సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రత్యక్ష బోధనను రోజు విడిచి రోజు చేపట్టాలని.. నడుమ రోజుల్లో ఆన్‌లైన్ బోధన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు ఇష్టమైతేనే భౌతికంగా తరగతులకు హాజరుకావొచ్చని, హాజరు నిబంధన ఏమీ అమలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు గురువారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 1వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల తరగతులను ప్రారంభించాలని సూచించింది. విద్యార్థులకు ఒక రోజు ప్రత్యక్ష (ఆఫ్‌లైన్) బోధన చేపడితే.. తర్వాతి రోజు జూమ్, వీబాక్స్, గూగుల్ మీట్ వంటివాటి ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది.
ప్రత్యక్ష బోధనకు హాజరయ్యే విద్యార్థుల నుంచి అంగీకారపత్రం (కన్సెంట్) కచ్చితంగా తీసుకోవాలని పేర్కొంది. 75 శాతం హాజరు తప్పనిసరి కాదని తెలిపింది. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా 70శాతం సిలబస్ నే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే సిలబస్‌పై జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాష్ట్రంలో అమలు చేస్తామని వెల్లడించింది. తరగతుల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఆన్‌లైన్ బోధన, ఇతర సమాచారం కోసం లెక్చరర్లు, విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని సూచించింది.
బడులు, కాలేజీలకు టీచర్లు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, జూనియర్ కాలేజీల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఈ నెల 25 నుంచి స్కూళ్లు, కాలేజీలకు హాజరుకానున్నారు. జూలై 1 నుంచి తరగతులను ప్రారంభించనున్న నేపథ్యంలో.. ప్రత్యక్ష/ఆన్‌లైన్ బోధన కోసం టీచర్లు, లెక్చరర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ, ఇంటర్ బోర్డు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశాయి. ఇక స్కూళ్లలో జూలై 1 నుంచి 8, 9, 10 తరగతులకే ప్రత్యక్ష బోధన నిర్వహిస్తారా? మిగతా తరగతులకూ చేపడతారా అన్న దానిపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. కాగా జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయకుండా విద్యా బోధన ఎలా ప్రారంభిస్తారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే 1,658 మంది గెస్ట్ లెక్చరర్లను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment