APPSC Exercise On Notifications To Be Issued In Near Future - Sakshi
Sakshi News home page

ఇక పోస్టుల భర్తీ చకచకా.. ఏపీపీఎస్సీ కసరత్తు

Published Thu, Aug 12 2021 10:46 AM | Last Updated on Thu, Aug 12 2021 1:31 PM

APPSC Exercise On Notifications To Be Issued In Near Future - Sakshi

సాక్షి, అమరావతి: ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు చకచకా భర్తీ కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపట్టి ఎప్పటికప్పుడు పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) కసరత్తు చేపట్టింది. ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి పోస్టుల భర్తీ ప్రక్రియను నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని నిర్ణయించింది. బుధవారం ఏపీపీఎస్‌సీ సమావేశం జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించారు. నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, అభ్యర్థుల ఎంపిక తదితర ప్రక్రియలను త్వరత్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ వంటి అంశాల్లో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 1,180 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్‌సీ నివేదించగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయడంపై సమావేశంలో చర్చించారు.

విడుదలైన నోటిఫికేషన్లలో పోస్టుల భర్తీపైనా ..
గత టీడీపీ సర్కారు ఐదేళ్లపాటు ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయించి చేతులు దులుపుకుంది. అప్పట్లో ప్రభుత్వంపై నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలతో ఉండటంతో వారిని పక్కదోవ పట్టించేందుకు, వారి దృష్టిని ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దారి మళ్లించేందుకు ఈ నోటిఫికేషన్లను ఇచ్చింది. కేవలం ఎన్నికల దృష్టితో ఇచ్చిన ఈ నోటిఫికేషన్లన్నీ లోపభూయిష్టంగా ఉండటం, అప్పట్లో జరిగిన పరీక్షలు, ఇతర అంశాలు అవకతవకల మయంగా మారడంతో వాటిపై న్యాయపరమైన, ఇతర వివాదాలు తలెత్తాయి.

అప్పటి నోటిఫికేషన్లకు సంబంధించిన పలు పోస్టులకు సంబంధించి న్యాయ వివాదాలను పరిష్కరింపచేస్తూ ప్రస్తుత కమిషన్‌ భర్తీ చేసింది. మొత్తం 32 నోటిఫికేషన్లకు సంబంధించిన 3,944 పోస్టులలో ఇప్పటికే 3,013కి పైగా పోస్టుల్లో నియామకాలను ప్రస్తుత కమిషన్‌ పూర్తి చేయించింది. ఇతర పోస్టులపైనా వివాదాలను పరిష్కరింపజేసి నియామకాలు పూర్తి చేయించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. కోర్టు కేసులతో ఆగిపోయిన నియామకాలను తీర్పులు వచ్చిన వెంటనే భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి ఇటీవల ఆమోదం లభించిన 1,180 పోస్టులతో పాటు మరికొన్ని గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి అవకాశముందని, వాటన్నిటినీ కలుపుకుని ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కమిషన్‌ వర్గాలు వివరించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement