government education
-
బడి పిల్లల చదువులకు సానబెట్టండి
సాక్షి, హైదరాబాద్: సర్కారీ విద్యకు మరింత సానబట్టాలని తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై లక్ష్యాల ను నిర్దేశించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేసింది. 2025–26 నాటికి 3 నుంచి 5 తరగతుల విద్యా ర్థుల ప్రమాణాలు 100%, 8వ తరగతి విద్యార్థుల ప్రమాణాలు 85% పెంచాలని ఆదేశించింది. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాల్లో వచ్చిన మార్పులపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) అనేక విషయాలను వెల్లడించింది. విద్యార్థులు భాషల్లో గరిష్టంగా 70% సామర్థ్యం కూడా లేరని, గణితంలో మూడో తరగతిలో 69% మెరుగ్గా ఉంటే, 8వ తరగతిలో కేవలం 37 శాతమే సామర్థ్యం కలిగి ఉన్నారని పేర్కొంది. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసింది. న్యాస్ నివేదికపై ఈ విద్యా సంవత్సరం మొదట్లో జాతీయ స్థాయి సమీక్ష జరిగింది. దీంతో అన్ని రాష్ట్రాల విద్యాశాఖలను భాగస్వాము లను చేసి పురోగతి దిశగా ముందుకెళ్లాలని కేంద్రం భావిస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలన ఏదీ? రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి చదివే, రాసే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తొలిమెట్టు, బ్రిడ్జి కోర్సుల ద్వారా పాఠశాలల ప్రారంభంలోనే ఈ దిశగా కొంతమేర కృషి జరిగింది. అయితే దీనిపై క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు వెనుకబడి ఉన్నారనే విమర్శలొస్తున్నాయి. భాషా పండితు లు, సబ్జెక్టు టీచర్ల కొరత కారణంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయత్నం జరగలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో 3 నుంచి 5 తరగతుల విద్యార్థుల్లో 100% సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ కేంద్రానికి భరోసా ఇచ్చింది. 8వ తరగతి విద్యార్థుల్లో ప్రస్తుత అభ్యసన సామర్థ్యాన్ని 85 శాతానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. న్యాస్ రెండేళ్లకోసారి సర్వే నిర్వహిస్తుండగా...గతేడాది సర్వేలో కోవిడ్ మూలంగా ప్రమాణాల మెరుగుదలలో పురోగతి కనిపించలేదని భావిస్తున్నారు. లక్ష్య సాధన సాధ్యమేనా? వాస్తవానికి కరోనా వ్యాప్తి అనంతరం ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ రెండేళ్లలో ఏటా 2 లక్షల మంది కొత్తగా చేరారు. కరోనా కారణంగా ఆర్థిక స్థితిగతులు దెబ్బతినడం, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు కట్టలేని పరిస్థితి, ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం విద్య ఇవన్నీ విద్యార్థుల సంఖ్యను పెంచాయి. కానీ విద్యార్థులు చేరినా సర్కారీ స్కూళ్లలో సమస్యలు పరిష్కరించలేదనే విమర్శలున్నాయి. పుస్తకాల ముద్రణలో తీవ్ర జాప్యం, సెప్టెంబర్ వరకూ బోధనే చేపట్టకపోవడం, ఇప్పటికీ పార్ట్–1 పూర్తవ్వకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. బదిలీలు, ప్రమోషన్లు లేని కారణంగా సబ్జెక్టు టీచర్ల కొరత ఇతర సమస్యలు ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో విద్యాశాఖ వచ్చే ఐదేళ్లకు నిర్దేశించిన లక్ష్యాల సాధనపై పలువురు ఉపాధ్యాయులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
విద్యా వ్యవస్థను గాడిలో పెడదాం
ఖమ్మం: ప్రభుత్వవిద్యను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం వినూత్నంగా ముందుకెళుతుందని, ఇందులో అందరినీ భాగస్వాములను చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అంశాలపై ఖమ్మం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువా రం ఇక్కడ డిప్యూటీ సీఎం సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోజురోజుకూ ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజల్లో నమ్మకం పోతోందని, వారికి విశ్వాసం కల్పించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని అన్నారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఈనెలాఖరులోగా క్రమబద్ధీకరిస్తామని కడియం తెలిపారు. జూనియర్ కళాశాలల్లో ఈనెలాఖరునుంచి సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీంతో విద్యార్థులను క్రమశిక్షణతో ఉంచడంతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్రంలో 250 ఆశ్రమ పాఠశాలలను కొత్తగా మంజూరు చేశామన్నారు. ఈ పాఠశాలల ద్వారా 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తామని చెప్పారు. నూతనంగా మంజూరైన ఆశ్రమ పాఠశాలల్లో 1.68 లక్షల విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుందని, 7,500 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల మంది బడిఈడు పిల్లలుండగా.. 32 లక్షల మంది ప్రైవే ట్ పాఠశాలల్లో, 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి.. ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సరం ఐదు శాతానికి తగ్గకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను ఆదేశిం చారు. కళాశాలల్లోని ఖాళీల భర్తీకి వచ్చే సంవత్సరం చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల అవసరం మేరకు వచ్చే సంవత్సరం కొత్త కళాశాలలను మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ రతన్ ఆచార్య, విద్యాశాఖ డెరైక్టర్ కిషన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలు వురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
గాలికి పోతున్న చదువు.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు
(సాక్షి వెబ్ ప్రత్యేకం) రాష్ట్ర ఖజానా నుంచి జీతం, ఇతర భత్యాలు తీసుకునే ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని అలహాబాద్ హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాల్సిందే. తీర్పును ఉల్లంఘిస్తే ప్రైవేట్ విద్యా సంస్థలకు చెల్లిస్తున్న ఫీజుకు సమానమైన రుసుమును ప్రభుత్వ ఖజానాకు జమచేయాలన్నది కూడా తీర్పు సారాంశం. రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల విద్య బాధ్యత నుంచి క్రమంగా తప్పించుకునేందుకు వేస్తున్న ఎత్తుగడలకు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఈ తీర్పు ఉత్తరప్రదేశ్‌కు పరిమితమైనప్పటికీ మిగతా రాష్ట్రాల్లో ఈ తరహా నిర్ణయాలు వెలువడేందుకు మార్గం సుగమమైంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్.. ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాల విద్య గత రెండు దశాబ్దాలుగా హీనంగా మారిపోయింది. టీచర్లు ఉండరు, ఉన్నా రారు. పాఠశాల భవనాలు ఉండవు.. ఉన్నా గాలి, వెలుతురు, వర్షం, వరదలతో సహజీవనం చేసే పరిస్థితి. కుర్చీలు, బెంచీలే కాదు చాక్‌పీస్‌లు కూడా కరువే. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల చూపు ప్రైవేటు పాఠశాలల వైపు. 'బడిబాట' చివరికి 'ప్రైవేటు బడిబాట'గా మారిపోయింది. ఆకర్షణీయమైన ప్రకటనలతో కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలను మింగేసే కొండచిలువల్లా మారిపోయాయి. వాటి తాకిడికి చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్లు కూడా మూతపడ్డాయి. ఫీజులు పెరిగాయి.. తల్లిదండ్రుల మీద భారం పెరిగింది. అనారోగ్య వాతావరణానికి తెరలేచింది. ఆట లేదు... పాట లేదు.. ఉదయం నుంచి రాత్రి వరకు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లను బంధించినట్టుగా పిల్లల్ని వేసి రుబ్బి, రుబ్బి జీవం లేని బొమ్మలను తయారుచేసే ఫ్యాక్టరీలుగా, చదువులను చదువు' కొనే' నిలయాలుగా మారిపోయాయి. ఖజానాపై భారం తగ్గించుకునేందుకు 'రేషనలైజేషన్' ముసుగులో పాఠశాలలను కుదించడమే పనిగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈ తరహా నిబంధనలు రూపొందించే అధికారుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారే ఉండటం విచారకరమే. చదువే లోకంగా, లోకజ్ఞానం అసలు లేకుండా ఎదిగితే... చిన్న కుదుపునకు గురైనా పసిప్రాణాలు అవాంఛనీయ మార్గాలు వెతుక్కుంటున్నారు. పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి ఏటా పదులసంఖ్యలో బడి ఈడు పిల్లలు, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా ఉండదు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు... 'విద్యావేత్తలు'గా భుజకీర్తులు తగిలించుకున్నవారు ప్రభుత్వంలో భాగస్వాములైతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలహాబాద్ కోర్టు తీర్పు వెలువరించే కన్నా ఒక రోజు ముందు కడప నారాయణ కాలేజీలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ముక్కుపచ్చలారని ఇద్దరు పసికూనలు ఉరితాడుకు వేలాడారు. ఇలాంటి సంస్థల మీద కేసులు గతంలో లేవు.. ఇపుడూ ఉంటాయన్న ఆశలేదు. కానీ వీటి జయకేతనాలు, ప్రభంజనాలు, సంచలనాలు.. ర్యాంకుల హోరు చెవుల తుప్పు వదిలేలా వినిపిస్తూనే ఉంటుంది. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు దాదాపు ఇలాంటి అంశంపైనే వాదనలు వింటోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై దాఖలైన వ్యాజ్యంలో వాదనలు విన్న హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తిని వెలిబుచ్చింది. పాఠశాల దుస్థితికి కారణమైన అధికారుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ఆదేశాలు జారీచేస్తామని హెచ్చరించింది. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించింది. ప్రాథమిక విద్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే 'కార్పొరేట్' పాఠశాలలు ఎలా రెచ్చిపోతాయో తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చే మార్గదర్శి అయితే ఎంత బావుండు! -
విద్యా సంస్థల బంద్ విజయవంతం
అనంతపురం ఎడ్యుకేషన్ : కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తూ విద్యా, వైద్య పరిరక్షణ సమితి గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ కరువు జిల్లాలో ఫీజులు నియంత్రించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఇస్టానుసారంగా ఫీజులు దండుకుంటున్నా, అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌కు అండగా నిలుస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌళిక వసతుల కల్పన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యపై నమ్మకం లేకనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో విద్యా, వైద్య పరిరక్షణ సమితి నాయకులు నాగరాజు, ఆకుల రాఘవేంద్ర, సాకే నరేష్, వేణుగోపాల్, రమేష్, అమర్‌యాదవ్, ధనుంజయనాయక్, ఆనంద్, చంద్ర, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు అందని ద్రాక్షగా ప్రభుత్వ విద్య
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల బిడ్డలకు ప్రభుత్వ విద్యను అందకుండా చేస్తోందని ప్రొఫెసర్ రామకృష్ణ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని చైతన్య ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణ చేస్తున్నారని విమర్శించారు. పేదోడికి ఒక విద్య, ధనికుడికి మరో విద్య అందుతుందన్నారు. శాస్త్రీయమైన విద్య, దేశవ్యాప్తంగా కామన్ విద్యా విధానం అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎన్నికల ముందు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి ఏ ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. బంగారు తెలంగాణ అని చెప్తున్న కేసీఆర్ బాధల తెలంగాణగా మారుస్తున్నారన్నారు. విద్యను వ్యాపారం చేస్తూ అంగడి సరుకుగా మారుస్తున్న విద్యాలయాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్, సైదులు, నాయకులు ఆది, కృష్ణ, నర్సింహా, మహేష్, కురుమూర్తి, ఎల్లయ్య, అంజి, కవిత, సుజాత పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్య ప్రతిభకు నెలవు
వసతి గృహాలు పెట్టగానే ప్రమాణాలు రావు. మేనేజ్మెంట్కు లాభాపేక్ష కన్నా సామాజిక దృక్పథం కావాలి. కానీ దానికి భిన్నంగా కార్పొరేట్ శక్తులే పాలనలోకి ప్రవేశించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ విద్యాలయాన్ని పెట్టేందుకు ముందుకు రావడం గొప్ప విషయం. ఇల్లు అలుకగానే పండుగ కాదు, ఇంటిని తీర్చిదిద్దుకోవ టం అనుకున్నంత సులభమై నది కాదు. 1952లో విద్యా శాఖ సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైన బాధ్య తను, కర్తవ్యాన్ని నిర్వహిం చేది. నేటి విద్యారంగం స్థితిని చూస్తే నాటి కంటే నేడు మరింత గురుతరమైన బాధ్యత విద్యాశాఖపై ఉంది. కాలమేదైనా విద్య అంటే సమాజ పరివర్తనే దాని కర్తవ్యం. నేటి ఆర్థిక రంగానికి విద్యారంగం బలమైన అంగంగా మారింది. సామాన్యుని భాగస్వామ్యంతో అది నేడు అభివృద్ధికి దోహదపడవలసి ఉంది. కొత్తతరం వచ్చింది కానీ ఆ తరం బడి మాత్రం పోలేదు. విద్య వల్లనే తన భవిష్యత్‌ను, తన పిల్లల భవిష్యత్‌ను కూడా నిర్మించాలనే కాంక్షగల సమాజం వచ్చింది. ఆనాడు యజమాని చెప్పటం ఉద్యోగి చేయడం జరిగేది. దాన్నే కమాండింగ్ వ్యవస్థ అంటారు. కానీ ఈనాడు ఎవరూ ఏమీ చెప్పరు. ప్రతి విషయాన్ని ఉద్యోగే ఆలోచించుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. నేడు ప్రతి విద్యార్థి ప్రతిరోజూ ఇంటర్వ్యూకు సిద్ధం కావలసివస్తోంది. ఎంతో లోతైన జ్ఞానం ఉం టే తప్ప నేటి విద్యార్థులు నిలదొక్కుకోలేరు. కాబట్టే విద్యారంగం బాధ్యత మరింత పెరిగింది. ఈ పరి స్థితుల్లో ఛిన్నాభిన్నమైన వ్యవస్థను గాడిలో పెట్ట టం ఒకటైతే, మారుతున్న ఆర్థికవ్యవస్థలో మనగ లిగిన మానవ సంపదను తయారు చేయడం కీల కమైనది. అత్యున్నత నైపుణ్యం గల మేధావి వర్గం అందుకు అవసరం. ప్రతిభగల మేధావి వర్గం గాలి లోంచి ఊడిపడదు. ప్రతిభ రావాలంటే విద్యారం గంలో సమత్వం ఉండాలి. సమత్వం నుంచి వచ్చిన ప్రతిభ కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. ఈనాడు విద్యాశాఖ ఎక్సెలెన్సీ కన్నా ఈక్విటీపైన దృష్టిని కేంద్రీకరించాలి. సమత్వంలో విద్యార్థి నేపథ్యమే ప్రధానమైనది. వారి తల్లిదండ్రులు చదు వుకున్నవారు కాదు. ఈ పాత్రను కూడా ఉపా ధ్యాయవర్గమే నిర్వహించవలసి ఉంటుంది. బోధనకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, తర గతి వెలుపల మోటివేషన్‌కు కూడా అంతే ప్రాధా న్యత ఉంటుంది. దీన్ని గమనించే పీవీ నర్సింహా రావు అప్పట్లోనే రెసిడెన్షియల్ విద్యావ్యవస్థను ప్రవేశపెట్టారు. విద్యార్థి చదువుకున్న స్కూలు పేరు చెప్పగానే ఆ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసే వారు. ఆటల్లో, జనరల్ నాలెడ్జిలో కూడా ఆ పిల్లలు ఆరితేరినవారుగా నిలిచారు. ఆ పిల్లల బ్యాక్ గ్రౌండ్ చూస్తే పట్టణ ప్రాంతపు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఉపాధ్యాయులు కూ డా ఎంతో అంకిత స్వభావంతో హేమాహేమీలుగా పనిచేశారు. సమర్థవంతమైన పాఠశాలలను నిర్మిం చేందుకు ఆనాటి పాలకవర్గాలు ఎంత శ్రద్ధ వహిం చాయో గమనించాలి. అంకిత స్వభావమున్న ఉపాధ్యాయులను ఎన్నుకోవటం ఒక పనైతే, వారిని నిలబెట్టుకోవటా నికి కావల్సిన పరిస్థితులను కలిగించడం రెండో భాగం. సమత్వం తేవటం కోసం రెసిడెన్షియల్ హైస్కూల్స్ ఏర్పాటు చేశారు. అది కాకుండా ఈ పిల్లల ఉన్నత విద్య కోసమై నాగార్జునసాగర్‌లో ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ, ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ పెట్టారు. రెండు మూడు సంవత్సరాల లోపలనే ఎస్ఎస్సీ ర్యాంకులతో పాటు, ఇంటర్మీడి యట్ ర్యాంకులన్నీ ప్రభుత్వ స్కూళ్లకే వచ్చాయి. పేద కుటుంబాల పిల్లల విద్యాప్రమాణాలు సం పన్న కుటుంబాల పిల్లల కన్న ఎక్కువగా వచ్చాయి. ప్రజలకు ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూళ్ల నిర్వాహకులు ఈ పేద పిల్లలకు ర్యాంకులు ఎలా వచ్చాయని ఆశ్చ ర్యపోయారు. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా అప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ మొదలు పెట్టాయి. కానీ ఆ ప్రభుత్వ స్కూళ్లు సాధించిన ఫలితాలు మాత్రం రాలేదు. రెసిడెన్షియల్ వ్యవస్థ వల్ల, విద్యార్థులకు భోజనం వల్ల వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కానీ, ఉపాధ్యాయుని అంకిత స్వభావం, ఉపాధ్యాయుడు-విద్యార్థి మ ధ్య సంబంధాలే విద్యాప్రమాణాలను నిర్ణయి స్తాయి. ప్రభుత్వ స్కూళ్లలో మెరికల్లాంటి విద్యార్థు లున్నారని అనటం మాత్రమే కాదు. దాని వెనుక ఉపాధ్యాయుల దీక్ష ఎంత గొప్పదో గుర్తించాలి. వసతి గృహాలు పెట్టగానే ప్రమాణాలు రావు. మేనే జ్మెంట్కు సామాజిక దృక్పథం కావాలి. కానీ దానికి భిన్నంగా కార్పొరేట్ శక్తులే ప్రభుత్వ పాల నలోకి ప్రవేశించి ప్రభుత్వ విద్యావ్యవస్థను నీరు గార్చే దశకు వచ్చేశాయి. తెలంగాణ ప్రభుత్వం పాత విద్యా వ్యవస్థలోని సుగుణాలను కొనసాగి స్తామంటోంది. ప్రభుత్వ విద్యారంగాన్ని గెలిపిస్తా మని, పేదవర్గాల పిల్లలను అత్యున్నత ప్రమాణా లుగల మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు అంతా అభి నందిస్తున్నారు. ప్రతి మండలానికి ఒక రెసిడెన్షి యల్ విద్యాలయాన్ని పెట్టేందుకు ముందుకు రావ డం గొప్ప విషయం. దాంతోపాటుగా బోధనలో బంగారు బాటలువేయాలి. ప్రపంచస్థాయిలో తెలంగాణ విద్యార్థులు ప్రతిభతో రాణించాలి. అం దుకు ప్రభుత్వం నిరంతర కృషి చేయవలసి ఉంది. (చుక్కా రామయ్య , వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) -
ఆదిలోనే హంసపాదు
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులంటే యాజమాన్యాలకూ లోకువే. 2013-14 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాలకు దరఖాస్తుల విషయంలో ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరే ఇందుకు నిదర్శనం. విద్యా సంవత్సరం ముగిసినా నేటికీ గత ఏడాదికి (2013-14) సంబంధించిన 14,486 దరఖాస్తులు కళాశాలల స్థాయిలోనే పెండింగ్ పడ్డాయి. వీటిలో 90 శాతం ప్రభుత్వ కళాశాలల నుంచే పెండింగ్ ఉండడం గమనార్హం. యాజమాన్యాల అలసత్వంతో పాటు చిన్న చిన్న కారణాల వల్ల దరఖాస్తులు ముందుకు వెళ్లలేదు. పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం లేకపోవడం వల్ల కూడా కొన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా సర్టిఫికెట్లు స్కానింగ్‌కు తీసుకోవడం లేదు. అమ్మాయికి బదులుగా అబ్బాయి, అబ్బాయికి బదులుగా అమ్మాయి అని పొరబాటున క్లిక్ చేసిన కారణంగా, బ్యాంకు ఖాతా నంబరు తప్పుగా నమోదు చేసినందు వల్ల వాటిని సవరించుకునే వీలు లేకుండా పోయింది. జిల్లా స్థాయిలో సరిదిద్దుకునే వెసులుబాటు కల్పించలేదు. ప్రతి చిన్న విషయానికి హైదరాబాద్‌కు వెళ్లాలంటూ ఆయా శాఖల అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు. దీంతో వారు తలలు పట్టుకుంటున్నారు. బయో మెట్రిక్‌తో అసలు సమస్య ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పు మంజూరు కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు వెంటనే స్పందించి బయోమెట్రిక్ మిషన్లు కొనుగోలు చేశాయి. విద్యార్థులతో దరఖాస్తులు చేయిస్తున్నాయి. ఈ మిషను ఖరీదు రూ.25 వేల నుంచి రూ.30 వేల దాకా ఉంటుంది. ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలంటూ ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు ప్రశ్నించడంతో చివరకు ఆయా శాఖల అధికారులు కల్పించుకుని వాటిని సమకూర్చారు. అయినప్పటికీ చాలా దరఖాస్తులు కళాశాలల స్థాయిలోనే ఉండిపోయాయి. మినహాయింపు ఇచ్చిన కళాశాలలూ నిర్లక్ష్యం స్కాలర్‌షిప్పు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు విషయంలో ఈ ఏడాది జూనియర్ కళాశాలల విద్యార్థులకు బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. వారు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయినా చాలా జూనియర్ కళాశాలల నుంచి నేటికీ దరఖాస్తులు అందలేదు. వీటిలో ఎక్కువగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలే ఉండడం గమనార్హం. ముందు దరఖాస్తు చేసుకున్న వారికే ప్రాధాన్యత గతంలో ఒక కళాశాలలో ఏ ఒక్క విద్యార్థి దరఖాస్తు చేసుకోకపోయినా మొత్తం విద్యార్థుల దరఖాస్తులు పెండింగు పడేవి. ఇప్పడా పరిస్థితి లేదు. ఆన్లైన్ చేయడంతో ఎవరు ముందు దరఖాస్తు చేసుకుని ఆయా శాఖల్లో హార్డ్‌కాపీలు ఇస్తారో...వారికి (నిధులున్న మేరకు) మంజూరు చేస్తారు. ఈ విషయంలో ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలనే తారతమ్యమేమీ ఉండదు. విద్యార్థులతో దరఖాస్తు చేయించాల్సిన బాధ్యత ఆయా కళాశాలల యాజమాన్యాలదే. ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు తేరుకునేలోపే పుణ్యకాలం కాస్త ముగిసింది. దరఖాస్తుల విషయంలో ప్రైవేట్ యాజమాన్యాలు చాలా ముందున్నాయి. ముందస్తుగా దరఖాస్తు చేయడంతో మంజూరైన నిధుల్లో 80 శాతానికి పైగా ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకే అందాయి. 20 శాతంలోపు బడ్జెట్ మాత్రమే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు మంజూరు చేశారు.