మే 17 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
♦ జూన్ 9 నుంచి తరగతులు ప్రారంభం
♦ ఆన్‌లైన్‌లో అనుబంధ గుర్తింపు
♦ ప్రైవేటు కాలేజీల్లోనూ బయోమెట్రిక్
♦ ప్రైవేటు కాలేజీలతో సమీక్షలో సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను మే 17 నుంచి 31 వరకు నిర్వహించాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే ఈ నెల 21న జరిగిన పాలిసెట్-2016 ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేయాలని...పాలిటెక్నిక్ డిప్లొమా తరగతులను జూన్ 9 నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల యాజమాన్యాలతో సాంకేతిక విద్య డెరైక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. కాలేజీల దరఖాస్తు ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో అనుబంధ గుర్తింపును వచ్చే వారంలో చేపట్టి మే 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారానే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈలోగా కాలేజీల్లో లోపాల సవరణకు వారం సమయం ఇవ్వాలని... కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌లో, పరీక్ష విధానంలో మార్పులు తెస్తున్నామని, ఇందుకు యాజమాన్యాలు సిద్ధం కావాలని సూచించారు.
తృతీయ సంవత్సర విద్యార్థులకు మాత్రం సీ-14 సిలబస్ ప్రకారమే బోధన కొనసాగుతుందని ఎంవీ రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో కచ్చితంగా వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. కాలేజీలవారీగా వెబ్‌సైట్లను ఏర్పాటు చేసి డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో అనుసంధానించాలన్నారు. వార్షిక ఫీజులను రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచాలన్న ఫీజుల కమిటీ సిఫారసుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఎంవీరెడ్డి పేర్కొన్నారు. అఫిలియేషన్లు ఇచ్చే సమయంలో మంజూరైన ఇన్‌టేక్‌ను కాకుండా కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్యను బట్టి ఫ్యాకల్టీని (1:20 నిష్పత్తిలో) చూసి అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కాలేజీల యాజమాన్యాలు కోరగా పరిశీలిస్తామని డెరైక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో సాంకేతిక విద్య జాయింట్ డెరైక్టర్ మూర్తి, సాంకేతిక విద్య మండలి కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మే 2న పాలిసెట్ ఫలితాలు!
పాలిసెట్-2016 ఫలితాలను మే 2న విడుదల చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 30 నాటికి ఫలితాలు సిద్ధమవుతాయని, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదంతో మే 2న ఫలితాలు విడుదల చేయాలనుకుంటోంది. కాగా, పదో తరగతిలో విద్యార్థుల ఆధార్ నంబర్‌ను పాఠశాల విద్యాశాఖ సేకరిస్తున్న నేపథ్యంలో ఈసారి పాలిటెక్నిక్ ప్రవేశాల్లోనూ విద్యార్థుల ఆధార్‌ను తీసుకునేందుకు సాంకేతిక విద్యాశాఖ యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.28 లక్షల మంది పాలిసెట్‌కు హాజరయ్యారు.