విద్యా వ్యవస్థను గాడిలో పెడదాం
ఖమ్మం: ప్రభుత్వవిద్యను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం వినూత్నంగా ముందుకెళుతుందని, ఇందులో అందరినీ భాగస్వాములను చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అంశాలపై ఖమ్మం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువా రం ఇక్కడ డిప్యూటీ సీఎం సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రోజురోజుకూ ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజల్లో నమ్మకం పోతోందని, వారికి విశ్వాసం కల్పించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని అన్నారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఈనెలాఖరులోగా క్రమబద్ధీకరిస్తామని కడియం తెలిపారు. జూనియర్ కళాశాలల్లో ఈనెలాఖరునుంచి సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీంతో విద్యార్థులను క్రమశిక్షణతో ఉంచడంతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్రంలో 250 ఆశ్రమ పాఠశాలలను కొత్తగా మంజూరు చేశామన్నారు. ఈ పాఠశాలల ద్వారా 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తామని చెప్పారు. నూతనంగా మంజూరైన ఆశ్రమ పాఠశాలల్లో 1.68 లక్షల విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుందని, 7,500 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల మంది బడిఈడు పిల్లలుండగా.. 32 లక్షల మంది ప్రైవే ట్ పాఠశాలల్లో, 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి.. ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సరం ఐదు శాతానికి తగ్గకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను ఆదేశిం చారు. కళాశాలల్లోని ఖాళీల భర్తీకి వచ్చే సంవత్సరం చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల అవసరం మేరకు వచ్చే సంవత్సరం కొత్త కళాశాలలను మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ రతన్ ఆచార్య, విద్యాశాఖ డెరైక్టర్ కిషన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలు వురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.