మళ్లీ వలంటీర్లే..
♦ ఉపాధ్యాయ ఖాళీల స్థానాల్లో విద్యావలంటీర్లు
♦ జిల్లాలో 1,498 స్థానాల్లో భర్తీకి చర్యలు
♦ నేటినుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
♦ ఈనెల 11 సాయంత్రంతో ముగియనున్న గడువు
♦ రోస్టర్, రిజర్వేషన్ ఆధారంగానే ఎంపిక
♦ ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీల స్థానంలో విద్యావలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. ఈమేరకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు ఆసక్తిగల అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవల్సిందిగా డీఈఓ రమేష్ స్పష్టం చేశారు. మొత్తంగా 2016-17 వార్షిక సంవత్సరంలో 1,498 విద్యావలంటీర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రిజర్వేషన్ల ఆధారంగా..
తాజాగా విద్యావలంటీర్ ఎంపిక ప్రక్రియ గతేడాది మారిదిగానే రోస్టర్, రిజర్వేషన్ల ఆధారంగా జరగనుంది. ఈమేరకు జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయ ఖాళీల రోస్టర్‌ను రూపొందిస్తోంది. బుధవారం ఉదయంలోగా రోస్టర్ పట్టిక, ఖాళీల వివరాలను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లో పొందుపర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు 1,498 విద్యావలంటీర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ఉపాధ్యాయులులేని స్కూళ్లలో గతేడాది కొనసాగిన వలంటీర్లతోనే ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో 274 వలంటీర్లు దాదాపు ఖరారైనట్లే. దీంతో తాజా భర్తీ ప్రక్రియలో 1,224 మంది వలంటీర్లను మాత్రమే ఎంపిక చేయనున్నారు.
ఈ వివరాలు తప్పనిసరి..
వలంటీర్ పోస్టుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లో దరఖాస్తును పూరించాలి. అనంతరం ఆ దరఖాస్తును ప్రింట్‌తీసి.. దానితోపాటు కుల, స్థానిక, సర్టిఫికెట్లతోపాటు విద్యాఅర్హత ధ్రువపత్రాల నకలు, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను జతపర్చి సంబంధిత మండల విద్యాశాఖ కార్యాలయంలో పరిశీలన చే యించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని.. ఆ తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. మండలాల వారీగా ఖాళీలు, రోస్టర్ వివరాలను వెబ్‌సైట్లో, ఎంఈఓ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
డీఎస్సీ లేనట్లే...!
ఉపాధ్యాయ ఖాళీల స్థానంలో వలంటీర్ల నియామకంతో ఇప్పట్లో డీఎస్సీ లేదని తెలుస్తోంది. గతేడాది వలంటీర్ల ప్రక్రియ నిర్వహించినప్పట్నుంచి రెగ్యులర్ టీచర్ల నియామకంపై నిరుద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. మరోవైపు టెట్ సైతం నిర్వహించడంతో వారిలో డీఎస్సీపై ఆశలు చిగురించాయి. డీఎస్సీ ప్రక్రియను టీఎస్‌పీఎస్‌సీకి అప్పగిస్తున్నట్లు సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ వేగిరమవుతుందనుకున్న తరుణంలో విద్యా వలంటీర్ల నియామకాలు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాయి. మరో ఏడాది వరకు టీచర్ల భర్తీ లేనట్టే కనిపిస్తోంది.