సిద్దిపేట అర్బన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్సియల్ అసిస్టెంట్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) పథకానికి సంబంధించిన మార్గదర్శకాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం సిద్దిపేటలో విద్యార్థిలోకం సమరశంఖం పూరిం చింది. పట్టణంలో వివిధ ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్, డిగ్రీ, పీజీ, ఒకేషనల్ విద్యార్థులంతా ఏకమై భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట పాత బస్టాండ్, బ్లాక్ ఆఫీస్ చౌరస్తాల వద్ద ఆందోళనకు దిగి రాస్తారోకో నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడాలని, లేకపోతే విద్యార్థుల ఆగ్రహానికి బలికావాల్సి వస్తుందని హెచ్చరించారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంతో మంది బడులు, బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారన్నారు. అలాంటి వర్గాల వారంతాప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తమకు మేలు జరుగుతుందని భావించారని, అయితే సర్కార్ తీరుతో వారంతా ఆందోళన చెందుతున్నారన్నారు.
‘ఫాస్ట్’ పథక విధివిధానాలను సర్కార్ ఇంతవరకు వెళ్లడించకపోవడంతో విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినప్పటికీ ప్రభుత్వం ‘ఫాస్ట్’ పథకంపై ముందడుగు వేయకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్న విద్యార్థుల సమస్యలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేయడం సరికాదన్నారు.
ఇప్పటికైన సీఎం వెంటనే స్పందించి ఫాస్ట్ పథక మార్గదర్శకాలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దర్పిల్లి చంద్రం, టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు తాటికొండ రమేష్‌లు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.
‘ఫాస్ట్’పై సమరం
Published Sat, Dec 13 2014 11:25 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement