సాక్షి, హైదరాబాద్: సర్కారీ విద్యకు మరింత సానబట్టాలని తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై లక్ష్యాల ను నిర్దేశించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేసింది. 2025–26 నాటికి 3 నుంచి 5 తరగతుల విద్యా ర్థుల ప్రమాణాలు 100%, 8వ తరగతి విద్యార్థుల ప్రమాణాలు 85% పెంచాలని ఆదేశించింది.
కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాల్లో వచ్చిన మార్పులపై నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్) అనేక విషయాలను వెల్లడించింది. విద్యార్థులు భాషల్లో గరిష్టంగా 70% సామర్థ్యం కూడా లేరని, గణితంలో మూడో తరగతిలో 69% మెరుగ్గా ఉంటే, 8వ తరగతిలో కేవలం 37 శాతమే సామర్థ్యం కలిగి ఉన్నారని పేర్కొంది. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసింది. న్యాస్ నివేదికపై ఈ విద్యా సంవత్సరం మొదట్లో జాతీయ స్థాయి సమీక్ష జరిగింది. దీంతో అన్ని రాష్ట్రాల విద్యాశాఖలను భాగస్వాము లను చేసి పురోగతి దిశగా ముందుకెళ్లాలని కేంద్రం భావిస్తోంది.
క్షేత్రస్థాయి పరిశీలన ఏదీ?
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి చదివే, రాసే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తొలిమెట్టు, బ్రిడ్జి కోర్సుల ద్వారా పాఠశాలల ప్రారంభంలోనే ఈ దిశగా కొంతమేర కృషి జరిగింది. అయితే దీనిపై క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు వెనుకబడి ఉన్నారనే విమర్శలొస్తున్నాయి. భాషా పండితు లు, సబ్జెక్టు టీచర్ల కొరత కారణంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రయత్నం జరగలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో 3 నుంచి 5 తరగతుల విద్యార్థుల్లో 100% సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ కేంద్రానికి భరోసా ఇచ్చింది. 8వ తరగతి విద్యార్థుల్లో ప్రస్తుత అభ్యసన సామర్థ్యాన్ని 85 శాతానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. న్యాస్ రెండేళ్లకోసారి సర్వే నిర్వహిస్తుండగా...గతేడాది సర్వేలో కోవిడ్ మూలంగా ప్రమాణాల మెరుగుదలలో పురోగతి కనిపించలేదని భావిస్తున్నారు.
లక్ష్య సాధన సాధ్యమేనా?
వాస్తవానికి కరోనా వ్యాప్తి అనంతరం ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ రెండేళ్లలో ఏటా 2 లక్షల మంది కొత్తగా చేరారు. కరోనా కారణంగా ఆర్థిక స్థితిగతులు దెబ్బతినడం, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు కట్టలేని పరిస్థితి, ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం విద్య ఇవన్నీ విద్యార్థుల సంఖ్యను పెంచాయి. కానీ విద్యార్థులు చేరినా సర్కారీ స్కూళ్లలో సమస్యలు పరిష్కరించలేదనే విమర్శలున్నాయి.
పుస్తకాల ముద్రణలో తీవ్ర జాప్యం, సెప్టెంబర్ వరకూ బోధనే చేపట్టకపోవడం, ఇప్పటికీ పార్ట్–1 పూర్తవ్వకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. బదిలీలు, ప్రమోషన్లు లేని కారణంగా సబ్జెక్టు టీచర్ల కొరత ఇతర సమస్యలు ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో విద్యాశాఖ వచ్చే ఐదేళ్లకు నిర్దేశించిన లక్ష్యాల సాధనపై పలువురు ఉపాధ్యాయులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment