భోపాల్: పెరుగుతున్న జనాభా, కరోనా తర్వాతి పరిస్థితులు.. ఇలా పలు కారణాలతో దేశంలో నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది. మరోవైపు పోటీ ప్రపంచంలోనూ తీవ్రత ఊహించని రీతిలోనే ఉంటోంది. తాజాగా పట్వారీ కొలువుల కోసం ఏకంగా 12 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్‌లో ల్యాండ్ రెవెన్యూ అధికారుల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్. అటు ఇటుగా ఆరు వేల దాకా ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే పోటీ ఎంతలా ఉందంటే.. ఏకంగా ఈ పోస్టుల కోసం పన్నెండున్నర లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీళ్లలో పీహెచ్‌డీ చేసిన వాళ్లతో పాటు ఇంజినీరింగ్ స్డూడెంట్స్, ఎంబీఏ చదివిన వాళ్లు సైతం ఉన్నారు.
మొత్తం 12.79 లక్షల మంది అభ్యర్థులకుగానూ.. వెయ్యి మంది హీహెచ్‌డీ చేసిన వాళ్లు, 85 వేలమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్, లక్ష దాకా ఎంబీఏ చేసిన వాళ్లు, మరో రెండు లక్షల మంది ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వాళ్లు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగ శాతం 1.9 గా ఉందని ఈ జనవరిలో సీఎంఐఈ(సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) నివేదిక ఇచ్చింది. ఈ తరుణంలో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందన్న వాదనను తోసిపుచ్చుతున్నారు. ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్తున్నారాయన. ఇదిలా ఉంటే.. తాజా నోటిఫికేషన్ అభ్యర్థుల గణాంకాలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగవకాశాలను కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment