
తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పదోతరగతి వరకు తెలుగు సబ్జెక్టు తప్పని సరిగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పదోతరగతి వరకు తెలుగు సబ్జెక్టు తప్పని సరిగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. తెలుగు సబ్జెక్టు బోధించని స్కూళ్లకు రూ.లక్ష వరకూ జరిమానా విధించే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ప్రత్యేకించి సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ తదితర బోర్డు పాఠశాలల్లో అమలు చేసేందుకు సంబంధించి రూపొందించడం గమనార్హం.
కేజీబీవీ సమస్యలు పరిష్కరించాలి: పీఆర్టీయూ
సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ టీఎస్.. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. సంఘం నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు బుధవారం ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డితో కలిసి మంత్రిని కలిశారు. కేజీబీవీల్లో కేర్‌టేకర్ల నియామకం, ఆర్థిక, ఆపరేషన్ల గైడ్‌లైన్స్ మార్పు, ఉద్యోగులకు హెల్త్ కార్డులు వంటి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఎడ్‌సెట్–2022 గడువు 22 వరకు పొడిగింపు
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): టీఎస్ ఎడ్‌సెట్–2022 గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు కన్వీనర్ రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15తో ఎడ్‌సెట్–2022 గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు వారం పాటు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశమిచ్చారు. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌కు 24 వేలమంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. (క్లిక్: నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!)