key departments
-
రెవెన్యూపై కూటమి నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: పరిపాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. భూముల వ్యవహారాలను పర్యవేక్షించే ముఖ్యమైన ఈ శాఖకు పూర్తి స్థాయి అధికారులను నియమించకపోవడంతో ఏ పనులూ సజావుగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూ పరిపాలన శాఖలో (సీసీఎల్ఏ) చీఫ్ కమిషనర్‌తోపాటు అదనపు చీఫ్ కమిషనర్, సహాయ కార్యదర్శి (ల్యాండ్స్), సహాయ కార్యదర్శి (విజిలెన్స్), అప్పీల్స్ కమిషనర్ వంటివి ముఖ్యమైన పోస్టులు. ఇవికాకుండా ఇండిపెండెంట్‌గా సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ కమిషనర్ పోస్టులు ముఖ్యమైనవి.ఇవన్నీ ఐఏఎస్ అధికారులు నిర్వహించే పోస్టులే. అయితే, కూటమి ప్రభుత్వం ఈ పోస్టులను కేవలం ఇద్దరితోనే నడిపిస్తోంది. సీసీఎల్ఏగా జయలక్ష్మి ఉండగా.. మిగిలిన అన్ని పోస్టులకు మరో ఐఏఎస్ అధికారి ప్రభాకర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాను బదిలీ చేసి ఆ బాధ్యతలను జయలక్ష్మికి అదనంగా ఇచ్చారు. రెవెన్యూ శాఖకు కమిషనర్, ముఖ్య కార్యదర్శి ఆమే. అలాగే రెవెన్యూ శాఖలోని మిగిలిన అన్ని ముఖ్యమైన విభాగాలకు ప్రభాకర్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.ఆరుగురు ఐఏఎస్ అధికారులు పని చేయాల్సిన చోట కేవలం ఇద్దరితో నడిపించడం ద్వారా రెవెన్యూ శాఖపై చంద్రబాబు నిర్లక్ష్యం చూపుతున్నారనే వాదన వినిపిస్తోంది. జిల్లా కలెక్టర్లు, డీఆర్ఓలు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వేలాది మంది రెవెన్యూ సిబ్బందిపై పర్యవేక్షణ, భూముల వ్యవహారాలకు సంబంధించిన ఈ శాఖపై శీతకన్ను వేయడం ద్వారా అందులో పనులు ఏవీ సజావుగా జరగడం లేదని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఏవో తప్పులు, అక్రమాలు జరిగిపోయాయని చూపించేందుకు మాత్రమే రెవెన్యూ శాఖను వాడుకుంటూ మిగిలిన వ్యవహారాలను పక్కన పెట్టేశారు. దీంతో రెవెన్యూ శాఖ వ్యవహారాలు కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంనీ నత్తనడకన సాగుతున్నాయి. -
గుట్టుచప్పుడు కాకుండా శాఖలు ఇచ్చిన సీఎం కిరణ్!
ఒకవైపు రాష్ట్ర విభజన వ్యవహారం, మరోవైపు వరదలు, భారీ వర్షాలతో రాష్ట్రమంతా అల్లకల్లోలం.. ఇంత హడావుడి మధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ పెద్ద నిర్ణయం తీసేసుకున్నారు. ఇద్దరు మంత్రులకు అదనపు శాఖలు కేటాయించారు. అందులో ఒక శాఖకైతే బడ్జెట్ కేటాయింపులకు అదనంగా ఈ మధ్యే రెండు వేల కోట్లు మంజూరుచేశారు. చాలామంది మంత్రులు ఆ శాఖలు తమకు ఇవ్వమని అడిగినా.... ముఖ్యమంత్రి మాత్రం తన సన్నిహితులకే వాటిని అప్పజెప్పటంపై మంత్రుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పితాని సత్యనారాయణకు రోడ్లు భవనాల శాఖ, తోట నర్సింహం చేతికి పశు సంవర్ధక శాఖ అప్పగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసేసుకున్నారు. అయితే, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి, సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా హోం మంత్రిత్వశాఖను ఆశించిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు మాత్రం ఇప్పటికీ మొండిచెయ్యే ఎదురవుతోంది. హోం, విద్యుత్, వాణిజ్యపన్నుల లాంటి కీలకమైన శాఖలన్నీ కిరణ్ దగ్గరే ఉన్నాయి. శాఖల కేటాయింపులో ఈ మతలబేంటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చొన్నా ఒకటే.. సరిగ్గా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నారు.. ముఖ్యమంత్రి కిరణ్. ధర్మాన ప్రసాదరావు రాజీనామాతో ఖాళీ అయిన రోడ్లు భవనాల శాఖను ముఖ్యమంత్రి ఏరి కోరి... తనకు సన్నిహితంగా మెలుగుతున్న పితాని సత్యనారాయణ చేతిలో పెట్టారు. ఇక సమైక్యం కోరుతూ రాజీనామా చేసిన విశ్వరూప్ శాఖ పశుసంవర్థకాన్ని ఆయన జిల్లాకే చెందిన తోట నర్సింహంకు అప్పగించారు. ఈ ఇద్దరూ ఇప్పటికే ప్రాధాన్యశాఖలు నిర్వహిస్తున్నా.. మళ్లీ వారికే పెద్దపీట వేయటంపై మంత్రుల్లో అసహనం వ్యక్తమౌతోంది. బడ్జెట్ కేటాయింపులకు అదనంగా మరో రెండు వేల కోట్లను రోడ్లు భవనాల శాఖకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో తన సొంత మనుషులకే ఆ నిధులు కేటాయించేందుకే శాఖను పితాని చేతిలో పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నారు. పైగా రోడ్లు భవనాల శాఖను ఆశించిన మంత్రుల జాబితా చాలా పెద్దగానే ఉంది. పలువురు తెలంగాణ మంత్రులతో పాటు సీమాంధ్ర మంత్రులు కూడా ఎంతో ప్రాధాన్యం ఉన్న రోడ్లు, భవనాల శాఖను తమకు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని చాలాసార్లు కోరారు. వారందరినీ పక్కన పెట్టి కిరణ్ .. రెండు శాఖలకు పితాని, తోటలను ఎంచుకోవటం ఇతర మంత్రుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమౌతోంది. డీఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్ తర్వాత ఆయన శాఖను కొండ్రు మురళికి, మోపిదేవి తర్వాత ఎక్సైజ్ శాఖను పార్థసారధికి అదనంగా కేటాయించిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు హఠాత్తుగా రెండు కీలక శాఖలను తన సన్నిహితులకే ఇవ్వటం ఇతర మంత్రులకు రుచించటం లేదు. విభజన సమస్యతో పాటు ఎన్నికలు కూడా ఉన్నందున తనకు, తనవారికి మాత్రమే లబ్ధి చేసుకోవటం కోసం ఈ పని చేశారనే అభిప్రాయం మంత్రుల్లో వెల్లడవుతోంది.