ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా నిరుద్యోగుల సహనానికి పరీక్ష పెడుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మరోసారి స్పష్టమైందని ఏఐసీసీ సభ్యుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించడం వల్ల వేలాది మంది నిరుద్యోగ సోదరులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. వయసు పెరగంతో నియామక పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతున్నారనీ, తాజాగా చేపట్టిన పోలీసు ఉద్యోగాల నియామాకాల్లో ఆరేళ్లు వయో పరిమితి సడలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. దరఖాస్తుల స్వీకరణకు రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నందున వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. నిరుద్యోగుల పట్ల టీఆర్‌ఎస్ అలక్ష్యంగా వ్యహరిస్తోందని ధ్వజమెత్తారు. వయో పరిమితి సడలింపు డిమాండ్‌కు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని అన్నారు. ‘ఇప్పటివరకు విడుదలైన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వివాదాల్లో చిక్కుకోవడం మీ అసమర్థతకు నిదర్శనమ’ని లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చెప్పిన కొలువులు ఏవీ..!
‘ప్రతి జిల్లాకు పదివేల ఉద్యోగాలు అదనంగా వస్తాయని చెప్పారు. లక్షా ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామ’ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి మాట తప్పారని లేఖలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ద్వజమెత్తారు. ఉద్యోగ నియామకాల కోసం ప్రజాస్వామ్య బద్ధంగా నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలను అణచి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment