కడప ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభిస్తున్న ఆర్‌ఐఓ రవి(ఫైల్)
రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల పట్లవివక్ష చూçపుతోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో మధ్యాహ్న భోజానాన్ని పెడతామని ప్రకటన చేసింది. అమలులో వివక్ష చూపుతోంది. అడ్మిషన్ల సమయంలో పలు ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి.. ‘మీ పిల్లలను మా కళాశాలల్లో చేర్పించండి.. మధ్యాహ్న భోజనం పెట్టిస్తాం’ అని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం కేవలం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకే మధ్యాహ్న భోజనమని ప్రకటించింది. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లితండ్రులు మా పిల్లలకు ఎందుకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏమి చెప్పాలో తెలియక అధ్యాపకులు తల పట్టుకుంటున్నారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కళాశాలలు ప్రారంభమయ్యాక కేవలం ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తోంది. ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టడం లేదు.దీంతో వేలమంది పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రం ఈ నెల 6 నుంచి ప్రారంభించారు. ఎయిడెడ్ కళాశాలల్లో ఇంకా అమలు కాలేదు.
పాఠశాలలకు సరఫరా చేసే ఏజెన్సీలకే
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ఏజెన్సీలకు చెందిన వారే కళాశాలలకు భోజనం అందించాలని ఇంటర్‌బోర్డు అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించారు. రెండు శాఖల మధ్య సమన్వయలోపం, సరైన ప్రభుత్వ ఉత్తర్వులు లేని కారణంగా చాలా రోజులు విద్యార్థులకు భోజనం అందలేదు. ఈ నెల 4న జిల్లా పర్యటకు వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం అందుతుందా అని విద్యార్థులు ప్రశ్నించగా అందడం లేదని చెప్పారు. వెంటనే విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కావాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు ఆయన ఆదేశం ప్రకారం ఈనెల 6వ తేదీ నుంచి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజజాన్ని అమలు చేస్తున్నారు.
ఎయిడెడ్ కళాశాలల్లో అమలెక్కడ
ప్రభుత్వ చెప్పిన ప్రకారం మొదట్లో కొన్ని ఎయిడెడ్ కళాశాలల్లో(వేంపల్లి, బద్వేల్, పొద్దుటూరు తది తర ప్రాంతాల్లో) మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. తరువాత ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలకు మాత్రమే మధ్యాహ్న భోజనం అని జీఓ విడుదల చేసింది. దీంతో ఎయిడెడ్ కళాశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అపేశారు. జిల్లావ్యాప్తంగా 20 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 5,605 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి మధ్యాహ్న భోజనం అందడం లేదు. మేమేం పాçపం చేశామని.. మాకెందుకు బువ్వపెట్టరని పలువురు విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ఆలోచించాలి
ఈ విద్యార్థిని పేరు నందిని. లక్కిరెడ్డిపల్లె మండలం నేను లక్కిరెడ్డిపల్లెలోని ఓ ఎయిడెడ్ కళాశాలలో ఇం టర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. నిత్యం పది కిలోమీటర్ల నుంచి కార్యి యర్ తీసుకుని కళాశాలకు వస్తాను. మధ్యాహ్నం భోజనం చేసే సమయానికి అన్నం చల్లగా పోతుంది. తినాలంటే కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయలి. – నందిని, ద్వితీయ ఇంటర్ బైపీసీ
మధ్యాహ్న భోజనం పెట్టాలి
నేను ఎల్‌ఆర్‌పల్లిలోని ఓ ఎయిడెడ్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నా. మాది చాగులగుట్టపల్లె గ్రామం. దాదాపు 8 కిలోమీటర్ల నుంచి వస్తాను. ఒక్కోసారి టైమ్ అయిపోతుందని క్యారియర్ తెచ్చుకోకుండా రావాల్సి వస్తుంది. ప్రభుత్వం చెప్పినట్లుగా మధ్యాహ్న భోజనం పెడితే బాగుంటుంది. – నాగార్జున, ఇంటర్, చాగులగుట్టపల్లె
ఎయిడెడ్ కళాశాలల్లో భోజనం పెట్టాలి
ప్రభుత్వ కళాశాలల చదువుకున్న విద్యార్థుల మాదిరిగా ఎయిడెడ్ కళాశాలల్లో కూడా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఇందులో చదువుకునే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. ఈ విషయం గురించి అధికారులు, ప్రభుత్వం ఆలోచించాలి. – వి. రామమోహన్‌రెడ్డి, ప్రెసిడెంట్, ఎయిడెడ్ జూనియర్ కళాశాల ఎంప్లాయీస్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment