కార్పొ‘రేటు’ చదువు కొంటున్నారు..! | highest money in croporation schools | Sakshi
Sakshi News home page

కార్పొ‘రేటు’ చదువు కొంటున్నారు..!

Published Wed, Jun 4 2014 4:24 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

కార్పొ‘రేటు’  చదువు కొంటున్నారు..! - Sakshi

కార్పొ‘రేటు’ చదువు కొంటున్నారు..!

 సార్.. మీ అబ్బాయి టెన్త్ కంప్లీట్ అయింది కదా.. మా కాలేజీలో జాయిన్ చేయించండి.. క్యాంపస్ బాగుంటుంది..      సౌకర్యాలు బాగుంటాయి.. అన్నింటికీ మించి అత్యుత్తమంగా బోధించే అధ్యాపకులు ఉన్నారు.
ఇవీ బందరులోని ఓ ప్రయివేటు కాలేజీ పీఆర్వో విద్యార్థుల తల్లిదండ్రులతో చెబుతున్న మాటలు
 ఏమండీ, మన వాడు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ వాడి భవిష్యత్ గురించి బెంగలేకుండా ఉండేలా ఇప్పట్నుంచే మంచి కాలేజీలో చేర్పించే ఆలోచన చేయండి.. మీరు మరీ పిసినారిలా డబ్బుల గురించి ఆలోచించకండి..

ఇది ఓ సగటు గృహిణి ఆవేదన మీ పీఆర్వో చెప్పిన మాటలకు.. ఇక్కడ జరుగుతున్నదానికి పొంతనలేదు.. రకరకాల సాకులతో వేలాది రూపాయలు లాగేస్తున్నారు.. ఇలాగైతే మా అబ్బాయి చదువు కోసం మేం అప్పులపాలవ్వాల్సిందే..ఇది ఓ ప్రయివేటు కాలేజీ యాజమాన్యం వద్ద సాధారణ ఉద్యోగి ఆందోళన.
ప్రయివేటు విద్యా సంస్థల్లో పెరిగిన ఫీజులు రంగంలోకి పీఆర్వోలు పిల్లల చదువుల కోసం పెద్దల జేబులు గుల్ల
 
సాక్షి, మచిలీపట్నం : ఇదీ విద్యా వ్యాపారం మూడు పాఠ్యపుస్తకాలు.. ఆరు నోట్ పుస్తకాలు.. మాదిరిగా వర్థిల్లుతోందని చెప్పడానికి నిదర్శనం. ఈ పరిస్థితి బందరులోనే కాదు.. జిల్లా అంతటా ఉంది. ప్రతిచోటా తమ పిల్లలు చదువు‘కొనేందుకు’ తల్లిదండ్రులు పడుతున్న పాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రవేయివేటు విద్యా సంస్థలు మాత్రం మరో రెండు, మూడు రోజుల్లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇందుకు అనుగుణంగా పలు ప్రయివేటు విద్యా సంస్థలు వీనంత ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకుని అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.

పీఆర్వోల పేరుతో ప్రత్యేక ఏజెంట్లు..!
ప్రయివేటు విద్యా సంస్థలు విద్యార్థులను చేర్చించేందుకు పీఆర్వోల పేరుతో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి గ్రామంలోనూ వాళ్లు తిరుగుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను చల్లని మాటలతో ఆకట్టుకుని ప్రయివేటు విద్యా సంస్థల్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్‌కేజీ నుంచి ఇంటర్, డీగ్రీ వరకు విద్యార్థులను రాబట్టేందుకు తమదైన వాక్చాతుర్యం ప్రదర్శిస్తున్నారు.

ఒక్కో విద్యార్థిని తమ విద్యాసంస్థలో చేర్పించినందుకు ఆ పీఆర్వోలకు ప్రయివేటు విద్యా సంస్థలు ప్రత్యేకంగా నగదు పారితోషికాలను ముట్టజెబుతున్నాయి. ఆ మొత్తాలను కూడా విద్యార్థులపై ఫీజుల రూపంలో భారం మోపుతున్నాయి. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 25 శాతం పైగా ఫీజుల భారం పెరిగిందని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, హాస్టల్ వసతి, రవాణా సౌకర్యం వంటి కారణాలతో ఫీజుల భారం తడిసిమోపడవుతోంది.

ఐదో తరగతి పీజు రూ.25వేలు
 ఐదో తరగతి విద్యార్థులకు స్కూళ్లను బట్టి రూ.6,500 నుంచి రూ.25వేల వరకు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు వసూలు చేస్తున్నారు. జూనియర్ కాలేజీల్లో అయితే రూ.70 వేల నుంచి  రూ.1.75 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది.

పిల్లల భవిష్యత్తు కోసం....
 ఒకప్పుడు సంపన్న వర్గానికి చెందిన విద్యార్థులు మాత్రమే ప్రయివేటు విద్యాసంస్థల్లో చేరేవారు. రానురానూ పేద, మధ్య తరగతి ప్రజలు సైతం తమ పిల్లలు బాగా చదివి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతో ప్రయివేటు విద్యా సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఒక్కో కుటుంబంలో హైస్కూలు స్థాయిలో చదువుకునే ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే వారి కోసం ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.70వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇంటర్మీడియెట్ చదివే పిల్లలు ఇద్దరు ఉంటే రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఆదరణ లేని కోర్సులకు బ్రేక్
ఇంటర్‌లో సీఈసీ (కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్), హెచ్‌ఈసీ (హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్) వంటి గ్రూపుల్లో విద్యార్థులు చేరే అవకాశం లేకపోవడంతో ప్రయివేటు కాలేజీల్లో ఆ గ్రూపులను రద్దు చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీలకు క్రేజ్ పెరగడంతో కార్పొరేట్ కాలేజీలు వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ వైపు వెళ్లే విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోనే ఎక్కువగా చేరుతున్నారు. ఆ కోర్సులకు డిమాండ్ ఉండటంతో ప్రయివేటు విద్యా సంస్థలు వాటిపైనే దృష్టిపెట్టి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement