సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. శనివారం ఉన్నత స్థాయిలో జరిగిన ఓ కీలక సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష లను నిర్వహించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసుల సంఖ్య నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 3,29,340 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వారంతా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న వారే. ఇప్పుడు వారి విషయంలో ఏం చేయాలన్న అంశంపైనే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అయితే వారందరినీ పాస్ చేయడం ద్వారా సమస్యలు లేకుండా ముందుకు సాగవచ్చని అధికారులు భావిస్తున్నారు. 10 నుంచి 20 మార్కుల వరకు కలిపితే మెజారిటీ విద్యార్థులు పాస్ అవుతారని, కొందరు మాత్రమే ఫెయిల్ అవుతారన్న అంచనాలు ఉన్నాయి. అయితే పరీక్షలు రద్దు చేసినపుడు అందరిని పాస్ చేయాల్సి ఉంటుందని, కొందరిని పాస్ చేసి, మరికొందరిని ఫెయిల్ చేస్తే అది న్యాయ వివాదాలకు తావిచ్చినట్లు అవుతుందని అంటున్నారు. అందుకే అందరిని పాస్ చేస్తే సమస్యలు ఉండకపోవచ్చన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై అడ్వొకేట్ జనరల్‌తో ఉన్నతాధికారులు చర్చించి రెండు మూడు రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రద్దును అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
వెయిటేజీని తొలగించేద్దాం!
ప్రస్తుతం ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment