
సాక్షి, హైదరాబాద్: గత తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విజ్ఞుల లక్షణమని, ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు, తదనంతర పరిణామాలు చూస్తుంటే ఈ ప్రభుత్వంలో ఆ లక్షణం లోపించినట్టు అర్థమవుతోందని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. 2019 ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఆ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుని ఇంటర్ బోర్డును సంస్కరిస్తారని ఆశించినా అది జరగలేదని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులు పాఠాలకు దూరమయ్యారని, ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఆన్‌లైన్ బోధనలకు అనుగుణంగా ఇంటర్నెట్, కంప్యూటర్లులాంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, గురుకుల కళాశాలల్లో చదువుకు నే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఏ మేరకు ఈ సదుపాయాలు కల్పించారన్నది ప్రశ్నార్థకమని రేవంత్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళానికి, విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని, ఉత్తీర్ణులు కాని వారిలో ప్రభుత్వ, గురుకుల కళాశాలల్లో చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులే ఉన్నారని తెలిపారు. వెంటనే రాష్ట్రంలో విద్యావ్యవస్థను సంస్కరించాలని, ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేలా కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ లేఖలో సీఎంను రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment