
రాయలసీమకే తలమానికంగా వెలుగొందుతూ సూపర్ స్పెషాలిటీ సేవలందిస్తున్న స్విమ్స్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. ముఖ్యంగా పరిపాలనా విభాగంలో కీలక పదవుల్లో ఉన్న సీఎం బంధువులు సూపర్‌బాస్‌లుగా మారారు. చిన్నచిన్న కాంట్రాక్టు పనులు మొదులుకుని ఉద్యోగాల భర్తీ వరకు అన్నీ తామై వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాకుండానే అడహక్ పద్ధతిలో సీఎం బంధువును నెట్‌వర్క్ ఇంజినీర్‌గా నియమించడమే ఇందుకు నిదర్శనం.
తిరుపతి (అలిపిరి) : స్విమ్స్ కంప్యూటర్ సెక్షన్లలో పనిఒత్తిడి పెరిగిందని, అందుకు తగ్గట్టుగా నెట్‌వర్క్ ఇంజినీర్‌ను నియమించాలని సీఎం బంధువులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఒక పర్మినెంట్ పోస్ట్‌ను క్రియేట్ చేశారు. చెన్నైలో ఎంఎన్‌సీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినిర్‌గా పనిచేస్తున్న తేజ అనే వ్యక్తిని అత్యంత రహస్యంగా నెట్‌వర్క్ ఇంజినీర్‌గా నియమించారు. అతనికి నెలకు స్విమ్స్ నిధుల నుంచి రూ.50 వేల వేతనం చెల్లిస్తున్నారు. ఆరు నెలల క్రితం అత్యంత రహస్యంగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి స్వయానా స్విమ్స్ పర్చేజింగ్ విభాగం ఇన్‌చార్జ్ అన్న కొడుకు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
నిబంధనలు గాలికి
స్విమ్స్‌లో అడహక్ పద్ధతిలో నియమించాలంటే తప్పనిసరిగా నోటిఫికేషన్ విడుదల చేయాలి. అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులను కమిటీ పరిశీలించి అర్హతలున్న వ్యక్తిని నియమించాలి. స్విమ్స్ నెట్‌వర్క్ ఇంజి నీర్ నియామకంలో ఇవేమీ పాటించలేదు. సీఎం సమీప బంధువు కావడంతో పర్మినెంట్ పోస్ట్‌లో నియమించేశారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా డైరెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి నియామక ఉత్తర్వులు జారీ చేశారన్న విమర్శలు ఉన్నాయి.
పట్టించుకోని డైరెక్టర్
స్విమ్స్‌లో అవినీతి రాజ్యమేలుతున్నా డైరెక్టర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. పరిపాలనా పరమైన కీలక పదవుల్లో సీఎం బంధువులు ఉండడం కూడా ఇందుకు ప్రధాన కారణమన్న ప్రచారం జరుగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన స్విమ్స్‌లో సీఎం బంధువులు అవినీతికి పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం.
ప్రతిభ ఆధారంగా నియామకం
స్విమ్స్ కంప్యూటర్ సెక్షన్‌లో పనిఒత్తిడి పెరిగింది. ఉద్యోగులపై పనిభారం పెరగడంతో నెట్‌వర్క్ ఇంజినీర్‌ను నియమించాలని భావించాం. ప్రతిభ ఆధారంగా అడహాక్ పద్ధతిలో పోస్టును భర్తీ చేశాం.
– ఆదిక్రిష్ణయ్య, పర్సనల్ మేనేజర్, స్విమ్స్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment