డైట్‌ కౌన్సెలింగ్‌లో కేవీ విద్యార్థులకు అన్యాయం | Diet counseling is unfair to Kendriya Vidyalaya Students | Sakshi
Sakshi News home page

డైట్‌ కౌన్సెలింగ్‌లో కేవీ విద్యార్థులకు అన్యాయం

Published Sat, Jul 20 2019 2:32 PM | Last Updated on Mon, Jul 22 2019 1:23 PM

Diet counseling is unfair to Kendriya Vidyalaya Students - Sakshi

డైట్‌ కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు (ఫైల్‌)  

సాక్షి, విశాఖపట్నం: డైట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఎన్నడూ లేని విధంగా డైట్‌ కౌన్సెలింగ్‌లో పదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌లలో తెలుగు సబ్జెక్ట్‌ ఉన్న వాళ్లే అర్హులని కొత్త నిబంధనలు విధించారు. దీంతో దీనిపైనే ఆశలు పెట్టుకున్న కేవీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. మొదటిగా డైట్‌ నోటిఫికేషన్‌ను ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులో పూర్తి సమాచారంతో విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్‌లో తెలుగు సబ్జెక్టుగా లేకపోయిన ప్రవేశం ఉందని.. పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ర్యాంక్‌ కార్డు కూడా పంపించి ఇప్పుడు కౌన్సెలింగ్‌లో కేవలం తెలుగు సబ్జెక్టుగా ఉన్న విద్యార్థులకు మాత్రమే అర్హత ఉందని నిబంధనలు విధించింది.

ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో వారికి నచ్చిన కళాశాలల్లో సీట్ల అలాట్‌మెంట్‌ కూడా జరిగింది. చివరికి సర్టిఫికెట్ల పరశీలనకు హాజరైన కేవీ విద్యార్థులకు కొత్త నిబంధనలతో ఆంక్షలు విధించారు. మూడు నెలల కిందట విడుదలైన డైట్‌ నోటిఫికేషన్‌లో తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన లేదు. గతేడాది కూడా ఇటువంటివి లేవు. ఈ తరహా నిబంధనలతో అన్యాయానికి గురైన విద్యార్థులు విశాఖలోని ప్రతి కళాశాలలో ఐదుగురు చొప్పున ఉన్నారు. 

అప్పుడొకలా.. ఇప్పుడొకలా..
ఏపీ డైట్‌ నోటిఫికేషన్‌–2019 విడుదల చేసినప్పుడు ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థుల అకడమిక్‌ కోర్సుల్లో తెలుగు తప్పనిసరిగా ఉండాలని, సీబీఎస్‌ఈలో చదివిన వారు అనర్హులని కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 17న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని ఒక ప్రొసీడింగ్‌ ఆర్‌సీ నంబర్‌ 1/డీఈసెట్‌/2010–2 విద్యార్థులకు పంపించారు. అందులో సీబీఎస్‌ఈ విద్యార్థులకు అర్హత లేదని ఉంది. కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు మాత్రమే ఈ ప్రొసీడింగ్‌ విడుదల చేయడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధనలతో వేల మంది సీబీఎస్‌ఈ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంసెట్, ఐఐటీ వంటి ఇతర అవకాశాలను కూడా వదిలి ఈ కౌన్సెలింగ్‌నే నమ్ముకుని ఉన్న విద్యార్థుల ఆశలకు బ్రేకులు పడ్డాయి. జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి, భీమిలి డైట్‌ కళాశాల ప్రినిపాల్, డైట్‌ జిల్లా కౌన్సెలింగ్‌ ఇన్‌చార్జిని కలిసి తమకు జరిగిన సమస్యలను సీబీఎస్‌ఈ విద్యార్థులంతా విన్నవించుకున్నారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు.

మాకు న్యాయం జరగాలి
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంటర్‌ పూర్తిచేశాను. మొదటి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్సే కావడంతో తెలుగు సబ్జెక్టు ఆప్సన్‌ లేదు. డైట్‌ పరీక్ష రాశాను. ఐఐటీలో అవకాశాన్ని కూడా వదులుకుని కౌన్సెలింగ్‌కి వస్తే అన్యాయం జరిగింది. ఆన్‌లైన్‌లో పెట్టుకుంటే మల్కాపురం డైట్‌ కళాశాల వచ్చింది. ఇప్పుడు కౌన్సెలింగ్‌లో కొత్త నిబంధనలతో కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.
– కొండ కనకమహాలక్ష్మి, విద్యార్థిని, మల్కాపురం

అవకాశం కల్పించండి
కేవీలో ఇంటర్‌ చదివాను. డైట్‌ పరీక్ష రాశాను. మంచి ర్యాంకు వచ్చింది. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో కాలేజ్‌ ఆప్సన్‌ కూడా పెట్టుకున్నాను. సీబీఎస్‌ఈ విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు ఉండకపోవడంతో డైట్‌ కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్‌ల పరిశీలనకు అనుమతించ లేదు. ఈ నెల 15, 16 తేదీల్లో డీఎడ్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ విధానంతో రాష్ట్రంలో చాలామంది నష్టపోయారు. మాకు అవకాశం కల్పించాలి. 
– మహేన్‌ లోహి, విద్యార్థి

పైఅధికారుల దృష్టికి తీసుకెళతాం
డైట్‌ నోటిఫికేషన్‌లో ఎటువంటి సమాచారం లేదు. డైట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో పదిలో గానీ, ఇంటర్‌లో గానీ తెలుగు సబ్జెక్టు కలిగి ఉన్న వారికి మాత్రమే అర్హత ఉంటుందని నిబంధనలు వచ్చాయి. దాని ప్రకారమే తాము ఆచరించాం. దీనిని పైఅధికారుల దృష్టికి తీసుకెళతాం.
    – ఎం.జ్యోతికుమారి, భీమిలి డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్, డైట్‌ కౌన్సెలింగ్‌ ఇన్‌చార్జి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement