మరాఠిలో తెరకెక్కిన సైరత్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రంలో ఆర్చీగా రింకూ రాజ్‌గురు కనబర్చిన నటన ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. పిన్న వయస్సులోనే అద్భుతమైన అభినయం కనబర్చిన రింకూకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 2016లో సినిమా విడుదలైన సమయంలో రింకూ పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. తాజాగా రింకూ తన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇటీవలే విడుదలయిన మహారాష్ట్ర ఇంటర్ ఫలితాల్లో ఆమె 82 శాతం మార్కులు సాధించారు. ఆర్ట్స్ విభాగంలో ఆమెకు 650 మార్కులకుగాను 533 మార్కులు వచ్చాయి.
ఈ సందర్భంగా రింకూ తండ్రి మహాదేవ్ రాజ్‌గురు షోలాపూర్‌లో మీడియాతో మాట్లాడారు. రింకూ సినిమాలు కొనసాగిస్తూనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుందన్నారు. రింకూ పదవ తరగతిలో 66 శాతం మార్కులు సాధించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రింకూ కర్ణాటకలోని బెల్గామ్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటుందని చెప్పారు. స్వచ్ఛమైన ప్రేమకథతో సహజమైన టేకింగ్ తో తెరకెక్కిన 'సైరత్' సినిమా యావత్ దేశాన్ని మరాఠి చిత్రపరిశ్రమ వైపు చూసేలా చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. వందకోట్లు వసూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment