నకిలీ వార్తలు ఇలా పుడతాయా? | Nail-Polish Fatwa Shows How Fake News Is Manufactured | Sakshi
Sakshi News home page

Nov 13 2018 3:48 PM | Updated on Nov 13 2018 4:25 PM

Nail-Polish Fatwa Shows How Fake News Is Manufactured - Sakshi

అంతటి పెద్ద సంస్థ వాస్తవాలను తెలుసుకోకుండా నకిలీ వార్తను ప్రచురించడం, ఆ నకిలీ వార్తను నమ్మి..

సాక్షి, న్యూఢిల్లీ : ‘ముస్లిం మహిళలు గోళ్ల పెయింట్‌ (నేల్‌ పాలిష్‌) వాడ కూడదు. అది ఇస్లాం మతానికి వ్యతిరేకం, చట్ట విరుద్ధం అంటూ దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ ఫత్వాను జారీ చేసిందీ’ అని నవంబర్‌ ఐదవ తేదీన ఏఎన్‌ఐ (ఆసియా న్యూస్‌ ఇంటర్నేషనల్‌) చేసిన ట్వీట్‌ వైరల్‌ అవడంతో పలు న్యూస్‌ ఛానళ్లు, వార్తా పత్రికలు ఆ ఫత్వాను హైలెట్‌ చేస్తూ హల్‌చల్‌ చేశాయి. కొన్ని వార్తా ఛానళ్లు చర్చా గోష్టిలను కూడా నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్‌ జిల్లాలోని ఇస్లామిక్‌ స్కూల్‌ ‘దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌’ ముఫ్తీ (మత గురువు) ఇష్రార్‌ గౌర ఈ ఫత్వాను జారీ చేసినట్లు ఓ ఫొటోతో ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసింది.

ఆ ఫత్వా నకిలీదని నకిలీ వార్తలను కనిపెట్టడంలో ఆరితేరిన ‘ఆల్ట్‌ న్యూస్‌’ దర్యాప్తులో తేల్చింది. ఆయన దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ మత గురువు కాకపోవడమే కాకుండా ఆ స్కూల్‌తోని ఎలాంటి సంబంధం లేదు. ఆయన సహ్రాన్‌పూర్‌లోని జమా మసీదు పాత ఇమామ్‌ కుమారుడు, ప్రస్తుత ఇమామ్‌ సోదరుడని తేలింది. ‘తమరు ఏ హోదాలో ఫత్వా జారి చేశారు ?’ అంటూ సదరు ఇష్రార్‌ గౌరకు ఆల్ట్‌ న్యూస్‌ ప్రతినిధి ఫోన్‌ చేయగా, తన పేరు ఇష్రార్‌ గౌర కాదని, ఇషాక్‌ గౌర అని, తాను 1990 దశకంలో జారీ అయినా ఓ ఇస్లాం ఫత్వా గురించి ప్రస్తావించానని, ముస్లింలు మహిళలు గోళ్లకు రంగులకు బదులుగా మెహిందీ వాడాలని ఫత్వా సూచించినట్లు చెప్పానని, తన మాటలకు తప్పుడు అర్థం ధ్వనించేలా ట్వీట్‌ పెట్టారని ఆయన వివరణ ఇచ్చారు. ఇదే ఏఎన్‌ఐ ప్రతినిధిని ప్రశ్నించగా ఎక్కడో పొరపాటు జరిగిందని, తప్పు తెలియగానే సరిదిద్దు కున్నామని చెప్పారు.

1990 దశకంలో కూడా అలాంటి ఫత్వా జారీ అయివుంటుందన్నది కూడా అనుమానమే. ఇస్లాం స్కూల్‌ వెబ్‌సైట్‌లో ఇంతవరకు జారీ చేసిన అన్ని ఫత్వాలు ఉన్నాయి. అందులో ఈ ఫత్వాలేదు. ఈ విషయమై దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ నిర్వాహకులను ప్రశ్నించగా వారు స్పందించేందుకు నిరాకరించారు. అయితే ఏఎన్‌ఐ ట్వీట్‌ చేసిన ఫొటోలో ఉన్న వ్యక్తికి తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనెవరో కూడా తమకు తెలియదని చెప్పారు. ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఏఎన్‌ఐకి దేశవ్యాప్తంగా 50 బ్యూరోలు ఉన్నాయి. అంతటి పెద్ద సంస్థ వాస్తవాలను తెలుసుకోకుండా నకిలీ వార్తను ప్రచురించడం, ఆ నకిలీ వార్తను నమ్మి వార్తా ఛానళ్లు దానికి విస్తృత ప్రచారం కల్పించడం శోచనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement