సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థలు సోమవారం నుంచి పునః ప్రారంభమవుతాయా? వర్షాలు ఇంకా పడుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారా? ఏ నిర్ణయమూ తీసుకోలేక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. భారీవర్షాల నేపథ్యంలో గురు, శుక్ర, శనివారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. కొన్ని జిల్లాల అధికారులు ఈ సమయంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు.
చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయని, తరగతి పైకప్పులు కురుస్తున్నాయని, వర్షపునీరు గదుల్లో ఉందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, తరగతిలో విద్యార్థులు ఉంటే ప్రమాదమని ఎంఈఓలు కూడా డీఈఓలకు చెప్పారు. కొన్ని పాఠశాలల ప్రాంగణంలో వరదనీరు ఇంకా నిల్వ ఉందని, విద్యార్థులు పరుగెడితే జారిపడే ప్రమాదం ఉందంటున్నారు. కొన్ని స్కూళ్లల్లో గోడల్లో చెమ్మ ఉందని, ఫలితంగా విద్యుత్ బోర్డుల్లోంచి గోడలకు కరెంట్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు.
ఏ ఒక్క విద్యార్థికి సమస్య తలెత్తినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా ప్రైవేట్ స్కూళ్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తరగతులు నిర్వహించాయని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో ఆలస్యమైందని, దీంతో బోధన కుంటుపడిందని, ఇంకా సెలవులు పొడిగించడం సరికాదని కొంతమంది టీచర్లు అంటున్నారు. ప్రమాదంగా ఉండే స్కూళ్లను గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు.
సాంకేతిక సమస్యలెన్నో....
వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం, నెట్‌వర్క్ కనెక్షన్‌లో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో దోస్త్, ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎంసెట్ రెండోవిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాలి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఆదివారంతో ముగిసింది.
అయితే చాలామంది విద్యార్థులు రిపోర్ట్ చేయలేకపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా రెండోవిడత కౌన్సెలింగ్ వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెల్ఫ్ రిపోర్టింగ్ గడువూ పొడిగించాలని కోరుతున్నాయి. డిగ్రీ కళాశాల ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌కు సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ ఈ నెల 26తో ముగుస్తుంది.
జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లి నెట్‌లోనో, లేదా కాలేజీకి నేరుగా వెళ్లి రిపోర్టు చేసేందుకు అనేక సమస్యలున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వర్షాల వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నదని, వేరే ప్రాంతాలకు వెళ్లడం కష్టమవుతోందని అంటున్నారు. ఈ కారణంగా దోస్త్ రిపోర్టింగ్ గడువు పొడిగించే యోచనపై అధికారులూ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
విద్యాసంస్థలకు సెలవులు పొడిగించేనా!
Published Mon, Jul 24 2023 4:48 AM | Last Updated on Mon, Jul 24 2023 3:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment