ఫీజుల పేరిట భారీ దోపిడీ | Heavy exploitation in the name of fees | Sakshi
Sakshi News home page

ఫీజుల పేరిట భారీ దోపిడీ

Published Tue, Mar 22 2016 12:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

ఫీజుల పేరిట భారీ దోపిడీ - Sakshi

ఫీజుల పేరిట భారీ దోపిడీ

ప్రైవేటు పాఠశాలల తీరుపై మండిపడ్డ శాసనసభ
♦ కాన్సెప్ట్, టెక్నో, ఐఐటీ ఫౌండేషన్ పేర్లతో దోచుకుంటున్నారు
♦ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఫీజులు రూ.లక్షన్నర నుంచి రూ.4 లక్షలా?
♦ ఫీజు నియంత్రణ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు
♦ ప్రైవేటు స్కూళ్లలో పేద వర్గాలకు 25 శాతం రిజర్వేషన్‌పై చర్యలేవి?
♦ అసెంబ్లీలో సర్కారును నిలదీసిన ప్రతిపక్షాలు
♦15 రోజుల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు: కడియం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఫీజుల పేరిట అడ్డగోలుగా వసూలు చేస్తున్న తీరుపై సోమవారం శాసనసభ అట్టుడికింది. కాన్సెప్ట్, టెక్నో, ఐఐటీ ఫౌండేషన్లని ఏవేవో పేర్లు చెబుతూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని... వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు ఉన్న తరహాలో పాఠశాలలకు కూడా ‘ఫీజు నియంత్రణ కమిటీ  (ఎఫ్‌ఆర్‌సీ)’లు ఏర్పాటు చేసేందుకు అడ్డేమిటని నిలదీశాయి. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఆర్.కృష్ణయ్య (టీడీపీ), కె.లక్ష్మణ్ (బీజేపీ), అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), పువ్వాడ అజయ్ (కాంగ్రెస్) తదితరులు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

 దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఫీజులు
 దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వివిధ రకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తూ ప్రైవేటు పాఠశాలలు దోపిడీ చేస్తున్నాయని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. ‘‘ఓక్రిడ్జ్, డీపీఎస్, నారాయణ వంటి విద్యా సంస్థలు రూ.లక్షన్నర నుంచి రూ.4లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా హింసిస్తున్నాయి. వాటిల్లో జనవరిలోనే 80 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి. విద్యాహక్కు చట్టం నిబంధన ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేదలకు 25 శాతం ప్రవేశాలు కల్పించాలన్న నిబంధన అమలు కావడం లేదు..’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయని బీజేపీ సభాపక్ష నేత కె.లక్ష్మణ్ చెప్పారు.

ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు ఏఎఫ్‌ఆర్సీ ఉందని, మరి పాఠశాలలకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. దేశంలో అత్యధిక ఫీజు వసూళ్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని, 50 శాతానికి పైగా ఫీజులు వసూలు చేస్తున్న 12 పాఠశాలలకు నోటీసులు ఇచ్చి చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. కేజీ టు పీజీ కాగితాలకే పరిమితమైపోయిందని విమర్శించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు మధ్య, దిగువ మధ్య తరగతికి పెనుభారంగా పరిణమించాయని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఒకే యాజమాన్యం కింద వందలాది పాఠశాలలు ఉండకూడదని, ఫీజుల నియంత్రణకు చట్టం కచ్చితంగా ఉండాలని చెప్పారు. కళాశాలల తరహాలో పాఠశాలల్లోనూ ఫీజులను నియంత్రించి, 25 శాతం సీట్లు పేద పిల్లలకు అందేలా చూడాలని కాంగ్రెస్ సభ్యుడు పువ్వాడ అజయ్ కోరారు.
 
 అధిక ఫీజులు వాస్తవమే.. చర్యలు తీసుకుంటాం: కడియం
  ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అంగీకరించారు. ఫీజుల నియంత్రణ కోసం 2009, 2010లో తెచ్చిన 91, 42 జీవోలపై ప్రైవేటు విద్యాసంస్థలు కోర్టుకు వెళ్లడంతో అవి అమలు కాలేదన్నారు. అయినా జీవో నంబర్ 1 ద్వారా విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నోటీసులు జారీ చేసిన 12 ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇచ్చిన వివరణను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. 15 రోజుల్లో ఫీజుల నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గుర్తింపులేని పాఠశాలలు గతంలో 650 ఉంటే ఇప్పుడు 152కి తగ్గాయని.. ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కూడా పదోతరగతి పరీక్షలు రాసే సౌకర్యం కల్పించామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను బీపీఎల్ వర్గాల వారికి కేటాయిస్తే... ప్రభుత్వ పాఠశాలలు మూసుకోవలసి వస్తుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement