సాక్షి, హైదరాబాద్: విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న 194 కాలేజీలకు నోటీసులు జారీ చేశామని.. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వెనుకాడబోమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై షబ్బీర్‌అలీ, భూపాల్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్‌లు అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు. ఈ చర్చ సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థల తీరుపై అధికార, విపక్ష సభ్యులు మండిపడ్డారు. వాటిని దారిలో పెట్టాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కఠినంగా వ్యవహరిస్తాం..
ఆగస్టులో కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరిగిన రెండు ఘటనల నేపథ్యంలో ఇంటర్మీడియెట్ బోర్డు విచారణ జరిపిందని.. కాలేజీల తీరును గుర్తించిందని కడియం చెప్పారు. ‘‘ఉదయం 6 నుంచి రాత్రి 10.30 వరకు ఊపిరి సలపని షెడ్యూలు, వారం వారం పరీక్షలు, సెలవు రోజుల్లోనూ తరగతులు, హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేకపోవడం వంటివాటి కారణంగా మానసిక ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బోర్డు పరిశీలనలో తేలింది.
అలాంటి తీరు వద్దని ప్రభుత్వం హెచ్చరించినా.. వినని 194 కాలేజీలకు నోటీసులు జారీచేశాం. ఇటువంటి విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది..’’అని స్పష్టం చేశారు. అయితే విద్యా సంవత్సరం మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారన్న ఉద్దేశంతో సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. విద్యా సంస్థలు ఎటువంటి సూచనలు పాటించాలనే దానిపై వివరంగా మార్గదర్శకాలు ఇచ్చామన్నారు.
ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు
రాష్ట్రంలోని పలు కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి నుంచే అడ్మిషన్లు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని కడియం తెలిపారు. వాస్తవానికి కాలేజీలు వచ్చే మార్చి 31 నాటికి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, తాము అనుమతి ఇచ్చిన తర్వాత అడ్మిషన్లు చేసుకోవాలని.. ఆ లోపు తీసుకునే అడ్మిషన్లు చెల్లబోవని స్పష్టం చేశారు. దీన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.
రాష్ట్రంలో అవసరానికి మించి ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కాలేజీలు ఉన్నాయని.. నియంత్రణ చర్యలు చేపట్టడంతో వందలాది కాలేజీలు మూతపడుతున్నాయని తెలిపారు. కాగా.. నారాయణ, చైతన్య కాలేజీలు విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నాయని షబ్బీర్‌అలీ ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై పరిశీలనకు సభా సంఘం వేయాలని కోరారు. అయితే రెండు, మూడు నెలల్లో కార్పొరేట్ కాలేజీలను దారిలో పెడతామని.. అప్పటికీ పరిస్థితి నియంత్రణలోకి రాకుంటే హౌస్‌కమిటీపై ఆలోచన చేస్తామని కడియం సమాధానమిచ్చారు.
పెట్రో ఉత్పత్తులు రాష్ట్ర పరిధిలోనే..!
రాష్ట్రంలో మిషన్ భగీరథ, కాకతీయ తదితర పథకాలను అమలు చేస్తున్నందున.. ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికి 19 సార్లు పెరిగాయని, ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో అధికంగా ఉన్నాయని షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు కడియం సమాధానమిచ్చారు. వ్యాట్‌ను సవరించి పెట్రో ఉత్పత్తులపై పన్ను వసూలు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ నీటి అవసరాలకు ‘గ్రిడ్’
హైదరాబాద్ నగర శివార్లలోని కేశవాపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి రిజర్వాయర్ కోసం అనుమతిచ్చామని మంత్రి కె.తారకరామారావు మండలిలో వెల్లడించారు. చౌటుప్పల్ వద్ద మరో రిజర్వాయర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ తాగునీటి అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు.
గోదావరి, కృష్ణా పరీవాహకాన్ని అనుసంధానం చేయడం ద్వారా తాగునీటి సమస్యను అధిగమిస్తామని.. తాగునీటి గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నగరంలో నాలాలపై ఉన్న కబ్జాలను తొలగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment