స్టడీ సర్కిల్ ఏది..? | Study Circle? | Sakshi
Sakshi News home page

స్టడీ సర్కిల్ ఏది..?

Published Mon, Sep 14 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

స్టడీ సర్కిల్ ఏది..?

స్టడీ సర్కిల్ ఏది..?

ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సెంటర్
నివేదిక సిద్ధం చేయాలంటూ ఆదేశాలు
పట్టించుకోని అధికారులు
ప్రవేశ పరీక్ష జరిగినా కానరాని పురోగతి
నోటిఫికేషన్లు జారీచేస్తున్న టీఎస్‌పీఎస్సీ
ఆందోళనచెందుతున్న అభ్యర్థులు

 
 హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో రెండో స్టడీసర్కిల్‌ను నిర్వహించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ సిద్ధంగా ఉన్నా.. స్థానిక అధికారుల నుంచి స్పందన కరువైంది. సెప్టెంబర్ మొదటివారంలోగా వరంగల్‌లో స్టడీ సెంటర్ ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. అధికారుల్లో చలనం లేదు. గడువు ముగిసినా.. విలువైన సమయం హరిస్తున్నా.. స్టడీ సర్కిల్ ఏర్పాటు
వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
 
 
హన్మకొండ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శ్రీకారం చుట్టింది. గడిచిన మూడు నెలలుగా వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో దళిత నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో స్టడీసర్కిల్  నెలకొల్పాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతనెలలో ఈ శాఖకు చెందిన డెరైక్టరు సుబ్రహ్మణ్యం వరంగల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. స్టడీసర్కిల్ నిర్వాహణకు సంబంధించి ఫ్యా కల్టీ ఎంపిక, స్టడీ సెంటర్ నిర్వాహనకు అవసరమైన సి బ్బంది, బాలురు, బాలికలకు వేర్వేరుగా శిక్షణ లేదా ఒకే క్యాంపస్‌లో శిక్షణ, వసతితో కూడిన శిక్షణ లేక వసతి లేకుండా శిక్షణా ఇవ్వాలా అనే అంశాలపై వెంటనే నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందివ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ మొదటివారంలో శిక్షణ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 చలనం లేదు
 స్టడీ సర్కిల్ నిర్వహనకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించడంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో స్టడీ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి కసరత్తు మొదలుపెట్టలేదు. మరోవైపు వరంగల్‌లో స్టడీ సర్కిల్ ఏర్పాటుపై కతృనిశ్చయంతో ఉన్న రాష్ట్రస్థాయి అధికారులు 2015 ఆగస్టు 16వ తేదీన ఉద్యోగార్థులకు నగరంలో ప్రవేశ పరీక్ష సైతం నిర్వహించారు. వందలాది మంది దళిత, దళితేతర నిరుద్యోగులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలు విడుదల చేసిన వెంటనే శిక్షణ ప్రారంభించాల్సి ఉంటుంది. కోచింగ్‌కు సిద్ధమవుదామని కళ్లలో వొత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ జిల్లా నుంచి ఎటువంటి రిపోర్టు అందనందున ఫలితాల విడుదలలో జాప్యం చోటు చేసుకుంటోంది.  స్టడీ సర్కిల్ ఏర్పాటు వివరాల కోసం కార్యాలయంలో సంప్రదిస్తే.. అధికారులు, సిబ్బంది స్టడీసెంటర్ ఏర్పాటుపై  అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు.

 విలువైన సమయం వృథా..
 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలకమైన గ్రూప్-1, గ్రూప్-2 తదితర పోస్టులకు సిలబస్ సైతం ప్రకటించింది. పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే కనీసం ఆర్నెళ్ల శిక్షణ, ప్రిపరేషన్ అవసరం.  ఇప్పటికే  వరంగల్‌లో బీసీ స్టడీ సర్కిల్‌లో కోచింగ్ క్లాసులు మొదలయ్యాయి. కానీ సాంఘిక సంక్షేమ శాఖ విభాగంలో  క్షేత్రస్థాయి అధికారుల్లో చలనం కరువైపోవడంతో స్టడీ సర్కిల్ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సంబంధించి జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే..ఈ పాటికి శిక్షణ మొదలయ్యేది. పేద దళిత విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్, బ్యాంకు తదితర పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంతో పాటు వసతి, లైబ్రరీ తదితర సౌకర్యాలు విద్యార్థులకు అంది ఉండేవి. గతకొంతకాలంగా  టీపీపీఎస్సీ సిలబస్‌ను ప్రకటించి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుండటంతో ఉద్యోగార్థుల్లో ఆందోళనమొదలైంది. స్టడీ సర్కిల్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా విలువైన సమయం కోల్పోవాల్సి వస్తుందని పేద దళిత ఉద్యోగార్థులు ఆవేదన చెందుతున్నారు.

 కమీషన్ల  కక్కుర్తితో..
 సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది కమీషన్ల కక్కుర్తి వ్యవహారంతో స్టడీ సర్కిల్ కోసం ఎంపిక చేయాల్సిన భవనం విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ మేరకు నగర పరిధిలో మూడు భవనాలను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఈ భవన యజమానులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి మధ్య అద్దె కమీషన్ల విషయంలో పేచీ పడుతున్నట్లుగా ఈ శాఖ సిబ్బందే చెవులు కొరుక్కుంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement