
తొలుత కీలక పోస్టులే!
ఆ తర్వాతే చిన్నాచితకా పోస్టుల భర్తీ
నోటిఫికేషన్ల విడుదలపై సర్కారు కసరత్తు
విభాగాల వారీగా ప్రాధాన్య పోస్టుల వివరాల సేకరణ
హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఏయే పోస్టులను భర్తీ చేయాలనే అంశంపై తుది కసరత్తు జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విభాగాల వారీగా ఇప్పటికే 60 వేలకు పైగా ఖాళీల సమాచారాన్ని ఆర్థిక శాఖ సేకరించింది. వీటిలో పెద్దగా ప్రాధాన్యత లేని సాధారణ పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంపగుత్తగా ఖాళీలన్నింటినీ భర్తీ చేయటం సరికాదని.. దానివల్ల ఆర్థికంగా భారమే తప్ప, అవసరం నెరవేరదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రాధాన్య పోస్టులను తొలుత భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే గుర్తించిన ఖాళీల్లో అత్యవసరమైనవి, అత్యంత ప్రాధాన్యమైనవి ఏమిటనే లెక్కన సమాచారం సేకరిస్తున్నారు. ‘ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవో పోస్టులు కీలకం.
కానీ అందులో జూనియర్ అసిస్టెంట్లు, క్లర్కులు, అటెండర్, స్వీపర్ పోస్టులు ఇప్పటికిప్పుడు భర్తీ చేయడం అవసరం లేదు. అదే తరహాలో ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగంలో ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్ల అవసరముంది. అంతకన్నా దిగువ పోస్టులతో పెద్దగా పనిలేదు. కాలేజీల్లోనూ లెక్చరర్లకు తక్షణ ప్రాధాన్యం. నాన్ టీచింగ్ స్టాఫ్‌ను నియమించాల్సిన అవసరం లేదు.
ఇలా విభాగాల వారీగా తక్షణ అవసరమేమిటో లెక్క తేల్చాల్సి ఉంది...’ అని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. జూలైలో 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని, నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జూలై ముగింపు దశకు చేరుకున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో... నోటిఫికేషన్లు వెలువడుతాయా, లేదా అనే సందిగ్ధత నెలకొంది. తొలి విడతలో భర్తీ చేసేందుకు విభాగాల వారీగా ప్రాధాన్య పోస్టుల సమాచారం సేకరిస్తున్నామని, సీఎస్ ఆధ్వర్యంలో జరిగే తదుపరి సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఈ కసరత్తు ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకుంటారని, సీఎం ఆమోదించిన వెంటనే నోటిఫికేషన్లు జారీ అవుతాయని పేర్కొన్నాయి.