కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటాలోని ఖాళీల భర్తీ
ప్రకటనలు ఇచ్చి మరీ సీట్లు నింపుకుంటున్న ఇంజనీరింగ్ కళాశాలలు
హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటాలో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. స్పాట్ అడ్మిషన్ల పేరుతో సీట్లను భర్తీ చేస్తున్నాయి. నోటిఫికేషన్లు, ప్రకటనలు ఇచ్చి మరీ ఈ సీట్లను భర్తీ చేస్తుండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి ఎలాంటి అనుమతి లేకపోయినా స్పాట్ అడ్మిషన్ల పేరుతో మిగులు సీట్ల భర్తీకి యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. అయితే ప్రముఖ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు మిగలకపోయినా, మేనేజ్‌మెంట్ కోటాలోని సీట్లను చాలా వరకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక మధ్యతరహా కాలేజీలు మాత్రం ఉన్నత విద్యా మండలి ఆమోదం లేకపోయినా ప్రకటనలు జారీచేసి మరీ సీట్లను భర్తీ చేస్తుండడంతో భవిష్యత్తులో వాటికి ర్యాటిఫికేషన్ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆగస్టు 31తోనే ఆఖరు..
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్టు 31తోనే ప్రవేశాల ప్రక్రియ ముగిసిపోయింది. అప్పటివరకు కన్వీనర్ కోటాలోనే ఆంధ్రప్రదేశ్‌లో 57వేల సీట్లు, తెలంగాణలో 15వేల సీట్లు మిగిలిపోయాయి. రెండు రాష్ట్రాల్లో మేనే జ్‌మెంట్ కోటాలో మరో 80 సీట్లు ఉండిపోయాయి. అయితే ఆగస్టు 31 తరువాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీని ఉన్నత విద్యామండలి నిలిపివేసింది. కౌన్సిల్ ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా మేనే జ్‌మెంట్ కోటా సీట్లకోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 30 వేల మందికి యాజమాన్యాలు సీట్లను కేటాయించేలా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిన్నకుండిపోయింది. అయితే యాజమాన్యాలు మాత్రం ప్రకటనలు జారీచేసి మరీ ఆ సీట్ల భర్తీకి గతంలోనే చర్యలు చేపట్టాయి. తాజాగా మేనేజ్‌మెంట్ కోట్లా, కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ పేరుతో ప్రకటనలు జారీ చేసి భర్తీ చేసుకుంటున్నాయి. అయితే ఆగస్టు 31 తర్వాత చేపట్టిన, చేపడుతున్న ఈ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ర్యాటిఫికేషన్ ఎలా ఇస్తుందన్నదీ ప్రశ్నార్థంగా మారింది.
అనుమతి లేకున్నా స్పాట్ అడ్మిషన్లు!
Published Sun, Oct 12 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement
Advertisement