కొలువుల జాతర | Job fair | Sakshi
Sakshi News home page

కొలువుల జాతర

Published Thu, Apr 9 2015 2:30 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

కొలువుల జాతర - Sakshi

కొలువుల జాతర

  • 5,565 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  • ఈ నెలలోనే నోటిఫికేషన్ల జారీకి ఆదేశాలు
  • సాక్షి, హైదరాబాద్: వేలాది ఉద్యోగ నియామకాలకు రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీస్, విద్యుత్ , నీటిపారుదల శాఖల పరిధిలో మొత్తం 5,565 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ ఫైలుకు ఆమోదముద్ర వేయడంతో నియామకాల ప్రక్రియ వేగవంతం కానుంది.

    ఈ నెలలోనే సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేసేం దుకు ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రంలో అలజడి రేపిన ఉగ్రవాద కార్యకలాపాలు, వరుసగా చోటు చేసుకున్న కాల్పుల ఘటనల నేపథ్యంలో పోలీస్ విభాగంలో ఖాళీల భర్తీని వేగవంతంగాపూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలీసు స్టేషన్లలో మౌలిక వసతులకు, వాహనాలకు భారీ మొత్తంలోనే నిధులు వెచ్చించింది. తొలి బడ్జెట్‌లో హోం శాఖకు అత్యధిక నిధులు కేటాయించింది.

    ఇన్నోవా, ఫార్చునర్ వంటి ఆధునిక వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలను భారీగా కొనుగోలు చేసింది. దాదాపు 1810 కొత్త వాహనాలను సమకూర్చింది. కానీ వీటిని నడిపేందుకు డ్రైవర్ల కొరత నెలకొంది. దీంతో వాహనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అత్యవసరంగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో వాహనాన్ని నడిపేందుకు రెండు షిఫ్టులవారీగా ఇద్దరు డ్రైవర్లు అవసరమవుతారని హోం శాఖ సూచించడంతో 3,620 డ్రైవర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

    పోలీసు కానిస్టేబుళ్ల తరహాలోనే శారీరక, రాత పరీక్షల ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నారు. లైట్ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఈ పోస్టులకు అర్హులుగా పరిగణిస్తారు. దీంతో పాటు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ట్రాన్స్‌కో, డిస్కంలలో ఖాళీలను భర్తీ చేయడం అత్యవసరమని సర్కారు గుర్తించింది.

    తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోతో పాటు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని రెండు నెలల కిందట జెన్‌కో అధికారులు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో తొలి విడతగా జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంల పరిధిలో 1492 అసిస్టెంట్ ఇంజనీర్లు, 427 సబ్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇరిగేషన్ విభాగంలోనూ 26  డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.  
     
    పోలీస్ కానిస్టేబుళ్లు(డ్రైవర్లు): 3620
    ఇరిగేషన్ విభాగం(డీఈఈలు):  26
    విద్యుత్ శాఖలో పోస్టులు:   1919
    (అసిస్టెంట్ ఇంజనీర్లు: 1492, సబ్ ఇంజనీర్లు: 427)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement