అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులంటే యాజమాన్యాలకూ లోకువే. 2013-14 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాలకు దరఖాస్తుల విషయంలో ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరే ఇందుకు నిదర్శనం. విద్యా సంవత్సరం ముగిసినా నేటికీ గత ఏడాదికి (2013-14) సంబంధించిన 14,486 దరఖాస్తులు కళాశాలల స్థాయిలోనే పెండింగ్ పడ్డాయి. వీటిలో 90 శాతం ప్రభుత్వ కళాశాలల నుంచే పెండింగ్ ఉండడం గమనార్హం. యాజమాన్యాల అలసత్వంతో పాటు చిన్న చిన్న కారణాల వల్ల దరఖాస్తులు ముందుకు వెళ్లలేదు. పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం లేకపోవడం వల్ల కూడా కొన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా సర్టిఫికెట్లు స్కానింగ్‌కు తీసుకోవడం లేదు. అమ్మాయికి బదులుగా అబ్బాయి, అబ్బాయికి బదులుగా అమ్మాయి అని పొరబాటున క్లిక్ చేసిన కారణంగా, బ్యాంకు ఖాతా నంబరు తప్పుగా నమోదు చేసినందు వల్ల వాటిని సవరించుకునే వీలు లేకుండా పోయింది. జిల్లా స్థాయిలో సరిదిద్దుకునే వెసులుబాటు కల్పించలేదు. ప్రతి చిన్న విషయానికి హైదరాబాద్‌కు వెళ్లాలంటూ ఆయా శాఖల అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు. దీంతో వారు తలలు పట్టుకుంటున్నారు.
బయో మెట్రిక్‌తో అసలు సమస్య
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పు మంజూరు కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వెంటనే స్పందించి బయోమెట్రిక్ మిషన్లు కొనుగోలు చేశాయి. విద్యార్థులతో దరఖాస్తులు చేయిస్తున్నాయి. ఈ మిషను ఖరీదు రూ.25 వేల నుంచి రూ.30 వేల దాకా ఉంటుంది. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలంటూ ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు ప్రశ్నించడంతో చివరకు ఆయా శాఖల అధికారులు కల్పించుకుని వాటిని సమకూర్చారు. అయినప్పటికీ చాలా దరఖాస్తులు కళాశాలల స్థాయిలోనే ఉండిపోయాయి.
మినహాయింపు ఇచ్చిన కళాశాలలూ నిర్లక్ష్యం
స్కాలర్‌షిప్పు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు విషయంలో ఈ ఏడాది జూనియర్ కళాశాలల విద్యార్థులకు బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. వారు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయినా చాలా జూనియర్ కళాశాలల నుంచి నేటికీ దరఖాస్తులు అందలేదు. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలే ఉండడం గమనార్హం.
ముందు దరఖాస్తు చేసుకున్న వారికే ప్రాధాన్యత
గతంలో ఒక కళాశాలలో ఏ ఒక్క విద్యార్థి దరఖాస్తు చేసుకోకపోయినా మొత్తం విద్యార్థుల దరఖాస్తులు పెండింగు పడేవి. ఇప్పడా పరిస్థితి లేదు. ఆన్‌లైన్ చేయడంతో ఎవరు ముందు దరఖాస్తు చేసుకుని ఆయా శాఖల్లో హార్డ్‌కాపీలు ఇస్తారో...వారికి (నిధులున్న మేరకు) మంజూరు చేస్తారు. ఈ విషయంలో ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలనే తారతమ్యమేమీ ఉండదు. విద్యార్థులతో దరఖాస్తు చేయించాల్సిన బాధ్యత ఆయా కళాశాలల యాజమాన్యాలదే. ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు తేరుకునేలోపే పుణ్యకాలం కాస్త ముగిసింది. దరఖాస్తుల విషయంలో ప్రైవేట్ యాజమాన్యాలు చాలా ముందున్నాయి. ముందస్తుగా దరఖాస్తు చేయడంతో మంజూరైన నిధుల్లో 80 శాతానికి పైగా ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకే అందాయి. 20 శాతంలోపు బడ్జెట్ మాత్రమే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు మంజూరు చేశారు.
ఆదిలోనే హంసపాదు
Published Mon, May 26 2014 2:07 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement