
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో (ఆదర్శ పాఠశాలలు) 2021–22 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ విద్యను ఉచితంగా అందించనున్నామని, ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణకు గడువు ఉందని తెలిపారు.
దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీలు రూ.150, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 100 చెల్లించాలన్నారు. విద్యార్థులు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఎస్.ఏపీ.జీవోవీ.ఐఎన్’ లేదా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. దరఖాస్తును ప్రింట్ తీసుకొని జూన్ 30వ తేదీలోగా సంబంధిత మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు అందజేయాలన్నారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులను స్వీకరించబోరని చెప్పారు.