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. మొదటిగా డైట్ నోటిఫికేషన్‌ను ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులో పూర్తి సమాచారంతో విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్లో తెలుగు సబ్జెక్టుగా లేకపోయిన ప్రవేశం ఉందని.. పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ర్యాంక్ కార్డు కూడా పంపించి ఇప్పుడు కౌన్సెలింగ్‌లో కేవలం తెలుగు సబ్జెక్టుగా ఉన్న విద్యార్థులకు మాత్రమే అర్హత ఉందని నిబంధనలు విధించింది. ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో వారికి నచ్చిన కళాశాలల్లో సీట్ల అలాట్మెంట్ కూడా జరిగింది. చివరికి సర్టిఫికెట్ల పరశీలనకు హాజరైన కేవీ విద్యార్థులకు కొత్త నిబంధనలతో ఆంక్షలు విధించారు. మూడు నెలల కిందట విడుదలైన డైట్ నోటిఫికేషన్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన లేదు. గతేడాది కూడా ఇటువంటివి లేవు. ఈ తరహా నిబంధనలతో అన్యాయానికి గురైన విద్యార్థులు విశాఖలోని ప్రతి కళాశాలలో ఐదుగురు చొప్పున ఉన్నారు. అప్పుడొకలా.. ఇప్పుడొకలా.. ఏపీ డైట్ నోటిఫికేషన్–2019 విడుదల చేసినప్పుడు ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల అకడమిక్ కోర్సుల్లో తెలుగు తప్పనిసరిగా ఉండాలని, సీబీఎస్ఈలో చదివిన వారు అనర్హులని కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 17న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని ఒక ప్రొసీడింగ్ ఆర్సీ నంబర్ 1/డీఈసెట్/2010–2 విద్యార్థులకు పంపించారు. అందులో సీబీఎస్ఈ విద్యార్థులకు అర్హత లేదని ఉంది. కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు మాత్రమే ఈ ప్రొసీడింగ్ విడుదల చేయడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధనలతో వేల మంది సీబీఎస్ఈ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంసెట్, ఐఐటీ వంటి ఇతర అవకాశాలను కూడా వదిలి ఈ కౌన్సెలింగ్‌నే నమ్ముకుని ఉన్న విద్యార్థుల ఆశలకు బ్రేకులు పడ్డాయి. జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి, భీమిలి డైట్ కళాశాల ప్రినిపాల్, డైట్ జిల్లా కౌన్సెలింగ్ ఇన్చార్జిని కలిసి తమకు జరిగిన సమస్యలను సీబీఎస్ఈ విద్యార్థులంతా విన్నవించుకున్నారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. మాకు న్యాయం జరగాలి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటర్ పూర్తిచేశాను. మొదటి నుంచి సీబీఎస్ఈ సిలబస్సే కావడంతో తెలుగు సబ్జెక్టు ఆప్సన్ లేదు. డైట్ పరీక్ష రాశాను. ఐఐటీలో అవకాశాన్ని కూడా వదులుకుని కౌన్సెలింగ్‌కి వస్తే అన్యాయం జరిగింది. ఆన్లైన్లో పెట్టుకుంటే మల్కాపురం డైట్ కళాశాల వచ్చింది. ఇప్పుడు కౌన్సెలింగ్‌లో కొత్త నిబంధనలతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. – కొండ కనకమహాలక్ష్మి, విద్యార్థిని, మల్కాపురం అవకాశం కల్పించండి కేవీలో ఇంటర్ చదివాను. డైట్ పరీక్ష రాశాను. మంచి ర్యాంకు వచ్చింది. ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో కాలేజ్ ఆప్సన్ కూడా పెట్టుకున్నాను. సీబీఎస్ఈ విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు ఉండకపోవడంతో డైట్ కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు అనుమతించ లేదు. ఈ నెల 15, 16 తేదీల్లో డీఎడ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ విధానంతో రాష్ట్రంలో చాలామంది నష్టపోయారు. మాకు అవకాశం కల్పించాలి. – మహేన్ లోహి, విద్యార్థి పైఅధికారుల దృష్టికి తీసుకెళతాం డైట్ నోటిఫికేషన్లో ఎటువంటి సమాచారం లేదు. డైట్ కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో పదిలో గానీ, ఇంటర్లో గానీ తెలుగు సబ్జెక్టు కలిగి ఉన్న వారికి మాత్రమే అర్హత ఉంటుందని నిబంధనలు వచ్చాయి. దాని ప్రకారమే తాము ఆచరించాం. దీనిని పైఅధికారుల దృష్టికి తీసుకెళతాం. – ఎం.జ్యోతికుమారి, భీమిలి డైట్ కళాశాల ప్రిన్సిపాల్, డైట్ కౌన్సెలింగ్ ఇన్చార్జి -
నవ్యకు తెలుగులో 99 మార్కులు
జన్నారం (ఖానాపూర్): తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్యకు న్యాయం జరిగింది. ఈ నెల 21న ‘సాక్షి’మెయిన్‌లో ‘ఫస్ట్ ఇయర్లో టాప్–సెకం డియర్‌లో ఫెయిల్ ’శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పేపర్ రీవాల్యుయేషన్ చేయగా నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కుల మెమోను వాట్సాప్ ద్వారా కరిమల కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌కు పంపారు. ఈ విషయంపై డీఐఈవో ఇంద్రాణిని ఫోన్లో సంప్రదించగా, దీనిపై ఏవో రమేశ్‌ను విషయం కనుక్కోవాలని నేరుగా ఇంటర్ బోర్డుకు పంపినట్లు తెలిపారు. పేపర్ రీవాల్యుయేషన్ చేయించగా నవ్యకు తెలుగులో 99 మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీంతో నవ్యకు మొత్తం సబ్జెక్టుల్లో కలిపి 924 మార్కులు వచ్చాయి. విషయం తెలుసుకున్న నవ్య సంతోషం వ్యక్తం చేసింది. -
తెలుగులోనూ తప్పారు..!
సాక్షి, యాదాద్రి :ప్రతి ఏటా జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గిపోతోంది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల అనే తేడా లేకుండా విద్యార్థులు తెలుగులో రికార్డు స్థాయిలో విద్యార్థులు ఫెయిలయ్యారు. అర్ధశాస్త్రం, సివిక్స్, కామర్స్, ఇంగ్లీష్‌లో పెద్ద ఎత్తున తప్పారు. ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఈ పరిస్థితి నెలకొనడంతో విద్యాప్రమాణాలు తగ్గుతున్నాయా అన్న అనుమానాలను పలువురు విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 59కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ 11, గురుకుల 6, మోడల్ కళాశాలలు 6, 36ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రథమ సంవత్సరంలో 59శాతం, ద్వితీయ సంవత్సరంలో 66శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 5,333మంది హాజరు కాగా 2,777మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 5,546మంది విద్యార్థులు హాజరు కాగా 3,307మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో.. ప్రథమ సంవత్సరంలో అర్ధశాస్త్రంలో 1,104మంది ఫెయిలయ్యారు. సివిక్స్‌లో 984మంది, వాణిజ్యశాస్త్రంలో 879, ఇంగ్లీష్‌లో 721 మాతృభాష తెలుగులో 687మంది ఫెయిలయ్యారు. ద్వితీయసంవత్సరంలో.. ద్వితీయ సంవత్సరం సివిక్స్‌లో 1,111మంది అత్యధికంగా, వాణిజ్య శాస్త్రంలో 933 మంది, ఇంగ్లీష్‌లో 898, అర్ధశాస్త్రంలో 794, తెలుగులో 627మంది ఫెయిలయ్యారు. మాతృభాష తెలుగులో విద్యార్థులు పెద్ద ఎత్తున ఫెయిల్ కావడం తల్లిదండ్రులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధాన సబ్జెక్టులతోపాటు తెలుగు, ఇంగ్లీష్‌లపై కూడా విద్యార్థులు పట్టు సాధించే విధంగా విద్యాబోధన చేయలేకపోతున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. -
కళ్లద్దాలు ఉన్నాయని...?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) తేనె లొలుకు తెలుగుకు అవమానం. తెలుగుజాతి తలదించుకోవాల్సిన సందర్భం. మాతృభాషాభిమానులకు మింగుడు పడని వాస్తవం. అన్యభాషపై మోజుతో అమ్మభాషను నిర్లక్ష్యం చేస్తున్న వైనం.. వెరసి విద్యాలయాల్లో మాతృభాష ఆదరణ కోల్పోతోంది. ఆంగ్ల వ్యామోహంలో పడి తల్లి భాషను నిర్లక్ష్యం చేస్తున్న నేటి తరం తెలుగులో నెగ్గుకురాలేక పోవడం నివ్వెరపరుస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు తెలుగు పరీక్షలో ఫెయిల్ అయ్యారన్న చేదునిజం అమ్మభాషాభిమానులను అవాక్కయ్యేలా చేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో 30.78 శాతం, రంగారెడ్డి జిల్లాలో 37.26 శాతం మంది విద్యార్థులు తెలుగులో తప్పారు. ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగులో ఫెయిల్ కావడం దిగ్భ్రాంత పరుస్తోంది. ఆంగ్లంలో పోల్చుకుంటే (11శాతం) అమ్మభాషలో ఫెయిలయిన వారి సంఖ్య అధికంగా ఉండడం ఆవేదన కలిగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పరిస్థితి కాస్త అటుఇటుగా ఇలాగే ఉంది. తెలుగు సబ్జెక్టులో తప్పుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే తల్లి భాషను మనమెంత నిర్లక్ష్యం చేస్తున్నామో అర్థమవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషకు ముప్పు ఏర్పడింది. అన్యభాషను నెత్తికెత్తుకుని అమ్మ భాషకు ద్రోహం చేస్తున్నాం. తమిళులు, కన్నడిగులు కన్నతల్లి కంటే ఎక్కువగా భాషను సాకుతుంటే మనం మాత్రం చంపేస్తున్నాం. తెలుగులో చదవడం, సంభాషించడం నమోషీగా భావిస్తున్నాం. తల్లి భాషలో మాట్లాడితే టీచరమ్మలతో తన్నులు తినే విచిత్ర పరిస్థితి ఒక్క తెలుగు నేలపైనే ఉంది. కళ్లద్దాలు ఉన్నాయని కళ్లు పొడుచుకున్న చందంగా తయారైంది తెలుగువారి పరిస్థితి. అమ్మ భాషలో చదివితే ఆంగ్లం రాదన్న అపోహతో పిల్లలపై బలవంతంగా అన్యభాషను రద్దుతున్నారు. మాతృభాషలో అభ్యసిస్తే విషయ పరిజ్ఞానం పెరగడంతో మానసిక వికాసం వృద్ధిచెందుతుందన్న వాస్తవాలను పెడచెవిన పెడుతున్న మమ్మీ-డాడీలు ఇంగ్లీషు చదువులను 'కేజీ'ల కొద్ది మోయిస్తున్నారు. దీనికితోడు పాలకుల ఉదాసీన వైఖరి మాతృభాష పాలిట మరణశాసనంగా మారింది. పోటీ ప్రపంచంలో బహు భాషా పరిజ్ఞానం కావాల్సిందే. కానీ నేల విడిచి సాము చేసినట్టుగా అమ్మ భాషను వదిలేసి అన్యభాషలను అందలమెక్కించడం అవివేకం. భాష మాయమైతే జాతి జాడ మిగలదు జాగ్రత్త! - పి. నాగశ్రీనివాసరావు -
తెలుగులో తప్పారు!
- భాషపై తగ్గుతున్న పట్టు - రంగారెడ్డిలో 37.26, హైదరాబాద్‌లో 31 శాతం ఫెయిల్ సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జంట జిల్లాలు అగ్రస్థానంలోనిలిచాయి. గతంతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇదంతా నాణేనికి ఒక వైపు. మరోవైపు మాతృభాష తెలుగు విషయంలో మన విద్యార్థుల తీరు విస్తుగొల్పుతోంది. తెలుగులో 90 శాతం విద్యార్థులు కూడా నెగ్గలేకపోయారు. రంగారెడ్డి జిల్లాలో 37.26 శాతం, హైదరాబాద్ జిల్లాలో దాదాపు 31 శాతం విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో ఫెయిలవడం గమనార్హం. ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగులో తప్పారు. తెలుగులో నూటికి 35 మార్కులు సంపాదించడంలో జంట నగరాల పిల్లలు తడబడుతున్నారు. ప్రధాన సబ్జెక్టుల్లో నెగ్గలేకపోయారంటే కొంతవరకు సరిపెట్టుకోవచ్చు. కానీ తేనేలొలుకు తెలుగులోనే చతికిల పడుతుండడం ఆందోళనకరం. భాషను తేలికగా తీసుకోవడం... పరీక్షల సమయంలోనే పుస్తకం చేతపట్టడం వంటివి విద్యార్థులు తప్పడానికి కారణమని నిపుణుల మాట. మరోపక్క తరగతులకు తరచూ వెళ్లకపోవడమూ ఉత్తీర్ణతపై ప్రభా వం చూపించి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికితోడు కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లోసబ్జెక్టులకు కేటాయించే సమయాన్ని భాషకు కేటాయించడం లేదని తెలుస్తోంది. ఫలితంగా తెలుగులో గణనీయం గా ఉత్తీర్ణత శాతం తగ్గిందని నిపుణుల అభిప్రాయం. రెండు జిల్లాల్లో కామర్స్‌లో అత్యధికంగా విద్యార్థులు తప్పారు. ఫెయిలైన వారి శాతం 40కిపైగా నమోదైంది. అత్యల్పంగా సంస్కృతంలో తప్పారు. తెలుగులో ఆశ్చర్యపరిచేలా.. రంగారెడ్డి జిల్లాలో 21,366 మంది తెలుగు పరీక్ష రాయగా.. అందులో 7,962 (37.26 శాతం) మంది తప్పారు. 1.04 లక్షల మంది ఇంగ్లిష్ పరీక్ష రాయగా.. దాదాపు 11 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. హైదరాబాద్ జిల్లాలో తెలుగు పరీక్ష 6,150 మంది రాయగా.. అందులో 1,893 (30.78 శాతం) మంది విద్యార్థులు తప్పారు. తెలుగులో 5 శాతం కంటే ఎక్కువగా రెగ్యులర్ విద్యార్థులు ఫెయిల్కారని నిపుణుల అంచనా. దీనికి భిన్నంగా 30 శాతానికి పైగా తప్పడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో 75 శాతానికిపైగా విద్యార్థులు తెలుగు బదులు సంస్కృతం, హిందీ పరీక్షలు రాస్తుండడం గమనార్హం. ఆర్ట్స్ విద్యార్థులే అధికంగా ఫెయిల్... సైన్స్ గ్రూపులతో పోల్చుకుంటే తప్పిన వారిలో ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులే అధిక శాతం ఉన్నారు. రెండు జిల్లాల్లోనూ అదే పరిస్థితి. హైదరాబాద్‌తో పోల్చితే కామర్స్ మినహా మిగిలిన ఆర్ట్స్ సబ్జెక్టుల్లో రంగారెడ్డి జిల్లాలో తప్పినవారి శాతం కొంచెం అధికంగా ఉంది. సైన్స్‌లో హైద రాబాద్ జిల్లాలో ఎక్కువ మంది పాస్ కాలేకపోయారు. గణితంలోనూ వెనకబడ్డారు. హైదరాబాద్‌లో అత్యధికంగా కామర్స్‌లో 41.79 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. ఆ తర్వాత ఎకనామిక్స్‌లో 38.43, సివిక్స్‌లో 37.38, హిస్టరీలో 35.42 శాతం తప్పారు. రంగారెడ్డిలో కామర్స్‌లో 43.74, హిస్టరీలో 42.69, సివిక్స్‌లో 40.62, ఎకనామిక్స్‌లో 40.16 శాతం ఫెయిలయ్యారు. -
మనుష్యుడే నా సంగీతం-మానవుడే నా సందేశం అన్నదెవరు?
డైట్‌సెట్ - 2014 తెలుగు డైట్‌సెట్ ప్రవేశ పరీక్షలో తెలుగు సబ్జెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. మాతృభాష తెలుగే కదా అని అభ్యర్థులు అశ్రద్ధ చేయకూడదు. పోటీ పరీ క్షలో ప్రతి విభాగం ముఖ్యమైందే. ప్రతి ప్రశ్న, ప్రతిమార్కూ కీలకమే. అభ్యర్థులు మంచి ర్యాంకు సాధించాలంటే మొదట తెలుగు విభాగంపై పట్టు సాధించాలి. దీంట్లో ఎక్కువ గా కవులు- రచయితలు, వారి కాలాలు, వారి బిరుదులు, రచనలు, కావ్య ప్రక్రియలు, ప్రసిద్ధ కొటేషన్లు లాంటి సాహిత్య అంశాలు; సంధులు సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, అర్థా లు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి- వికృతులు, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష కథనాలు, నామ్నీకరణం, వాక్య భేదాలు లాంటి వ్యాకరణాంశాలపై ప్రశ్నలు వస్తాయి. మాదిరి ప్రశ్నలు 1. పిల్లలమర్రి పినవీరభద్రుడు ఎవరి ఆస్థాన కవి? 1) తుళువ నరసింహరాయలు 2) రెండో నరసింహరాయలు 3) సాళువ నరసింహరాయలు 4) హరిహర బుక్కరాయలు 2. ‘కొడుకుల్ బుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై’ పద్యం ఏ శతకం లోనిది? 1) భాస్కర శతకం 2) దాశరథీ శతకం 3) సుభాషిత రత్నావళి 4) శ్రీ కాళహస్తీశ్వర శతకం 3. జాషువాకు ఏ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? 1) ఫిరదౌసి 2) గబ్బిలం 3) ముంతాజ్ మహల్ 4) క్రీస్తు చరిత్ర 4. ‘ఆధునిక వచన రచనకు పట్టుగొమ్మ’ అని ఎవరినంటారు? 1) చాసో 2) కొడవటిగంటి 3) శ్రీపాద 4) గురజాడ 5. వ్యక్తిని లేదా వ్యవస్థను విమర్శించడం ఏ ప్రక్రియలో సాధారణం? 1) కథానిక 2) నవల 3) గల్పిక 4) వైజ్ఞానిక కల్పన వ్యాసం 6. మహాత్ముని ఆస్థాన కవి అనిపించుకున్నవారు? 1) బసవరాజు అప్పారావు 2) తుమ్మల సీతారామమూర్తి చౌదరి 3) త్రిపురనేని రామస్వామి చౌదరి 4) గరిమెళ్ల సత్యనారాయణ 7. పుట్టపర్తి రచించిన మేఘదూతం ఒక? 1) గేయకావ్యం 2) కవితా సంకలనం 3) వచన కవితా సంపుటి 4) ఖండకావ్యం 8. }పాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఆత్మకథ 1) మూన్నాళ్ల ముచ్చట 2) బ్రతుకు మూట 3) అనుభవాలు- జ్ఞాపకాలు 4) అనంతం 9. ఏ రచనతో శ్రీశ్రీ అభ్యుదయ కవిగా పేరుగాంచాడు? 1) ఖడ్గసృష్టి 2) మహాప్రస్థానం 3) మరో ప్రస్థానం 4) చరమరాత్రి 10. శృంగార శాకుంతలం ఎవరి రచన? 1) శ్రీనాథుడు 2) పిల్లలమర్రి పినవీరభద్రుడు 3) పింగళి సూరన 4) పిల్లలమర్రి చినవీరభద్రుడు 11. స్వారోచిష మనుసంభవం అనే పేరున్న కావ్యం? 1) అనరుద్ధ చరిత్ర 2) సారంగధర చరిత్ర 3) మనుచరిత్ర 4) వసు చరిత్ర 12. ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించింది? 1) కందుకూరి వీరేశలింగం 2) రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ 3) సురవరం ప్రతాపరెడ్డి 4) చేకూరి రామారావు 13. ఏ కవి వర్ణనలు ప్రబంధ కవులకు మార్గదర్శకం అయ్యాయి? 1) ఎర్రన 2) తిక్కన 3) నన్నెచోడుడు 4) అల్లసాని పెద్దన 14. అనువాద పద్ధతి, శైలిలో తెలుగు కవులు ఎవరి కవితా మార్గాన్ని అనుసరించారు? 1) నన్నయ 2) తిక్కన 3) శ్రీనాథుడు 4) పోతన 15. ఎవరి సీస పద్యాలకు విశిష్ట స్థానం ఉంది? 1) తిక్కన 2) కాసుల పురుషోత్తమ కవి 3) శ్రీనాథుడు 4) పింగళి సూరన 16. పుట్టపర్తి నారాయణాచార్యుల బిరుదు? 1) సరస్వతీ పుత్రుడు 2) అభినవ పోతన 3) అభినవ తిక్కన 4) కవి మిత్రుడు 17. పేరడీ ప్రక్రియకు ఆద్యులు? 1) శ్రీశ్రీ 2) వేదుల సత్యనారాయణ శాస్త్రి 3) జరుక్ శాస్త్రి 4) కృష్ణశాస్త్రి 18. పిల్లలమర్రి పినవీరభద్రుని జైమినీ భారతం ఏ కావ్యం? 1) వీరరస 2) శృంగార 3) శాంతరస 4) కరుణరస 19. సంగీత సాహిత్య నాట్య సంకేతాల సమ్మేళ నమైన పుట్టపర్తి నారాయణాచార్యుల రచన? 1) పండరి భాగవతం 2) సాక్షాత్కారం 3) మేఘదూతం 4) శివ తాండవం 20. నన్నయ కవిత్వంలోని ప్రధాన లక్షణం కానిది? 1) అక్షర రమ్యత 2) సూక్తి వైచిత్రి 3) నానారుచిరార్థసూక్తి నిధిత్వం 4) ప్రసన్న కథా కవితార్థయుక్తి 21. గాలిబ్ గజళ్లను తెలుగులోకి అనువదిం చినవారు? 1) దాశరథి రంగాచార్యులు 2) దాశరథి కృష్ణమాచార్యులు 3) సినారె 4) ఆరుద్ర 22. వార్తాపత్రికల్లో తొలిసారిగా వ్యవహారిక భాషను వాడినవారు? 1) తాపీ ధర్మారావు 2) కాశీనాథుని నాగేశ్వర రావు 3) కందుకూరి 4) గురజాడ 23. {తిపురనేని రామస్వామి చౌదరి కలం నుంచి జాలువారిన సూత పురాణం ఏ వాదానికి చెందింది? 1) స్త్రీవాదం 2) హేతువాదం 3) మైనారిటీ వాదం 4) దళిత వాదం 24. బారిష్టర్ పార్వతీశం నవలాకారుడు? 1) మొక్కపాటి నరసింహశాస్త్రి 2) పానుగంటి లక్ష్మీనరసింహం 3) విశ్వనాథ సత్యనారాయణ 4) చిలకమర్తి లక్ష్మీనరసింహం 25. చంపూ రామాయణం, చంపూ భారతం- కావ్యాలను రాసినవారు? 1) పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు 2) పురాణపండ సుబ్రహ్మణ్యశాస్త్రి 3) కందుకూరి వీరేశలింగం 4) అల్లంరాజు రంగసాయి కవి 26. దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ ఏ ప్రక్రియ? 1) నవల 2) కథా సంపుటి 3) కవితా సంపుటి 4) కావ్యం 27. అనుభూతి ప్రాధాన్యంతో కవితలు రాసినట్లు ప్రసిద్ధి చెందినవారు? 1) ఆరుద్ర 2) తిలక్ 3) జాషువా 4) దాశరథి 28. శారద లేఖలు రచనతో లేఖా సాహిత్యాన్ని పరిపుష్టం చేసినవారు? 1) ఆచంట శారదా దేవి 2) మల్లాది సుబ్బమ్మ 3) బసవరాజు రాజ్యలక్ష్మమ్మ 4) కనుపర్తి వరలక్ష్మమ్మ 29. మనుష్యుడే నా సంగీతం- మానవుడే నా సందేశం అన్న కవి ఎవరు? 1) దాశరథి 2) సినారె 3) శ్రీశ్రీ 4) నగ్నముని 30. ఏనుగు లక్ష్మణ కవి రచన కానిది? 1) జ్ఞాన వాశిష్టం 2) రామేశ్వర మహత్యం 3) సుభాషిత రత్నావళి 4) విశ్వామిత్ర చరిత్ర 31. {Vంథాన్ని, గ్రంథ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ రచయిత రాసే పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికి మరో పేరు? 1) శ్రీకారం 2) అంతరంగం 3) ఆముఖం 4) విష్కంభం 32. ఉదయశ్రీ ఖండకావ్య సంపుటాలను రచించిన కవి? 1) రాయప్రోలు సుబ్బారావు 2) జంధ్యాల పాపయ్యశాస్త్రి 3) జాషువా 4) కృష్ణశాస్త్రి 33. అనుభూతి చిత్రణంతో అనుభవ ప్రకటనకు భావ దృష్టికి ప్రాధాన్యం ఉండే ప్రక్రియ ఏది? 1) ఏకాంకిక 2) కథానిక 3) గల్పిక 4) స్వీయ చరిత్ర 34. సినిమా జీవితాన్ని మన కళ్ల ఎదుట ఆవిష్క రించే ‘పాకుడు రాళ్లు’ నవలా రచయిత? 1) యన్.ఆర్. నంది 2) రాచకొండ విశ్వనాథ శాస్త్రి 3) దాశరథి రంగాచార్య 4) రావూరి భరద్వాజ 35. అయ్యగారి వీరభద్రరావు రచించిన, అశరీరి, దయ్యాల కొంప మొదలైనవి ఏ ప్రక్రియ? 1) కథ 2) కథానిక 3) నాటిక 4) వ్యాసం 36. గోలకొండ పత్రిక సంపాదకులు? 1) కాశీనాథుని నాగేశ్వరరావు 2) ముట్నూరి కృష్ణారావు 3) సురవరం ప్రతాపరెడ్డి 4) కందుకూరి వీరేశలింగం 37. యండమూరి భద్రాచార్యుల బిరుదు కానిది? 1) అభినవ హరిశ్చంద్ర 2) అభినవ కుచేల 3) సువర్ణ హస్త ఘంటాకంకణ 4) నాట్యాచార్య 38. పరిశోధన, పరిశీలన, ఎవరి వ్యాస సంకలనాలు? 1) జి.వి. సుబ్రహ్మణ్యం 2) యస్వీ రామారావు 3) నాయని కృష్ణకుమారి 4) నండూరి రామ్మోహనరావు 39. బోయ జంగయ్య రచించిన ప్రసిద్ధ నవల? 1) జాతర 2) ఎచ్చరిక 3) పావురాలు 4) జగడం 40. గౌతమి కోకిల బిరుదాంకితులు? 1) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 2) వేదుల సత్యనారాయణ శాస్త్రి 3) గుర్రం జాషువా 4) దువ్వూరి రామిరెడ్డి 41. కైఫియత్తు ఏ భాషా పదం? 1) లాటిన్ 2) జర్మన్ 3) హిందూస్తానీ 4) గ్రీక్ 42. నార్ల వెంకటేశ్వరరావు ‘నాయకత్వం’ పాఠ్యభాగం ఏ కోవకు చెందింది? 1) వార్తా వ్యాఖ్య 2) పీఠిక 3) సాహిత్య విమర్శనా వ్యాసం 4) సంపాదకీయ వ్యాసం 43. {తిపురనేని గోపీచంద్ ‘మాకూ ఉన్నాయి స్వగతాలు’ సంపుటిలోని కథలను ఏమని పేర్కొన్నారు? 1) గల్పికలు 2) స్కెచ్‌లు 3) పేరడీలు 4) స్వగతాలు 44. పంజాబ్‌లో తుమ్మచెట్టును ఏమని పిలుస్తారు? 1) కికార్ 2) కురువేళం 3) గోబ్లి,బాల్ 4) స్వర్ణపుష్పం 45. విజ్ఞాన చంద్రిక గ్రంథమండలిని ఎవరు స్థాపించారు? 1) సురవరం ప్రతాపరెడ్డి - 1925 2) కొమర్రాజు లక్ష్మణరావు - 1906 3) గాడిచర్ల హరిసర్వోత్తమరావు-1905 4) కందుకూరి వీరేశలింగం- 1897 46. అంబేద్కర్ తన జీవిత నిర్మాతలు, గురువులుగా ఎవరిని పేర్కొన్నారు? 1) విద్య, స్వాభిమానం, శీలం 2) గాంధీజీ, కబీర్, భగవద్గీత 3) భగవాన్ బుద్ధ, భక్త కబీర్, జ్యోతిబాపులే 4) శీలం, ఆత్మాభిమానం, భగవంతుడిపై విశ్వాసం 47. చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాస ప్రబంధానికి హృదయోల్లాస అనే విమర్శ వ్యాఖ్యాన గ్రంథం రాసినవారు? 1) తాపీ ధర్మారావు 2) పుట్టపర్తి నారాయణాచార్యులు 3) విశ్వనాథ సత్యనారాయణ 4) జి.వి. సుబ్రహ్మణ్యం 48. గోరాశాస్త్రి ఆయా పత్రికల్లో ఏ పేరుతో శీర్షికను నిర్వహించారు? 1) కౌండిన్య 2) ఆనందవీణ 3) మాణిక్యవీణ 4) వినాయకుడి వీణ 49. చాసో బొండుమల్లెలు కథానికతో పాటు ఇతర రచనల్లో ఏ ప్రాంతం మాండలికాన్ని ప్రయోగించారు? 1) తెలంగాణ 2) విశాఖ 3) గోదావరి 4) రాయలసీమ 50. స్వాతంత్య్రోద్యమ కాలంలో స్త్రీల సమస్యల ను ప్రధాన ఇతివృత్తంగా అనేక నవలలు రాసినవారు? 1) కందుకూరి వీరేశలింగం 2) చిలకమర్తి లక్ష్మీనరసింహం 3) గుడిపాటి వెంకటాచలం 4) కొడవటిగంటి కుటుంబరావు సమాధానాలు 1) 3 2) 4 3) 4 4) 2 5) 3 6) 2 7) 1 8) 3 9) 2 10) 2 11) 3 12) 3 13) 1 14) 1 15) 3 16) 1 17) 3 18) 1 19) 4 20) 2 21) 2 22) 1 23) 2 24) 1 25) 4 26) 3 27) 2 28) 4 29) 3 30) 1 31) 3 32) 2 33) 3 34) 4 35) 3 36) 3 37) 1 38) 3 39) 1 40) 2 41) 3 42) 4 43) 2 44) 1 45) 2 46) 3 47) 1 48) 4 49) 2 50) 3