ప్రైవేటు విద్యా సంస్థలకు వ్యతిరేకం కాదు
ఉప ముఖ్యమంత్రి కడియం
హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) ఆధ్వర్యంలో నాగోలు శుభం కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో కడియంతో పాటు ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ‘ప్రైవేటు విద్యా సంస్థలపై ప్రభుత్వానికి ఎలాంటి కక్షసాధింపు లేదు. లోపాలను సవరించుకోవాలని చెబుతున్నాం. విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తోంది.
మానవ వనరుల అభివృద్ధి సూచికలో రాష్ర్టం దిగువ స్థానంలో ఉంది. దీన్ని మెరుగుపరచాలి. రాష్ర్టంలో ప్రైవేటు విద్యా సంస్థల్లోనే అధిక సంఖ్యలో విద్యార్థులున్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఉత్త మ ప్రతిభ కనబర్చేలా బోధన ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రైవేటు విద్యా సంస్థలు ఎదర్కొంటున్న సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తాం. అదే సమయంలో వాటి యాజమాన్యాలు లోపాలు సవరించుకుని బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాల’ని అన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వానికి సహకారం అందించాలని వినోద్, రాజేశ్వర్‌రెడ్డి కోరారు. అనంతరం ట్రస్మా వెబ్‌సైట్‌ను కడియం ఆవిష్కరించారు.