విద్యా సంస్థల బంద్ విజయవంతం
అనంతపురం ఎడ్యుకేషన్ : కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తూ విద్యా, వైద్య పరిరక్షణ సమితి గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ కరువు జిల్లాలో ఫీజులు నియంత్రించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఇస్టానుసారంగా ఫీజులు దండుకుంటున్నా, అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
మరోవైపు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌కు అండగా నిలుస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌళిక వసతుల కల్పన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యపై నమ్మకం లేకనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో విద్యా, వైద్య పరిరక్షణ సమితి నాయకులు నాగరాజు, ఆకుల రాఘవేంద్ర, సాకే నరేష్, వేణుగోపాల్, రమేష్, అమర్‌యాదవ్, ధనుంజయనాయక్, ఆనంద్, చంద్ర, నవీన్ తదితరులు పాల్గొన్నారు.