గాలికి పోతున్న చదువు.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు | neglegency over primary education leading corporatisation, comments high court | Sakshi
Sakshi News home page

గాలికి పోతున్న చదువు.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు

Published Thu, Aug 20 2015 4:46 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM

గాలికి పోతున్న చదువు.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు

గాలికి పోతున్న చదువు.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు

(సాక్షి వెబ్ ప్రత్యేకం)
రాష్ట్ర ఖజానా నుంచి జీతం, ఇతర భత్యాలు తీసుకునే ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని అలహాబాద్ హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, న్యాయవ్యవస్థలో  పనిచేసే ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాల్సిందే. తీర్పును ఉల్లంఘిస్తే ప్రైవేట్ విద్యా సంస్థలకు చెల్లిస్తున్న ఫీజుకు సమానమైన రుసుమును ప్రభుత్వ ఖజానాకు జమచేయాలన్నది కూడా తీర్పు సారాంశం.

రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల విద్య బాధ్యత నుంచి క్రమంగా తప్పించుకునేందుకు వేస్తున్న ఎత్తుగడలకు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఈ తీర్పు ఉత్తరప్రదేశ్కు పరిమితమైనప్పటికీ మిగతా రాష్ట్రాల్లో ఈ తరహా నిర్ణయాలు వెలువడేందుకు మార్గం సుగమమైంది.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్.. ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాల విద్య గత రెండు దశాబ్దాలుగా హీనంగా మారిపోయింది. టీచర్లు ఉండరు, ఉన్నా రారు. పాఠశాల భవనాలు ఉండవు.. ఉన్నా గాలి, వెలుతురు, వర్షం, వరదలతో సహజీవనం చేసే పరిస్థితి.  కుర్చీలు, బెంచీలే కాదు చాక్పీస్లు కూడా కరువే. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల చూపు ప్రైవేటు పాఠశాలల వైపు. 'బడిబాట' చివరికి 'ప్రైవేటు బడిబాట'గా మారిపోయింది. ఆకర్షణీయమైన ప్రకటనలతో కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలను మింగేసే కొండచిలువల్లా మారిపోయాయి. వాటి తాకిడికి చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్లు కూడా మూతపడ్డాయి. ఫీజులు పెరిగాయి.. తల్లిదండ్రుల మీద భారం పెరిగింది. అనారోగ్య వాతావరణానికి తెరలేచింది. ఆట లేదు... పాట లేదు.. ఉదయం నుంచి రాత్రి వరకు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లను బంధించినట్టుగా పిల్లల్ని వేసి  రుబ్బి, రుబ్బి జీవం లేని బొమ్మలను తయారుచేసే ఫ్యాక్టరీలుగా,  చదువులను  చదువు' కొనే' నిలయాలుగా మారిపోయాయి.

ఖజానాపై భారం తగ్గించుకునేందుకు 'రేషనలైజేషన్' ముసుగులో పాఠశాలలను కుదించడమే పనిగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈ తరహా నిబంధనలు రూపొందించే అధికారుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారే ఉండటం విచారకరమే.

చదువే లోకంగా, లోకజ్ఞానం అసలు లేకుండా ఎదిగితే... చిన్న కుదుపునకు గురైనా పసిప్రాణాలు అవాంఛనీయ మార్గాలు వెతుక్కుంటున్నారు. పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి ఏటా పదులసంఖ్యలో బడి ఈడు పిల్లలు, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా ఉండదు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు... 'విద్యావేత్తలు'గా భుజకీర్తులు తగిలించుకున్నవారు ప్రభుత్వంలో భాగస్వాములైతే పరిస్థితి ఎలా ఉంటుందో  చెప్పాల్సిన పనిలేదు. అలహాబాద్ కోర్టు తీర్పు వెలువరించే కన్నా ఒక రోజు ముందు కడప నారాయణ కాలేజీలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ముక్కుపచ్చలారని ఇద్దరు  పసికూనలు ఉరితాడుకు వేలాడారు. ఇలాంటి సంస్థల మీద కేసులు గతంలో లేవు.. ఇపుడూ ఉంటాయన్న ఆశలేదు. కానీ వీటి జయకేతనాలు, ప్రభంజనాలు, సంచలనాలు.. ర్యాంకుల హోరు చెవుల తుప్పు వదిలేలా వినిపిస్తూనే ఉంటుంది.

ఇదే సమయంలో హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టు దాదాపు ఇలాంటి అంశంపైనే వాదనలు వింటోంది. మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై దాఖలైన వ్యాజ్యంలో వాదనలు విన్న హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తిని వెలిబుచ్చింది. పాఠశాల దుస్థితికి కారణమైన అధికారుల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ఆదేశాలు జారీచేస్తామని హెచ్చరించింది. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించింది. ప్రాథమిక విద్యను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే 'కార్పొరేట్' పాఠశాలలు ఎలా రెచ్చిపోతాయో తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చే మార్గదర్శి అయితే ఎంత బావుండు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement