నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ఇక్కడ అన్ని ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడును | Telangana Study Circle For Government Job Aspirants Adilabad | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ఇక్కడ అన్ని ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడును

Published Fri, Mar 25 2022 10:03 AM | Last Updated on Fri, Mar 25 2022 3:45 PM

Telangana Study Circle For Government Job Aspirants Adilabad - Sakshi

ఆదిలాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగం ప్రతీ నిరుద్యోగి కల.. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల్లో కొలువులు తగ్గుతుండగా, నిరుద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు కొలువులు భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలే అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను ప్రకటించారు. త్వరలోనే భర్తీకి నోటిపికేషన్లు ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు, సర్కారు కొలువు కల నెరవేర్చుకునేందుకు ఎస్సీ, బీసీ, స్టడీ సర్కిళ్లు సన్నద్ధమవుతున్నాయి. 

జిల్లా కేంద్రంలో రెండు స్టడీ సర్కిళ్లు.. 
సర్కారు కొలువు సాధించాలనే లక్ష్యంతో పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుపేద నిరుద్యోగులకు దారిచూపుతున్నాయి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు. కొందరు ప్రిపరేషన్‌ కోసం హైదరాబాద్, వరంగల్‌ వంటి నగరాలకు తరలుతున్నారు. మరికొందరు ఇంటి వద్దే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి, ప్రైవేట్‌ శిక్షణను పొందలేని, సరిగ్గా పుస్తకాలు సైతం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి స్థానికంగా ఉన్న స్టడీ సర్కిళ్లు ఆశా దీపాలుగా నిలుస్తున్నాయి. 

స్టడీ సర్కిళ్లలో సౌకర్యాలు...
బీసీ స్టడీ సర్కిల్‌కు రూ.3.75 కోట్ల నిధులతో 2019లో అధునాతన భవనాన్ని నిర్మించారు. ఇందులో కాన్ఫరెన్స్‌ హాల్, డిజిటల్‌ లైబ్రరీ, స్టడీ హాల్, డైనింగ్‌ హాల్, క్లాస్‌ రూం, గెస్ట్‌రూంలు, 16 హాస్టల్‌ రూంలు ఉన్నాయి. 
ఎస్సీ స్టడీ సర్కిల్‌ను 2016 అక్టోబర్‌లో ప్రారంభించారు. 
ఈ రెండు కేంద్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందజేయడమే కాకుండా వారిలో వివిధ నైపుణ్యాలు అభివృద్ధి చెందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. 
 ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు     కల్పిస్తున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో 3,176 ఉద్యోగ ఖాళీలు..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లోని 3,176 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 1,193, మంచిర్యాల 1,025, నిర్మల్‌ 876, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ 825 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు తమ కొలువుల కల సాకారం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.  

సాధించిన విజయాలు..
ఇప్పటి వరకు బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా 2,395 మంది అభ్యర్థులకు వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ అందించారు. 
220 మంది ప్రభుత్వ కొలువులు సాధించారు. వీరిలో 10 మంది రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించారు. 
అత్యధికంగా 60మంది పోలీస్‌ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. 35మంది ఉపాధ్యాయులుగా, 43మంది పంచాయతీ సెక్రెటరీలుగా, 20మంది గురుకుల ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
జాబ్‌మేళా ద్వారా 500మంది ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు సాధించారు. 
ఎస్సీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఇప్పటివరకు 600 మందికి శిక్షణ పొందారు. 
107 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 
  43 మంది ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు సాధించారు. 

డిజిటల్‌ శిక్షణ...
స్టడీ సర్కిల్‌లో దాదాపుగా ప్రతీ బ్యాచ్‌లో 100మందికి శిక్షణ ఇస్తారు. ప్రభుత్వం కొలువులు భర్తీ చే యనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు పెద్దసంఖ్యలో నిరు ద్యోగులకు శిక్షణ అందజేయాలని భావిస్తున్నాయి. 
ఈ మేరకు డిజిటల్‌ విధానంలో శిక్షణ ఇవ్వడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. యూ ట్యూబ్, టీ–శాట్‌ చానళ్ల ద్వారా  శిక్షణ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 
టెలిగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా రోజుకు 100 పోటీ పరీక్షల ప్రశ్నలను అభ్యర్థులకు తెలియజేయనున్నారు. డిజిటల్‌ శిక్షణ విధానంలో 2వేల నుంచి పది వేల మందికి శిక్షణ అందించే వెసులుబాటు ఉంది.

అత్యున్నత శిక్షణ ఇస్తున్నారు..
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందుతున్నాను. ఉపాధ్యాయ నియామక పరీక్షకు, అదేవిధంగా గ్రూప్‌–1, గ్రూప్‌–2 నియామక పరీక్షలకు సిద్ధమవుతున్నాను. స్టడీ సర్కిల్‌లో ఉచిత వసతితో పాటు నిత్యం 8గంటలు శిక్షణ ఇస్తున్నారు. 
– రాజ్‌కుమార్, బెజ్జూర్, కుమురంభీం ఆసిఫాబాద్‌

ప్రణాళికాబద్ధంగా చదువుతున్న
స్టడీ సర్కిల్‌లో చక్కని శిక్షణ ఇస్తున్నారు. కానిస్టేబు ల్, ఎస్సై ఉద్యోగాల కో సం ప్రయత్నిస్తున్నాను. రెండు ఉద్యోగాలను సాధించే దిశగా ప్రణాళి కాబద్ధంగా చదువుతున్న. మొదటిసారి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పటికీ, స్టడీ సర్కిల్లో శిక్షణ ద్వారా మార్గనిర్ధేశం చేస్తున్నారు. ఉద్యోగం సాధిస్తాననే నమ్మకంతో ఉన్న.
–జే.సుప్రియ, ఆదిలాబాద్, ఎస్సీ స్టడీ సర్కిల్‌

త్వరలోనే తరగతులు... 
బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ తరగతులు ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభిస్తాం. గురుకుల, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన శిక్షణ ఇస్తాం. అన్ని వసతులతో కూడిన అధునాతన భవనంలో శిక్షణ అందిస్తాం. అభ్యర్థులను స్కీన్రింగ్‌ టెస్ట్‌ లేదా మెరిట్‌ ద్వారా ఎంపిక చేస్తాం. –ప్రవీణ్‌ 
కుమార్, బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్, ఆదిలాబాద్‌

లక్ష్యం చేరడానికి మార్గం..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగులకు తీపి కబురు. ఇటువంటి సమయంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎస్సీ, స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ పొంది తమ లక్ష్యం చేరడానికి మార్గం వేసుకోవాలి. ఎస్సీ, స్టడీ సర్కిల్లో నియామక ప్రకటనలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణ అందజేస్తాం. నిరుద్యోగులు తమ కొలువు కల సాధించే దిశగా  కృషి చేస్తాం. 
–రమేశ్, ఎస్సీ స్టడీసర్కిల్‌ డైరెక్టర్, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement