విద్యార్థి, నిరుద్యోగుల ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ బుధవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నేతలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ఎన్‌సీసీ గేటువైపు వచ్చారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు... ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.
కొందరు పోలీసు వలయాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు యత్నించగా... వారిని అదుపులోకి తీసుకుని, సమీప పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దీనిని నిరసిస్తూ ఆందోళనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు. అయితే పోలీసులు సంయమనం పాటించడంతో అవాంఛనీయ ఘటనలేమీ జరగలేదు.
కాగా.. చలో అసెంబ్లీ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ముందుగానే విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్, అధ్యక్షుడు మానవతారాయ్‌ను అదుపులోకి తీసుకుని, బుధవారం సాయంత్రం వదిలేశారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలను విడనాడి వెంటనే ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని, లేదంటే ఓట్లు వేసి గెలిపించిన విద్యార్థులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.