సమావేశంలో మాట్లాడుతున్న కడియం శ్రీహరి. చిత్రంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాఠశాలలకు ప్రత్యేక స్లాబ్‌లో ఆస్తిపన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రైవే ట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలు కలిసి పని చేయాలని, విద్యార్థుల భద్రతలో రాజీపడేది లేదన్నా రు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో సమస్యలపై గురువారం పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కడియం శ్రీహరి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఇందులో విద్యాసంస్థల అనుమతులు, గుర్తింపు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లాయి. అనంతరం సమావేశ వివరాలను కడియం శ్రీహరి మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల భద్రతలో యాజమాన్యాలు కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందేనని, అగ్నిమాపక చర్యలు చేపట్టాలని యాజమాన్యాలకు మంత్రులు స్పష్టం చేశారు. జాతీయ అగ్నిమాపక నిబంధనలు రాకముందు ఏర్పాటైన పాఠశాలల భవనాలకు ఆ నిబంధనలు వర్తింపజేయడంలో ఎలాంటి వెసులుబాటు కల్పించాలనే దానిపై కమిటీ వేస్తామన్నారు. పాఠశాలలకు ఆస్తిపన్నును తగ్గించాలన్న యాజమాన్యాల విజ్ఞప్తిని మంత్రులు అంగీకరించి, ప్రత్యేక స్లాబులో ఆస్తిపన్ను వసూలు చేసేలా చర్యలు చేపడతామని, ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో అది అమల్లో ఉందన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుపై కమిటీ!
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులో డిగ్రీ, జూనియర్ కాలేజీలకు సరైన న్యాయం జరగడం లేదని పేర్కొనగా.. దానిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య చైర్ పర్సన్‌గా ఆర్థిక శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్యదర్శులు సభ్యులుగా కమిటీ వేసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలు, కాలేజీల అనుమతులకు ఎన్‌వోసీల జారీని వికేంద్రీకరించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. హాస్టళ్లకు అనుమతులు తీసుకోవాల్సిందేనని యాజమాన్యాలకు స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలపై కక్షసాధింపు ధోరణి ఏమీ లేదని, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment