సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లోని హెచ్‌ఎండీఏ స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అందుబాటు ధరల్లో ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎమ్మెస్‌టీసీ ఈ వేలం ప్రక్రియను నిర్వహించనుంది. మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు ఈ ల్యాండ్ పార్సిళ్లను కొనుగోలు చేసేందుకు అనుగుణంగా స్థలాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఔటర్‌రింగ్ రోడ్డుకు దగ్గరలో 39 ల్యాండ్ పార్సిళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 ప్లాట్‌లు, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిళ్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ స్థలాల వివరాలను కేఎంఎల్ ఫైల్ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది. 121 నుంచి 10,164 గజాల వరకు ఈ స్థలాలు ఉన్నాయి. గండిపేట వద్ద 3 ప్లాట్‌లు, శేరిలింగంపల్లిలో 5, ఇబ్రహీంపట్నంలో 2 ప్లాట్‌లు, అమ్మకానికి ఉన్నాయి. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో 4, ఘట్కేసర్‌లో 1, బాచుపల్లిలో 1 చొప్పున ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో 16, ఆర్‌సీపురంలో 6 ప్లాట్‌లు, జిన్నారంలో ఒకటి చొప్పున స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.
ఆన్‌లైన్ వేలం..
39 స్థలాలను వచ్చే నెల మార్చి 1న ఎమ్మెస్‌టీసీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్ కలిగిన ఈ స్థలాలను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది. ఆన్‌లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెస్‌టీసీలో నమోదు చేసుకోవాలి.
ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన ఈఎండీ (ధరావత్తు) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా పరిధిలోని స్థలాలకు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని స్థలాలకు ఆర్‌సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో 23న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్థలాలపై ఉప్పల్ సర్కిల్ ఆఫీసులో ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహించనున్నారు.
చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి!
Comments
Please login to add a commentAdd a comment