అంగట్లో వైద్య సీట్లు | Medical seats in the market | Sakshi
Sakshi News home page

అంగట్లో వైద్య సీట్లు

Published Tue, Apr 26 2016 4:30 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

అంగట్లో వైద్య సీట్లు - Sakshi

అంగట్లో వైద్య సీట్లు

♦ కోట్లు పలుకుతున్న ఎంబీబీఎస్
♦ భారీగా ‘రిజర్వు’ చేసుకున్న ప్రైవేటు కాలేజీలు
♦ బీ కేటగిరీ సీట్లకు తూతూమంత్రంగా ప్రవేశ పరీక్ష    
♦ మరోసారి ఫీజులు పెంచాలని ఏఎఫ్‌ఆర్సీకి ప్రతిపాదన?
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైద్య సీట్లు అంగడి సరుకుగా మారాయి. ఇంటర్ ఫలితాలు రావడానికి ముందే ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎక్కడికక్కడ సీట్లను అమ్మకానికి పెట్టాయి. ముందస్తు అడ్వాన్సు సొమ్ము చెల్లించిన వారికి వాటిని రిజర్వు చేసి ఉంచాయి! ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్, ప్రైవేటు మెడికల్ యాజమాన్యాలు నిర్వహించే ప్రత్యేక వైద్య ప్రవేశ పరీక్షలు ఇంకా దరఖాస్తుల ప్రక్రియ స్థాయిలో ఉండగానే పలు ఎంబీబీఎస్ సీట్లను అడ్వాన్సులు పుచ్చుకొని ఇప్పటికే అమ్మేసినట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు.

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా మినహా మిగతా సీట్లు చాలావరకు ‘రిజర్వ్’ అయిపోయాయని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ప్రైవేటు కాలేజీల వద్ద ఉన్న బీ కేటగిరీ సీట్లలో దాదాపు సగం వరకు ఇప్పటికే అమ్మేసుకోవడం, కొన్నింటిని రిజర్వులో పెట్టడం జరిగిపోయిందని అంచనా. తల్లిదండ్రులు కూడా డిమాండ్‌ను బట్టి ఒక్కో సీటును రూ. కోటి దాకా పెట్టి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కాలేజీ అయితే ఏకంగా రూ.కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. వసూలు చేసిన ‘ఫీజు’లకు రసీదుల వంటివేమీ ఇవ్వకుండా దళారుల చేతుల మీదుగానే దందా నడుస్తున్నట్లు తెలిసింది. ఏ కారణంతోనైనా సీటివ్వలేకపోతే వసూలు చేసిన ఫీజులో కొంత మినహాయించుకుని మిగతాది తిరిగిచ్చేలా ఒప్పందాలు కూడా జరిగిపోయాయని సమాచారం.

 అన్నిరకాలుగా ‘మేనేజ్’ చేసేశారు...
 తెలంగాణలో 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో మొత్తం 1,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో 50 శాతం సీట్లను ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌లో ర్యాంకు తెచ్చుకున్నవారికి ప్రభుత్వ ఫీజు ప్రకారం కేటాయిస్తారు. 35 శాతం (507) సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయాలి. మిగతా 15 శాతం (218) సీట్లను ఎన్నారై కోటా కింద కాలేజీల యాజమాన్యాలు నేరుగా భర్తీ చేసుకుంటాయి. ఈ సీట్లకు ఎంత వసూలు చేస్తారో ఎవరికీ అంతుబట్టదు. బీ కేటగిరీ సీట్లపైనే ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ప్రస్తుతం దృష్టి పెట్టాయి. వాటికి ప్రత్యేకంగా నిర్వహించనున్న ప్రవేశ పరీక్షను ఏమాత్రం లెక్కచేయకుండా సీట్లను ఇప్పటికే అనేక అక్రమ మార్గాల్లో నింపుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. గతేడాది ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించినా చివరికి తమకిష్టమైన వారికే సీట్లిచ్చుకున్న యాజమాన్యాలు, ఇప్పుడు కూడా కొందరు అధికారులను తమకు అనుకూలంగా మార్చుకుని... ప్రవేశ పరీక్ష దరఖాస్తు మొదలు ఫలితాల దాకా అన్ని రకాలుగా ఇప్పటికే ‘మేనేజ్’ చేసుకున్నట్టు తెలిసింది.
 
 ఫీజు పెంపునకు ప్రతిపాదన...
 మరోవైపు బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లకు ఫీజులు పెంచాలంటూ కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ)కి ప్రతిపాదించినట్లు సమాచారం. ఏడాదికి రూ.9 లక్షలున్న బీ కేటగిరీ సీటు ఫీజును రూ.11-13 లక్షల దాకా, రూ.11 లక్షలున్న సీ కేటగిరీ (ఎన్నారై) సీటుకు రూ. 15-20 లక్షల వరకు పెంచాలని కోరుతున్నట్టు తెలిసింది. పీజీ వైద్య సీట్ల ఫీజులనూ పెంచాలని అవి కోరుతున్నాయి.
 
 బీ కేటగిరీ సీట్లన్నీ పకడ్బందీగా భర్తీ చేస్తాం
  బీ కేటగిరీ సీట్లను ప్రైవేటు యాజమాన్యాలు ముందే అమ్మేసుకున్నాయన్న ఆరోపణల్లో వాస్తవంలేదు. ప్రత్యేక ప్రవేశ పరీక్షతో వాటికి సంబంధం లేదు. దాన్ని మా ఆధ్వర్యంలోనే నిర్వహిస్తాం. అందులో ర్యాంకులు సాధించిన వారికే సీట్లు దక్కుతాయి. ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నాం. ప్రైవేటు యాజమాన్యాలకు ఎన్నారై కోటా సీట్లపైనే హక్కుంది తప్ప బీ కేటగిరీపై లేదు.
 - పాపిరెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement