
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్, చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, కమిషనర్ చిరంజీవులు తదితరులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరోసారి ప్లాట్‌ల వేలానికి సిద్ధమైంది. మొత్తం 95 ప్లాట్‌ల వేలానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన తొమ్మిది లేఅవుట్లలోని 82 ప్లాట్లు, హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన నాలుగు ప్రైవేట్ లేఅవుట్లలోని 13 ప్లాట్లు ఉన్నాయి. వీటి ఈ–వేలానికి సంబంధించిన బ్రోచర్‌ను బేగంపేట్ క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్... హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు, కార్యదర్శి బీఎస్ లత, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నరేందర్, ఎస్టేట్ అధికారి గంగాధర్, సీఐవో సుబ్రమణ్యంలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో కమిషనర్ చిరంజీవులు వేలం వివరాలను మీడియాకు తెలిపారు.
ఈ–వేలం ద్వారా 1,44,500.19 చదరపు గజాల విస్తీర్ణంలోని 95 ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఏప్రిల్‌లో 229 ప్లాట్‌లను పారదర్శకంగా విక్రయించామని, అదే విధానంలో ఈసారీ వేలం వేస్తున్నామన్నారు. ప్రస్తుత ప్లాట్‌లలో అత్యధికంగా ‘ది ప్రైడ్ ఆఫ్ హెచ్‌ఎండీఏ’ నినాదంతో ఉప్పల్ భగాయత్‌లో అభివృద్ధి చేసిన 67 ఉన్నాయని.. వీటి విక్రయం ద్వారానే దాదాపు రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. మిగిలిన 28 ప్లాట్ల విక్రయాలతో మరో రూ.100 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న భూమి విలువకు ఒకటిన్నర నుంచి మూడున్నర రేట్లు ఎక్కువగా ధర నిర్ణయించినట్లు చెప్పారు. అయితే వేలంలో ఒకే బిడ్డరు పాల్గొంటే.. దాన్ని రద్దు చేసి రెండోసారి నిర్వహిస్తామన్నారు. ఏ దశలోనైనా వేలాన్ని రద్దు చేసే అధికారం హెచ్‌ఎండీఏకు ఉందన్నారు. ఆన్‌లైన్‌లో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌కుసెప్టెంబర్ 6 ఆఖరని, అదే నెల 8న ఉప్పల్ భగాయత్‌లోని ప్లాట్లు, 9న మిగిలిన ప్లాట్లు విక్రయిస్తామన్నారు.
గజం రూ.28 వేలు...
2005లో మూసీ డెవలప్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ రైతుల నుంచి 733 ఎకరాలు సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, మురుగు నీటి శుద్ధి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో ‘ఉప్పల్ భగాయత్’ పేరుతో లేఅవుట్ అభివృద్ధి చేసింది. భూములు కోల్పోయిన 1,520 మంది రైతులకు గతేడాది ప్లాట్‌లు కేటాయించింది. మిగిలిన 67 ప్లాట్‌లను ఇప్పుడు విక్రయిస్తోంది. గజానికి రూ.28వేలు ధర నిర్ణయించారు. వీటి ద్వారా రూ.500 కోట్ల ఆదాయం రానుంది. అలాగే ఇక్కడి ఫేజ్–2, ఫేజ్–3 ప్లాట్‌లను కూడా విక్రయిస్తే మరో రూ.500 కోట్ల ఆదాయం వస్తుంది.
ఎక్కడెక్కడ..?
హెచ్‌ఎండీఏ లేఅవుట్లలో 82 ప్లాట్లు ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో ఉప్పల్ భగాయత్‌లోని 67, గత ఏప్రిల్‌లో విక్రయించిన ప్రాంతాల్లో మిగిలిన 15 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో అత్తాపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని రెండు ప్లాట్లు, ముష్క్‌మహల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని ఒక ప్లాట్, చందానగర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని ఒక ప్లాట్, మైలార్‌దేవ్‌పల్లి మధుబన్ రెసిడెన్షియల్ కాలనీలోని ఆరు ప్లాట్లు, నల్లగండ్ల రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లోని ఒక ప్లాట్, వనస్థలిపురం రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని ఒక ప్లాట్, నెక్నాంపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని రెండు ప్లాట్లు, తెల్లాపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని ఒక ప్లాట్ ఉన్నాయి. అదేవిధంగా హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన బాచుపల్లి, దూలపల్లి, జల్‌పల్లి గ్రామాల్లోని ప్రైవేట్ లేఅవుట్లలోని 13 గిఫ్ట్ డీడీ ప్లాట్లు కూడా విక్రయానికి ఉంచారు.
రిజిస్ట్రేషన్ ఫీజు మళ్లీనా.?
హెచ్‌ఎండీఏ ఏప్రిల్‌లో నిర్వహించిన 229 ప్లాట్ల ఆన్‌లైన్ విక్రయాలను థర్డ్ పార్టీగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏడాది పాటు ఏ వేలంలోనైనా పాల్గొనే వీలుండేలా నిబంధనలు పొందుపరిచారు. అయితే ఇది పెద్ద మొత్తంతో కూడుకున్నది కావడంతో కమిషనర్ కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000 వరకు తగ్గించగలిగారు. దీంతో వేలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరోసారి హెచ్‌ఎండీఏ వేలం నిర్వహిస్తే అవకాశం ఉంటుందనుకున్నారు. ఈసారి ఎంఎస్‌టీసీ లిమిటెడ్ కాకుండా ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఈ–వేలం ప్రక్రియను అప్పగించారు. దీంతో ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌లో ఈ–వేలం కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వేలంలో ఉచిత రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై హెచ్‌ఎండీఏ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రిజిస్ట్రేషన్ ఇలా...
ఈ వేలంలో పాల్గొనాలకునేవారు hmda.auctiontiger.net వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో ‘ఉప్పల్ భగాయత్ ఈ–అక్షన్’ లింక్‌పై క్లిక్ చేస్తే నేరుగా పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు. అందులో కుడివైపునుండే రిజిస్టర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. సెప్టెంబర్ 6 సాయంత్రం 5గంటల్లోపు రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వేలం జరిగే సెప్టెంబర్ 8, 9తేదీల్లో తమకు కేటాయించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో జిఝఛ్చీhmda.auctiontiger.net వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి, హెచ్‌ఎండీఏ నిర్ధరించిన ధరలో 10శాతం ఈఎండీ రూపంలో చెల్లించాలి. బిడ్డరు వేలంలో పాల్గొనేటప్పుడు కనీసం రూ.100 ఎక్కువగా కోట్ చేయాలి. అత్యధిక ధర కోట్ చేసిన వారికి ఈ–వేలం ప్రక్రియ ముగిసిన వెంటన సమాచారం పంపిస్తారు. ఇందులో సక్సెస్‌ఫుల్ బిడ్డర్ ప్లాట్ నిర్ధరిత ధరలో 25 శాతం డబ్బులు వారంలోగా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే మిగిలిన 75 శాతం డబ్బును రెండు నెలల్లోగా హెచ్‌ఎండీఏకు చెల్లించాలి. లేని పక్షంలో ఇన్‌స్టాల్‌మెంట్ల వారీగా వడ్డీతో సహా కట్టాలి. బ్యాంక్ ద్వారా రుణసదుపాయం పొందేందుకు కొనుగోలుదారులకు అవసరమైన ప్రమాణ పత్రాన్ని కూడా హెచ్‌ఎండీఏ జారీ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment