నిరుద్యోగులకు ‘పరీక్ష’! | Entrance Exams For Competitive Tension The Aspirants In Telangana | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 16 2018 4:21 AM | Last Updated on Sun, Sep 16 2018 8:07 AM

Entrance Exams For Competitive Tension The Aspirants In Telangana - Sakshi

శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ గురుకుల బోర్డు ఎదుట ధర్నా చేస్తున్న అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఏళ్లుగా చేస్తున్న తపస్సుకు ఆటంకం ఎదురవుతోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక సంస్థలు నిర్వహిస్తున్న అర్హత పరీక్షలన్నీ ఒకేసారి వచ్చిపడటంతో ఆశావహుల్లో అయోమయం తలెత్తుతోంది. వేరువేరు సమయాల్లో నోటిఫికేషన్లు రావడం.. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో వెలువడిన నోటిఫికేషన్లన్నింటికీ దరఖాస్తు చేసిన నిరుద్యోగి.. ఇప్పుడు ఒకేసారి పరీక్షలకు తలపడాల్సి వస్తోంది. ఉద్యోగ ఖాళీల అర్హత పరీక్షలు కొన్ని వరుసగా రాగా.. మరికొన్ని ఒకే రోజు జరగనుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంతకీ ఏ పరీక్షకు సన్నద్ధం కావాలి, ఎలా సిద్ధమవ్వాలి, అసలు పరీక్ష ఎలా రాయాలనే ప్రశ్న గందరగోళానికి గురిచేస్తోంది.

నెల రోజులు ‘కేంద్రం’పరీక్షలు
రాష్ట్రంలో 2 నెలల పాటు వరుసగా ఉద్యోగ అర్హత పరీక్షలు జరగనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ పరీక్షలు కాస్త వెనువెంటనే ఉన్నాయి. దీంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు. ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు)లో గ్రూప్‌ ‘డీ’కేటగిరీలో 62,907 ఖాళీలకు ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1.45 కోట్ల మంది దరఖాస్తు చేశారు. దీంతో రోజుకు సగటున 45 వేల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాబ ట్టి దాదాపు 45 రోజుల పాటు పరీక్షలు జరగనున్నా యి. ఇదే సమయంలో ఐబీపీఎస్‌ (బ్యాంకిం గ్‌) పరీక్షలూ నిర్వహిస్తున్నారు. ఈ నెల 29, వచ్చే నెల 7వ తేదీన ఐబీపీఎస్‌ పీవో పరీక్షలకు ఇటీవలే షెడ్యూల్‌ విడుదలైంది. దీనికి తోడు యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌), ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌) పరీక్షలు కూడా సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 10 వరకు వేర్వేరు తేదీల్లో ఉన్నాయి.  

ఉరుకులు.. పరుగులే..
ఇలా నెల రోజులు వరుసగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ని ఖాళీల భర్తీ పరీక్షలుండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలూ ఇవే తేదీల్లో ఉండటంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గురుకుల పాఠశాలల్లో దాదాపు 3 వేల ఖాళీలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 14 వరకు పీజీటీ, టీజీటీ అర్హత పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 30న కానిస్టేబుల్‌ పరీక్ష, వచ్చే నెల 7న గ్రూప్‌–4తో పాటు ఏఏఓ, ఎఎస్‌ఓ, డీపీఏ, బిల్‌ కలెక్టర్, జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలున్నాయి. కాబట్టి గురుకుల పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయాలంటే ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే. దీంతో పరీక్ష తేదీల్లో మార్పులు చేయాలని డిమాండ్‌ వినిపిస్తోంది.

గురుకుల పరీక్ష తేదీల్లో మార్పులు?
గురుకుల పరీక్షల తేదీలు మార్చాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. తేదీల మార్పు కోసం శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నియామకాల బోర్డు కార్యాలయం ఎదుట పలువురు అభ్యర్థు లు ధర్నా నిర్వహించారు. అనంతరం బోర్డు చైర్మన్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి కూడా వినతులు పెరుగుతుండటంతో సీఎస్‌ ఎస్‌కే జోషి స్పందించారు. పరీక్షల తేదీలను పునః సమీక్షించుకోవాలని, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని బోర్డుకు సూచించారు. దీంతో శనివారం సాయంత్రం గురుకుల బోర్డు సభ్యులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించా రు. పరీక్షల తేదీల్లో మార్పులపై త్వరలో స్పష్టత వస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement