వేలిముద్రకు రూ.300
⇒ ‘ఉపకార’, రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల పరిశీలనలో కాలేజీల దందా
⇒ దరఖాస్తుల ఆమోదానికి విద్యార్థుల వేలిముద్రలు అవసరం
⇒ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు
ఈశ్వర్ హయత్‌నగర్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు పరిశీలనకు సంబంధించి వేలిముద్రలు ఇచ్చేందుకు కళాశాల కార్యాలయానికి వెళ్లాడు. రూ. 300 చెల్లిస్తేనే వేలిముద్రలు తీసుకుంటామని సిబ్బంది స్పష్టం చేసింది. గత్యంతరం లేక డబ్బులు చెల్లించి వేలిముద్రలు ఇచ్చాడు. అయితే డబ్బులు తీసుకున్నందుకు రశీదు అడిగితే సిబ్బంది మూకుమ్మడిగా హెచ్చరికలు జారీ చేశారు. ఈశ్వర్‌కే కాదు.. ప్రస్తుతం కళాశాల విద్యార్థులందరికీ ఇదే అనుభవం ఎదురవుతోంది. విషయం అధికారుల దృష్టికి వెళ్లినా స్పందన కరువైంది. లిఖితపూర్వక ఫిర్యాదు లేదన్న సాకుతో చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: కొత్త కొత్త పేర్లతో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసే ప్రైవేటు కళాశాలలు తాజాగా కొత్త దందా షురూ చేశాయి. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కోసం చిల్లర వసూళ్లకు ఉపక్రమించాయి. ఈపాస్ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు సమర్పించిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో భాగంగా కాలేజీలో వేలిముద్రలు సమర్పించాలి. ఇవి సరిపోలితేనే దరఖాస్తు సంబంధిత సంక్షేమ శాఖకు చేరవేసే వీలుంటుంది. ఈ నెల 15వ తేదీ నాటికి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ముగిసింది. దీంతో తాజాగా ఆయా దరఖాస్తుల పరిశీలన మొదలైంది. ముందుగా ఈపాస్ వెబ్‌సైట్లో నమోదైన దరఖాస్తు సంబంధిత జిల్లా సంక్షేమాధికారి ఐడీకి వెళ్తుంది. అక్కడ ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా సంఖ్య వెరిఫికేషన్ అయ్యాక... బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం కళాశాల ఐడీకి దరఖాస్తులను బదిలీ చేస్తారు.
డబ్బులిస్తే సరి...
ఈ ఏడాది ఉపకార వేతనాలు, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ శాఖల పరిధిలో 13.68 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న వారిలో ఎక్కువమంది ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పైనే ఆధారపడ్డారు. అవి మంజూరు కాకుంటే వారి కోర్సు పూర్తవడం కష్టమే. ఈ చిన్న విషయాన్ని సాకుగా చేసుకున్న కాలేజీ సిబ్బంది చిల్లర వసూళ్లకు తెగబడ్డారు. వేలిముద్రలు సమర్పించే సమయంలో నిర్ణీత మొత్తంలో ఫీజు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఇందులో అధికంగా ఇంజనీరింగ్, పీజీ కాలేజీలే ఉన్నాయి.
ఒక్కో కాలేజీకి ఒక్కో రేటు
కాలేజీల్లో ఒక్కో చోట ఒక్కో రకంగా వసూళ్ల దందా కొనసాగుతోంది. హయత్‌నగర్, ఇబ్ర హీంపట్నం సమీపంలో ఉన్న కాలేజీల్లో రూ.300 వరకు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఘట్‌కేసర్, మొయినాబాద్ ప్రాంతం లో ఉన్న కాలేజీల్లో రూ.200గా నిర్ణయించారు. అలా డబ్బులు ఇచ్చిన విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే ఆమోదిస్తూ... డబ్బులు చెల్లించని విద్యార్థుల దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతున్నారు. ఈ విషయంపై ఎస్సీ అభివృద్ధి శాఖకు మౌఖిక ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతు న్నారు. కానీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాసిస్తే కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెడు తుందని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.