మొయినాబాద్, న్యూస్‌లైన్: లెగ్ క్రికెట్‌లో రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికైన ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక భారం శాపంగా మారింది. అందివచ్చిన అవకాశం చేజారింది. సహాయం చేస్తామని చెప్పిన నాయకులు సైతం చివరివరకు స్పందించకపోవడంతో వారి ఆశలు అడియాసలే అయ్యాయి. మండలంలోని చందానగర్‌కు చెందిన కుమ్మరి ఆనంద్, రెడ్డిపల్లికి చెందిన షాపురం శ్రీకాంత్‌లు మొయినాబాద్‌లోని సిద్ధార్థ జూని యర్ కళాశాలలో చదువుతున్నారు. ఆనంద్ ఇంటర్ రెండో సంవత్సరం, శ్రీకాంత్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు నవంబర్‌లో పరిగిలో జరిగిన జిల్లాస్థాయి లెగ్ క్రికెట్ సెలక్షన్లలో పాల్గొన్నారు. మంచి ప్రతిభ కనబర్చిన వీరు తెలంగాణ జట్టుకు ఎంపికయ్యారు. లెగ్ క్రికెట్‌లో బ్యాట్ ఉండదు. ఫుట్‌బాల్ ఉంటుంది. దాన్ని బౌలర్ వేస్తే బ్యాట్స్‌మన్ కాలుతో తన్నాలి. దీన్ని గత ఏడాది లెగ్ క్రికెట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రవేశపెట్టారు. ఈ లెగ్ క్రికెట్‌లో తెలంగాణ జట్టుకు ఎంపికైన విద్యార్థులు ఆనంద్, శ్రీకాంత్‌లు ఈ నెల 27 నుంచి 29 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌ల్లో ఆడేందుకు వీరు ఈ నెల 14లోపే ఒక్కొక్కరు రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంది. కాని వారి వద్ద డబ్బులు లేకపోవడం, ఇంట్లో అడగాలంటే ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో అడగలేకపోయారు.
హ్యాండిచ్చిన నాయకులు
తెలంగాణ లెగ్ క్రికెట్ జట్టుకు ఎంపికై జార్ఖండ్‌లో ఆడేందుకు వెళ్లడానికి ఆర్థిక సహాయం అందించాలని విద్యార్థులు ఆనంద్, శ్రీకాంత్‌లు ఓ పార్టీ నాయకున్ని కలిశారు. ఆ నాయకుడు మరో నాయకున్ని కలిపిస్తానని చెప్పి వారిని అటూ ఇటూ తిప్పారు. కాని ఆర్థిక సహాయం అందించలేదు. అప్పటికే డబ్బులు చెల్లించాల్సిన డిసెంబర్ 14 దాటిపోవడంతో ఆ విద్యార్థులు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు.
ఆర్థిక స్థోమత లేకనే..
క్రీడల్లో రాణించాలనే తపన ఉన్నా ఆర్థిక స్థోమత లేక అవకాశాన్ని వదులుకున్నామని విద్యార్థులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వం, వివిధ పార్టీల నాయకులు, అధికారులు ఎన్నో సందర్భాల్లో ఉపన్యాసాలిస్తారు తప్ప ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరూ స్పందించరని వారు వాపోయారు. ఇప్పుడు అవకాశం చేజారినా మరోసారి ప్రయత్నం చేస్తామని చెప్పారు.
ఆర్థిక భారం.. చేజారిన అవకాశం
Published Thu, Dec 19 2013 1:32 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement