- భాషపై తగ్గుతున్న పట్టు
- రంగారెడ్డిలో 37.26, హైదరాబాద్‌లో 31 శాతం ఫెయిల్
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జంట జిల్లాలు అగ్రస్థానంలోనిలిచాయి. గతంతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇదంతా నాణేనికి ఒక వైపు. మరోవైపు మాతృభాష తెలుగు విషయంలో మన విద్యార్థుల తీరు విస్తుగొల్పుతోంది. తెలుగులో 90 శాతం విద్యార్థులు కూడా నెగ్గలేకపోయారు.
రంగారెడ్డి జిల్లాలో 37.26 శాతం, హైదరాబాద్ జిల్లాలో దాదాపు 31 శాతం విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో ఫెయిలవడం గమనార్హం. ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగులో తప్పారు. తెలుగులో నూటికి 35 మార్కులు సంపాదించడంలో జంట నగరాల పిల్లలు తడబడుతున్నారు. ప్రధాన సబ్జెక్టుల్లో నెగ్గలేకపోయారంటే కొంతవరకు సరిపెట్టుకోవచ్చు. కానీ తేనేలొలుకు తెలుగులోనే చతికిల పడుతుండడం ఆందోళనకరం. భాషను తేలికగా తీసుకోవడం... పరీక్షల సమయంలోనే పుస్తకం చేతపట్టడం వంటివి విద్యార్థులు తప్పడానికి కారణమని నిపుణుల మాట. మరోపక్క తరగతులకు తరచూ వెళ్లకపోవడమూ ఉత్తీర్ణతపై ప్రభా వం చూపించి ఉండొచ్చని భావిస్తున్నారు.
దీనికితోడు కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లోసబ్జెక్టులకు కేటాయించే సమయాన్ని భాషకు కేటాయించడం లేదని తెలుస్తోంది. ఫలితంగా తెలుగులో గణనీయం గా ఉత్తీర్ణత శాతం తగ్గిందని నిపుణుల అభిప్రాయం. రెండు జిల్లాల్లో కామర్స్‌లో అత్యధికంగా విద్యార్థులు తప్పారు. ఫెయిలైన వారి శాతం 40కిపైగా నమోదైంది. అత్యల్పంగా సంస్కృతంలో తప్పారు.
తెలుగులో ఆశ్చర్యపరిచేలా..
రంగారెడ్డి జిల్లాలో 21,366 మంది తెలుగు పరీక్ష రాయగా.. అందులో 7,962 (37.26 శాతం) మంది తప్పారు. 1.04 లక్షల మంది ఇంగ్లిష్ పరీక్ష రాయగా.. దాదాపు 11 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. హైదరాబాద్ జిల్లాలో తెలుగు పరీక్ష 6,150 మంది రాయగా.. అందులో 1,893 (30.78 శాతం) మంది విద్యార్థులు తప్పారు. తెలుగులో 5 శాతం కంటే ఎక్కువగా రెగ్యులర్ విద్యార్థులు ఫెయిల్‌కారని నిపుణుల అంచనా. దీనికి భిన్నంగా 30 శాతానికి పైగా తప్పడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో 75 శాతానికిపైగా విద్యార్థులు తెలుగు బదులు సంస్కృతం, హిందీ పరీక్షలు రాస్తుండడం గమనార్హం.
ఆర్ట్స్ విద్యార్థులే అధికంగా ఫెయిల్...
సైన్స్ గ్రూపులతో పోల్చుకుంటే తప్పిన వారిలో ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులే అధిక శాతం ఉన్నారు. రెండు జిల్లాల్లోనూ అదే పరిస్థితి. హైదరాబాద్‌తో పోల్చితే కామర్స్ మినహా మిగిలిన ఆర్ట్స్ సబ్జెక్టుల్లో రంగారెడ్డి జిల్లాలో తప్పినవారి శాతం కొంచెం అధికంగా ఉంది. సైన్స్‌లో హైద రాబాద్ జిల్లాలో ఎక్కువ మంది పాస్ కాలేకపోయారు. గణితంలోనూ వెనకబడ్డారు. హైదరాబాద్‌లో అత్యధికంగా కామర్స్‌లో 41.79 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. ఆ తర్వాత ఎకనామిక్స్‌లో 38.43, సివిక్స్‌లో 37.38, హిస్టరీలో 35.42 శాతం తప్పారు. రంగారెడ్డిలో కామర్స్‌లో 43.74, హిస్టరీలో 42.69, సివిక్స్‌లో 40.62, ఎకనామిక్స్‌లో 40.16 శాతం ఫెయిలయ్యారు.
తెలుగులో తప్పారు!
Published Sat, Apr 25 2015 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM
Advertisement
Advertisement