
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ రెండో ఏడాది పరీక్ష రద్దుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కాబట్టి పరీక్ష నిర్వహించాలని పది మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ఆశ్రయించారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన మార్కులు సరిపోవడం లేదని, ఇంటర్ మొదటి ఏడాది మార్కులే ఇవ్వడం వల్ల సమస్యలు వస్తాయని విద్యార్థులు అంటున్నా రు. రెండో ఏడాది ఎక్కువ మార్కులు సాధించాలన్న పట్టుదలతో చదివామని చెబుతున్నారు. పైగా పలు విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించాలంటే ఇంటర్‌లో కనీసం 50% మార్కులు సాధించాలనే నిబంధన ఉంది.
ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకుంటే తమ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అంటున్నారు. కాగా తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా భావించి పరీక్షలు రాస్తామంటే నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం హామీయిచ్చిన సంగతి తెలిసిందే.
తాజా విన్నపాలతో నోటిఫికేషన్ జారీచేసి కోరుకున్నవారికి పరీక్ష నిర్వహించాలని యోచిస్తుంది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. వచ్చే ఆగస్టులో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించినట్లు తెలిసింది. కరోనా థర్డ్‌వేవ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అస్పష్టత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment