ఉద్యోగాల భర్తీలో నాన్చుడు ధోరణి
నిజామాబాద్ నాగారం : తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన విద్యార్థులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ నవ నిర్మాణ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగు పడతాయని భావించిన విద్యార్థులకు నిరాశే మిగిలిందన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్‌లో నిర్వహించిన విద్యార్థి సేన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ హామీని మర్చిపోయాడని విమర్శించారు. ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలనే తపనతో అప్పులు చేసి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. డీఎస్సీ విషయంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని తెలిపారు. కేజీ టు పీజీ విద్యా అమలు చేయలేదని, ఎంసెట్ లీకేజీకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, డిగ్రీ ఆన్‌లైన్ విషయంలో అన్ని ఇబ్బందులే ఉన్నాయన్నారు. అందుకే విద్యార్థులు మరోసారి ఉద్యమించడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్యలపై త్వరలో జిల్లాలో భారీ బహరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, నేతలు రవీంద్రయాదవ్, శేఖర్, వినయ్‌కుమార్, కిషోర్, నవీన్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.