సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల పత్రాలను రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసిన ఫలితాలు, మార్కుల జాబితాలు, ఆన్సర్ షీట్లు ఈనెల 27 సాయంత్రం అయిదు గంటల్లోగా ఆన్‌లైన్‌లో ఉంచాలని ఇంటర్మీడియట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఆ మూడింటిని వేరువేరు తేదీల్లో వెల్లడిస్తే ఎక్కువ మార్కులు వస్తాయని ఆశించిన విద్యార్థులు తిరిగి గందరగోళానికి గురయ్యే ఆస్కారం ఉంటుందని, ఆన్‌లైన్‌లో తన పత్రాల్ని స్వయంగా చూసుకోవడం ద్వారా ఆందోళనకు గురికాకుండా ఉంటారని హైకోర్టు అభిప్రాయపడింది. ‘ఆన్‌లైన్‌లో పత్రాలు ఉండటం వల్ల గతంలో వచ్చిన మార్కులు, ఇప్పుడు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ల తర్వాత వచ్చిన మార్కుల్ని విద్యార్థులు స్వయంగా బేరీజు వేసుకునే వీలుంటుంది.
తాము రాసిన జవాబులకు సరిగ్గా మార్కులు లభించాయో లేదో కూడా చూసుకుంటారు. ఫలితంగా విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడదు. తిరిగి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఈ కోణంలో మూడింటినీ ఒకే రోజు వెల్లడించాలి’అని ఇంటర్ బోర్డుకు హైకోర్టు ధర్మాసనం సూచించింది. గ్లోబరీనా టెక్నాలజీస్ లిమిటెడ్‌ను ప్రతివాదిగా చేయాలని కోరుతూ గతంలో దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్‌ను విచారణకు అనుమతించిన హైకోర్టు ఆ సంస్థకు నోటీసు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకల కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను బాధ్యులను చేయాలని, మరణించిన 16 మంది విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు, న్యాయవాది రాపోలు భాస్కర్ వేరువేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను బుధవారం హైకోర్టు మరోసారి విచారించింది.
27లోగా అందుబాటులో ఉంచుతాం
‘ఫలితాలతోపాటు జవాబు పత్రాలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. సర్కార్ అనుమతిస్తే.. ఫలితాల్ని 15వ తేదీన (గురువారం) వెల్లడించేందుకు బోర్డు సిద్ధంగా ఉంది. 16వ తేదీ సాయంత్రానికి ఆన్‌లైన్‌లో మార్కుల జాబితాలు అందుబాటులో ఉండేలా చేస్తాం. 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పూర్తి చేసిన మొత్తం జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చేస్తాం. మొత్తం 9,43,005 మంది ఇంటర్ పరీక్షలకు హాజరైతే 5,60,889 మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన 3,82,116 మంది ఫెయిల్ అయ్యారు. ఫలితాల వివాదం తలెత్తిన తర్వాత 12 స్పాట్ వాల్యుయేషన్స్ సెంటర్స్ ద్వారా 5,831 మంది అర్హులైన అధ్యాపకులతో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేశాం’.. అని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో విషయాల్ని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం పైవిధంగా సూచన చేయడంతో అందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే అందుకు 27 వరకూ సమయం కావాలని సంజీవ్‌కుమార్ కోరారు. తొమ్మిది లక్షల పైచిలుకు జవాబు పత్రాలకు 24 పేజీల చొప్పున బుక్‌లెట్ ఉంటుందని, ఇంత భారీ సంఖ్యలో పత్రాల్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌కు సమయం కావాలన్నారు.
పొరపాట్లు పునరావృతం కావొద్దనే..
ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారని, గడువు ఇస్తే నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఇబ్బందులు ఎదురౌతాయని, కనీసం రెండో ఏడాది ఇంటర్ ఫలితాలనైనా విడుదల చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది డి.దామోదర్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పి వాయిదా వేసిందని, విద్యార్థుల భవిష్యత్ కోణంలో పరిశీలన చేయాలన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం చెప్పింది. రీకౌంటింగ్, రీట్యాలీ ప్రక్రియలను గ్లోబరీనా టెక్నాలజీస్ పూర్తి చేసిందని, ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక తర్వాత డేటా టెక్ మెథడెక్స్ అనే మరో ఏజెన్సీకి బాధ్యతలు అప్పిగించినట్లుగా ప్రభుత్వం చెబుతోందని, సమయం ఇవ్వకపోతే హడావుడిగా చేశారంటారని, ఉత్తీర్ణుల సంఖ్యలో తేడాలు వస్తే ఇంత జరిగినా ప్రభుత్వం తప్పు చేసిందంటారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలను ముందుగా ప్రకటించడం కూడా వీలుకాదని, ఇంటర్ రెండో ఏడాది రాసిన విద్యార్థుల్లో చాలా మంది మొదటి ఏడాది పరీక్షలు కూడా రాశారని, ప్రథమ, ద్వితీయ పత్రాలను వేరువేరు చేసేలా కంప్యూటర్ పోగ్రాం లేదని సంజీవ్ కుమార్ చెప్పారు. వాదనల అనంతరం ధర్మాసనం.. ఫలితాలు, మార్కుల జాబితా, జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చే మొత్తం ప్రక్రియను 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 6కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment