సాక్షి, యాదాద్రి :ప్రతి ఏటా జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గిపోతోంది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల అనే తేడా లేకుండా విద్యార్థులు తెలుగులో రికార్డు స్థాయిలో విద్యార్థులు ఫెయిలయ్యారు. అర్ధశాస్త్రం, సివిక్స్, కామర్స్, ఇంగ్లీష్‌లో పెద్ద ఎత్తున తప్పారు. ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఈ పరిస్థితి నెలకొనడంతో విద్యాప్రమాణాలు తగ్గుతున్నాయా అన్న అనుమానాలను పలువురు విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 59కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ 11, గురుకుల 6, మోడల్ కళాశాలలు 6, 36ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రథమ సంవత్సరంలో 59శాతం, ద్వితీయ సంవత్సరంలో 66శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 5,333మంది హాజరు కాగా 2,777మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 5,546మంది విద్యార్థులు హాజరు కాగా 3,307మంది ఉత్తీర్ణులయ్యారు.
ప్రథమ సంవత్సరంలో..
ప్రథమ సంవత్సరంలో అర్ధశాస్త్రంలో 1,104మంది ఫెయిలయ్యారు. సివిక్స్‌లో 984మంది, వాణిజ్యశాస్త్రంలో 879, ఇంగ్లీష్‌లో 721 మాతృభాష తెలుగులో 687మంది ఫెయిలయ్యారు.
ద్వితీయసంవత్సరంలో..
ద్వితీయ సంవత్సరం సివిక్స్‌లో 1,111మంది అత్యధికంగా, వాణిజ్య శాస్త్రంలో 933 మంది, ఇంగ్లీష్‌లో 898, అర్ధశాస్త్రంలో 794, తెలుగులో 627మంది ఫెయిలయ్యారు. మాతృభాష తెలుగులో విద్యార్థులు పెద్ద ఎత్తున ఫెయిల్ కావడం తల్లిదండ్రులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధాన సబ్జెక్టులతోపాటు తెలుగు, ఇంగ్లీష్‌లపై కూడా విద్యార్థులు పట్టు సాధించే విధంగా విద్యాబోధన చేయలేకపోతున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment